జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయట నుంచి కాశ్మీర్ లోకి వచ్చే వారిని టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు నేడు కూలీలపై కాల్పులు జరిపి ఐదుగుర్ని పొట్టనపెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీలు కాశ్మీర్ లో పనులు చేసుకుంటుండగా ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఐదుగురు చనిపోగా మరొక వ్యక్తి తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. ఆగస్టు 5 ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి ఉగ్రవాదులు కాశ్మీర్ వస్తున్న ట్రక్కులు, లారీలపై దాడులు చేశారు. చాలా ట్రక్కుల్ని తగులబెట్టారు. జమ్మూ కాశ్మీర్ నుంచి యాపిల్స్ ఎగుమతి కాకుండా అడ్డుకున్నారు. నిన్నఉధంపూర్ నుంచి వచ్చిన ఒక ట్రక్ డ్రైవర్ ను అనంతనాగ్ లో కాల్చి చంపారు. ఆగస్టు 5 నుంచి దీనితో ఐదుగురు ట్రక్ డ్రైవర్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నట్లు అయింది. నేడు పశ్చిమ బంగాల్ నుంచి వచ్చి కూలిపనులు చేసుకుంటున్న వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు. కుల్గామ్ వద్ద కాల్పులు జరిపి వీరిని హతమార్చారు. కాశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన ప్రతి నిధి బృందం ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాలను బేరీజు వేసేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
previous post