40.2 C
Hyderabad
April 29, 2024 16: 21 PM
Slider ప్రత్యేకం

అమలుకు నోచుకోని 93% జగన్ రెడ్డి హామీలు

#chandrababu

మాట తప్పని.. మడమ తిప్పని వంశానికి వారసుడనని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో 93% అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ వాస్తవపత్రం విడుదల చేసింది. నవరత్నాల అమలుపై తెలుగుదేశం పార్టీ విశ్లేషణాత్మకమైన వాస్తవ పత్రం విడుదల చేసింది.

9 ప్రధాన హామీల కింద మొత్తం 40 ఉప హామీలను జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకిచ్చారు. ఈ 9 ప్రధాన హామీలలో కనీసం ఒకటి కూడా చెప్పిన మేరకు గత నాలుగేళ్లుగా అమలు చేయలేదు. మొత్తం 40 ఉప హామీల్లో 37 అంశాల అమలులో ప్రజలను మోసం చేశారు. ఈమేరకు తానెంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న నవరత్నాల అమలులో 93 శాతం విఫలం చెంది ఆమేరకు ప్రజలను నయవంచనకు గురిచేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నైజం సాక్షాత్కారమైంది. అబద్ధపు పునాదులమీద అధికార సౌధాలు కట్టాలనుకునే జగన్ రెడ్డిలోని ‘అపరిచితుడు’ బయటికొచ్చాడు.

నవరత్నాలలోని వివిధ హామీలు, వాటి వాస్తవ వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి :

1.వైఎస్ఆర్ రైతు భరోసా :

i.అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తాం: రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నది కేవలం రూ.7,500 మాత్రమే.

ii.పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని తామే చెల్లిస్తాం, దీనికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: రైతుల పంటల బీమా విషయాన్ని పూర్తిగా గందరగోళానికి గురిచేసి సమయానికి ప్రీమియం చెల్లించకుండా ఈ-క్రాప్ పేరున అక్రమాలకు తెరతీసిన జగన్ ప్రభుత్వం. ప్రత్యేక కార్పొరేషన్ సంగతి విస్మరించి… కేంద్ర పంటల బీమా పథకంలో నుంచి బయటకు, లోనికి గంతులు వేసిన ప్రహసనం.

iii.వడ్డీలేని పంటరుణాలిస్తాం : గత తెలుగుదేశం ప్రభుత్వం రూ. లక్ష వరకు ఉన్న రైతుల రుణాలపై వడ్డీని డైరెక్టుగా బ్యాంకులకు ఇస్తే జగన్ రెడ్డి మాత్రం ఆ వడ్డీని రైతులనే ముందు కట్టమన్నారు. దీంతోపాటు గత తెదేపా ప్రభుత్వం పావలా వడ్డీకే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలిప్పిస్తే దాన్ని రద్దు చేసిన జగన్.

iv.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తామని ప్రగల్భాలు పలికి అందులో కనీసం పావలా వంతు కూడా బోర్లు వేయని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

v.పగటిపూటే రైతులకు 9 గంటల ఉచిత కరెంటు ఇస్తామని.. కేవలం 7 గంటలు కూడా అందించలేని స్థితి. పైగా మీటర్లు పెట్టి క్రమేణ ఉచిత విద్యుత్ ను రద్దు చేసే దిశగా అడుగులు.

vi.ఆక్వా రైతుకు కరెంటు యూనిట్ కు రూ.1.50కే ఇస్తాం: ఆక్వా జోన్, నాన్ జోన్ లుగా రైతులను విభజించి లబ్ధిదారులను భారీగా కుదించి జోన్ లో లేని రైతులకు యూనిట్ కు రూ.5.85 భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.

vii.రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు : ఈ హామీని పూర్తిగా విస్మరించి మాట తప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డి. గిట్టుబాటు ధరలందక, తగు స్థాయిలో పంటల సేకరణ లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు.

viii.రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి అని నమ్మబలికి.. దీన్ని కూడా పూర్తిగా గాలికొదలడంతోపాటు కేంద్రం ఇచ్చిన ప్రకృతి విపత్తుల సహాయ నిధులను ఇతర అవసరాలకు వాడుకున్న జగన్ రెడ్డి.

ix.ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు : ఈ హామీ మేరకు  ఏ ఒక్కటి కట్టిన దాఖలాలు చూపించకపోగా మార్కెట్ సెస్ ను వంద శాతం పెంచి రైతులను దగా చేసిన జగన్ రెడ్డి.

x.సహకార రంగాన్ని పునరుద్ధరించి, పాల రైతులకు లీటరుకు 4 రూపాయల బోనస్ కూడ ఇస్తామని నమ్మబలికి.. దీనికి పూర్తి విరుద్ధంగా ఒంగోలు, చిత్తూరు డెయిరీల రూ.6వేల కోట్ల ఆస్తులను అప్పనంగా అముల్ డెయిరీకి అప్పగింత. 4 రూపాయల బోనస్ పూర్తి బోగస్ అని తేల్చేసిన జగన్ నిర్వాకం.

xi.వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తామంటూ.. గత తెదేపా హయాంలో రద్దయిన వీటిని మళ్లీ రద్దు చేస్తామని పచ్చి అసత్య హామీ.

xii.ప్రమాదవశాత్తు మరణించిన, ఆత్మహత్యచేసుకున్న రైతులకు రూ.7 లక్షల పరిహారం ఇస్తామని, అది బ్యాంకుల కైవసం కాకుండా చట్టం తెస్తాం: పూర్తిగా మాట తప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డి. గత నాలుగేళ్లలో 3 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. కేవలం 454 మందికే అందిన పరిహారం. అందులో కూడా వైసీపీ నేతల కమీషన్లు.

2. అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ :

i. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటని అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపు… ఈ హామీకి భిన్నంగా పలు సాకులతో ఆరోగ్యశ్రీ పరిధి నుండి తప్పించబడ్డ అర్హులైన లబ్ధిదారులు.

ii. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు… ఆసుపత్రులకు ప్రభుత్వ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో అధిక ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించటానికి ఆసుపత్రులు నిరాకరించటంతో ఇక్కట్లు పడుతున్న ప్రజలు.

iii.ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఉచిత వైద్యం… కొండలుగా పేరుకుపోతున్న ప్రభుత్వ బకాయిలతో ఖర్చుతో కూడిన వైద్య సేవలకు రోగులే డబ్బులు కట్టాలని ఆస్పత్రులు షరతులు విధిస్తుండటంతో విఫలమైన ఈ హామీ. ఆరోగ్యం కోసం తమ జేబుల్లోనుంచి చేసే ఖర్చు పెరుగుతుండటం దీనికి సాక్షాత్కారం. పలుచోట్ల అంబులెన్సులు లేక రోగులను నానా ఇక్కట్లు పడి దూరంగా ఉన్న ఆస్పత్రులకు కుటుంబ సభ్యులు మోసుకుపోతున్న వైనం.

iv.ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని హామీ ఇచ్చినా… స్వరాష్ట్రంలోనే  పేరుకుపోతున్న ప్రభుత్వ బకాయిల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించటానికి నిరాకరిస్తున్న పొరుగు రాష్ట్రాల ఆసుపత్రులు. బడా వైసీపీ నేతలకు మాత్రమే ఉపయోగపడుతున్న ఈ హమీ.

v. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని చెప్పినా… అధిక ఖర్చుతో కూడిన ప్రత్యేక శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందించటానికి నెట్ వర్క్ ఆసుపత్రుల నిరాకరణ. కిడ్నీ మార్పిడి, గుండె, రక్తనాళాల చికిత్స, న్యూరాలజీ మొదలగు వ్యాధులకు గురైనవారికి ఉపయోగపడని ఆరోగ్యశ్రీ.

vi.చికిత్సానంతర విశ్రాంతి సమయంలో పేషంట్ కుటుంబానికి ఆర్థిక సాయం : అవసరం మేరకు అంబులెన్స్ లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస అవసర మందులు కూడా అందించలేని జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో అందిస్తున్న అరకొర సాయం.

vii.కిడ్నీల వ్యాధి, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురైనవారికి నెలకు రూ.10వేలు పింఛన్ ఇస్తానని చెప్పి… ఈ మేరకు అర్హులైన వారెంతమందో, లబ్ధిదారులెంతమందో బహిర్గతం చేయకుండా ఈ హామీ అమలులోని డొల్లతనాన్ని తమంతట తామే బహిర్గతం చేసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం.

viii.ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి మారుస్తాం.. అవసరం మేరకు డాక్టర్లను నియమిస్తాం : చిన్న చిన్న రుగ్మతలకు కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరటానికి పెరుగుతున్న రద్దీ, పారాసిటిమాల్ వంటి కనీస మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని దుస్థితి ఈ జగన్ హామీ అమలులోని డొల్లతనాన్ని వెల్లడిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీస్థాయిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత.

3. అమ్మఒడి :

i.పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దని హామీ ఇచ్చి.. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారి చదవుకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మాట తప్పి, మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. రాష్ట్రంలో సుమారు 84 లక్షల మంది స్కూల్ విద్యార్థులుండగా అందులో సగానికి పైగా సాయమందని నేటి పరిస్థితి.

ii.పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం : స్కూళ్ల నిర్వహణ, మరుగుదొడ్ల కోసమని చెప్పి ప్రతి తల్లి నుండి సంవత్సరానికి రూ.2 వేలు దోచుకుంటున్న ముఖ్యమంత్రి. స్కూళ్ల నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు తమ ప్రభుత్వ బాధ్యత కాదని ఢంకాపథంగా చెప్పిన జగన్ నైజం.

4. పింఛన్ల పెంపు :

i.పింఛన్ల అర్హత వయసు 65 సంవత్సరాల నుండి 60కి తగ్గిస్తాం: ఈ మేరకు వయో పరిమితి తగ్గించబడింది. అయితే దీని పర్యావసానంగా లబ్ధిదారుల సంఖ్యలో తగిన వృద్ధి మాత్రం కనబడలేదు.

ii. పింఛన్లను రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతాం : జగన్ రెడ్డి తమ పాదయాత్రలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేలు పింఛన్ ను రూ.3వేలు చేస్తామని మాటల గారడీతో నమ్మబలికి… అధికారంలోకి వచ్చాక ఈ పెంపు 4 దశల్లో చేస్తామని వంచన చేశారు.

iii. వికలాంగులకు నెలకు రూ.3 వేలు పింఛన్ : ఈ హామీ అమలు జరుగుతున్నా గత తెదేపా ప్రభుత్వం కూడా అంతే సాయం అందించింది. అదనంగా జగన్ రెడ్డి చేసిందేమీ లేకపోగా… అనధికారికంగా కుటుంబానికి రెండు పింఛన్లు మాత్రమే అంటూ లబ్ధిదారులను కుదిస్తున్నారు.

5. పేదలందరికి ఇళ్లు:

i. ఎటువంటి వివక్షత చూపకుండా ఇళ్లులేని పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తాం : గతంలో తెలుగుదేశం మంజూరు చేసిన పక్కా ఇళ్లల్లో కుంటి సాకులతో 3 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేసి… వాటిని తమ పార్టీ కార్యకర్తలకు, అస్మదీయులకు మంజూరు చేసి జగన్ రెడ్డి తన వివక్షతో కూడిన మానసికతను వెల్లడించుకున్నారు.

ii.ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం : గత నాలుగేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 823 ఇళ్లు మాత్రమే నిర్మించిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడిస్తే… ఆరునూరైనా మిగిలిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఈ లక్ష్యాన్ని సాధించలేరని రూఢి అవుతోంది. తాను పేదల పక్షపాతి అని తరచుగా నొక్కి వక్కాణించే జగన్ రెడ్డి నైజానికి ఇదే నిదర్శనం.

iii.పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్లు కూడా కట్టిస్తాం : ఇళ్ల స్థలాల సేకరణ, వాటి అభివృద్ధి పేరుతో రూ.7,000 కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి అనుచర గణం. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని స్థలాలను పేదలకు కట్టబెట్టి, పేదలకు సరైన స్థల పత్రాలు కూడా అందించకుండా, వేలాది కాలనీల్లో ఇప్పటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా… వారికి ఇళ్లు కట్టిస్తాం అంటూ నమ్మబలకటం జగన్ రెడ్డిలోని ‘అపరిచితుడి’కి మరో సాక్షాత్కారం.

iv. అక్క, చెల్లెమ్మల పేరుతో ఇళ్ల రిజిస్ట్రేషన్ : దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన పేదలకు ఇళ్లు పథకంలో ఈ నిబంధన ఉంది. కేంద్ర సాయంతో నిర్మిస్తున్న అట్టి ఇళ్లకు సంబంధించి తానేదో మహిళలకు లబ్ధి చేశానని చెప్పుకోవటం కేవలం అనుచితం.

v.డబ్బు అవసరమైతే పేదలకు కట్టే  ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం : ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టస్తామన్న జగన్ హామీ కునారిల్లుతూ నేల వీడకపోవటం వాస్తవం కాదా? లక్షసాధన కోసం ఇచ్చిన గడువులో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే  వాటిని రద్దు చేస్తామంటూ ప్రభుత్వాధికారులు పేదలను బెదిరిస్తున్న వైనం ఈ హామీ అమలులోని డొల్లతనానికి అద్దంపడుతోంది. పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పిస్తే ఈ దుస్థితి ఎందుకొస్తుంది?

6. ఫీజు రీయింబర్స్మెంట్ :

i.పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం : యూజీ నుంచి పీజీదాక పేదల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక దీనికి విరుద్ధంగా జగన్ రెడ్డి పలు చర్యలు చేపట్టారు. గత తెదేపా ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఈసాయం అందించగా జగన్ రెడ్డి వారిని 10 లక్షల లోపుకు కుదించారు. వార్షిక ఫీజును రూ.30వేలు-రూ.70వేలుగా నియంత్రించి అధిక శాతానికి రూ.30 వేలే ఇస్తున్నారు. దీనివలన కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల నాణ్యత తీవ్రంగా క్షీణించింది.  పైగా 2021 నుండి మూడు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయలేదు.

ii.వసతి, భోజనాల కోసం ఏటా రూ.20వేల సహాయం : మాట తప్పి మడమ తిప్పే తమ నైజానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చాక ఈ సహాయాన్ని రూ.10 వేలు, రూ.15వేలు, రూ.20 వేలుగా విభజించి విద్యార్థులకు మోసం చేశారు. ప్రభుత్వ సమాచారం మేరకు గత నాలుగేళ్లుగా సగటున రూ.9వేలు సాయం మాత్రమే ఇచ్చారు. రూ.9వేలు ఎక్కడ.. హామీ ఇచ్చిన రూ.20వేలు ఎక్కడ?

7. వైఎస్ఆర్  జలయజ్ఞం : 

i.వైఎస్ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం : జగన్ నిర్వాకంతో ఈ కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని దుస్థితి. గత నాలుగేళ్లలో ఒకటంటే ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేశామని చెప్పుకోలేని దైన్య స్థితి జగన్ రెడ్డిది. పైగా.. కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ అంటూ ఈ స్వప్న సాకారాన్ని మరింత దూరం చేసిన ఘనత ఈ మాట తప్పని, మడమ తిప్పని  అపరిచితుడిది.

ii.పోలవరం, పూలసుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం : నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరం. నాలుగేళ్లలో మూడు కాల పరిమితులను కాలదన్ని, కేవలం 3% పనులు మాత్రమే చేసి 2025కు కూడా పూర్తి కానటువంటి స్థితిలోకి ఈ జీవనాడిని నెట్టిన ఘనుడు జగన్ రెడ్డి. ఇటీవల జరిగిన గైడ్ బండ్ కృంగిపోవటం, కాపర్ డ్యామ్ లీకేజీ, డయాఫ్రంవాల్ దెబ్బతినటం ఈ ప్రాజెక్టు భద్రత, భవితపై తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. పోలవరం ఆలస్యం కావటానికి కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆర్టీఐ చట్టం కింద కేంద్ర వెల్లడించింది. వెలిగొండ డ్యామ్ మొదటి, రెండవ టన్నెల్స్ కు సంబంధించి 80% పనులు గత తెలుగుదేశం హయాంలో పూర్తయినా… గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవటం జగన్ రెడ్డి అసమర్థతకు ప్రత్యక్ష తార్కాణం.

iii.రక్షిత మంచినీరు, సాగునీటి కల నిజం చేస్తాం : నిరంతరం ప్రచార ఆర్భాటంలో మునిగితేలే జగన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఒక్క గ్రామానికి కూడా పూర్తి స్థాయి రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పుకోలేదు. ఈ నాలుగేళ్లలో నీటి సరఫరా, శుభ్రతకు రూ.11,000 కోట్లు కేటాయించి అందులో కనీసం 3వ వంతు కూడా ఖర్చు చేయకపోవటం ఈ హామీ అమలు వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది. కేంద్ర జాతీయ జలమిషన్ కింద అబద్ధాలు చెప్పి అధిక నిధులు పొందటమే కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇతర అవసరాల కోసం జగన్ ప్రభుత్వం వాడుకుందని కేంద్రం వెల్లడించి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తిచూపింది.

8. మద్యపాన నిషేధం :

i.కాపురాల్లో చిచ్చు పెడుతున్న, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్న మద్యాన్ని మూడు దశల్లో నిషేధించి దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం : మద్యనిషేదం మాట గాలికొదలి మద్యంపై వచ్చే ఆదాయం పైనే ఆధారపడి నడుస్తున్న జగన్ ప్రభుత్వ తీరు ఈ హామీ అమలు వైఫల్యానికి సాక్షాత్కారం. మద్యంపై వచ్చే ఆదాయాన్ని పాతికేళ్లు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకున్న జగన్ ఈ పాతికేళ్లపాటు నిషేదం మాట మరచిపొమ్మని తానే చెప్పారు. పైగా నాణ్యతలేని జే బ్రాండ్ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. కూరగాయలకు కూడా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న నేటి తరుణంలో మద్యం షాపుల్లో నగదు విక్రయాలు చేస్తూ వేలాది కోట్ల అక్రమాలకు తెరతీసిన కరుడుగట్టిన అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

9.వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత :

ఈ రెండు హామీలు/పథకాలు వేరువేరు అయినా మొత్తం 9 సంఖ్యతో నవరత్నాలని చెప్పుకోవటానికి ఈ రెండింటిని కలిపేసిన జగన్ రెడ్డి వీటి అమలులో కూడా అదే ధోరణిని కనబరిచారు.

i.గత ఎన్నికల వరకు అక్క, చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తాన్ని 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం : కొంచెం వెనకా ముందు అయినప్పటికి ఈ హామీ అమలు జరుగుతోంది.

ii.మళ్లీ సున్నా వడ్డీ రుణాల విప్లవం తెచ్చి దాన్ని బ్యాంకులకు మేమే కడతాం : గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు రూ.3 లక్షల రుణం వరకు సున్నా వడ్డీ సాయం అందించగా… ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ రుణ పరిమితిని లక్ష రూపాయలకు కుదించాడు. దీని వలన రెండు లక్షల రుణంపైన డ్వాక్రా మహిళలు వడ్డీ భారం మోస్తున్నారు.

iii.వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు తోడుగా ఉంటాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు మొదటి ఏడాది తరువాత దశలవారీగా రూ.75 వేలు అందిస్తాం : తమ పాదయాత్రలో 45-60 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తామని నమ్మబలికి… అధికారంలోకి వచ్చాక యధావిధిగా మాట తప్పి మడమ తిప్పిన ఘనుడు జగన్ రెడ్డి. అర్హత కలిగిన ప్రతి మహిళకు సంవత్సరానికి 36 వేల రూపాయలు పింఛను అందాల్సివుండగా దీన్ని తగ్గించి కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. ఇది మోసం కాదా?

iv. ప్రస్తుతం అరకొరగా, లంచం లేనిదే సాయం అందించని కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళించి పారదర్శక ప్రమాణాలను తీసుకొస్తాం : కార్పొరేషన్లు అన్నింటిని నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి వాటిని ప్రక్షాళించే అవసరం, అవకాశమే లేదు. నిష్ర్కియాపరమైన పలు కార్పొరేషన్లను ఏ మేరకు మార్చి, ప్రక్షాళించిందో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రజలకు తెలపకపోవటం ఈ హామీ అమలులో జగన్ రెడ్డి వైఫల్యాన్ని తెలియజేస్తోంది.

సాక్ష్యాధారాలతో పైన వివరించిన నవరత్నాల అమలులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లీలలను ప్రజలు అర్థం చేసుకోవాలని తెలుగుదేశం కోరుకుంటోంది. మొత్తం 40 హామీల్లో కేవలం మూడంటే మూడు మాత్రమే అమలుచేసి… 93 శాతం హామీల్లో వైఫల్యం చెంది తను మాట్లాడే ప్రతి మాటకు… వేసే అడుగుకు ఎట్టి నిబద్ధత, నైతికత ఉండదని చాటి చెప్పారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ పైన వెల్లడించిన అంకెలు, ఆధారాలు నవరత్నాల అమలులో తన అబద్ధాల ముసుగుని తొలగించాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించి, అంగీకరించి… తానిచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని పదే పదే చెప్పినందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

Related posts

యురేనియం మైనింగ్‌పై కేటీఆర్ ట్వీట్

Satyam NEWS

విజయనగరం కలెక్టరేట్ వద్ద అలజడి…రాత్రయినా కదలని విద్యార్థులు…!

Satyam NEWS

మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు

Bhavani

Leave a Comment