29.7 C
Hyderabad
May 14, 2024 02: 33 AM
Slider ప్రత్యేకం

మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి: రైతుల్ని ఆదుకున్న కేసీఆర్

#Ministerniranjanreddy

కేంద్రం సానుకూలంగా స్పందించక పోవటంతో విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించే ప్రయత్నాల్ని ప్రారంభించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు ధాన్యం సేకరించక సతాయిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర బిజెపి నాయకులు తమ ప్రభుత్వ నిర్ణయానికి తామే విరుద్ధంగా ప్రవర్తిస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగిలారని, రైతులు యాసంగిలోనూ వరిసాగే చేయాలని, పండిన ప్రతి గింజనూ తామే కొంటామని బాధ్యతా రహితంగా ప్రకటనలు చేశారని ఆయన అన్నారు.

దుర్మార్గ ప్రేలాపనలతో రైతులను తప్పుదోవ పట్టించి, గందరగోళాన్ని సృష్టించారని మంత్రి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా మొదటి తీర్మానం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టారు.

తీర్మానం పూర్తి పాఠం:

రాష్ట్ర బిజెపి నాయకులు సృష్టించిన ఈ గందరగోళం. వల్ల కొంతమంది రైతులు యాసంగిలోనూ వరి సాగుచేశారు. బీరాలెన్నో పలికిన బీజేపీ నాయకులు పంట చేతికి వచ్చే సమయానికి చేతులెత్తేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచారు. దొంగే.. దొంగా దొంగా అని అన్నట్లు తాము చేసిన దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపారు. తెలంగాణ రైతుల బతుకులతో చెలగాటమాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై అపనిందలు వేసి, రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడ్డారు.

తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడాలనే తపనతో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోమారు మంత్రులు, పార్లమెంటు సభ్యుల బృందాన్ని రైతుల పక్షాన ఢిల్లీకి పంపించారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరిస్థితిలోని గంభీరతను అర్ధం చేసుకోకపోగా, తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయాలని వెటకారంగా, అవమానకరంగా, అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొదలుకొని జిల్లా పరిషత్ ల వరకు అన్ని ప్రజాస్వామిక వ్యవస్థ యాసంగిలో పండిన వడ్లు కేంద్ర సర్కారు కొనాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసారు.

కేసీఆర్ ధర్నా చేసినా స్పందించని మోడీ ప్రభుత్వం

రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లో ఢిల్లీలో సైతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా చేసారు. అయినప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. పిడికెడు మంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు లక్షల కోట్లలో రుణ మాఫీ చేసే కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల రైతు కుటుంబాల సంక్షేమం కొరకు ఐదారు వేల కోట్లు ఖర్చు చేసేందుకు ససేమిరా అనటం సిగ్గుచేటు. దీంతో మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతలేమిటో దేశానికి తేటతెల్లమయింది.

గతంలో వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతుల చేతిలో భంగపడి, క్షమాపణలు చెప్పిన మోడీ ప్రభుత్వం, ఇప్పటికీ ఇంకా బుద్ధి తెచ్చుకోలేదనీ, రైతు వ్యతిరేక విధానాన్ని మార్చుకోలేదని మరోసారి రుజువయ్యింది.

ధాన్యం మార్కెట్లకు తరలివచ్చే తరుణంలో మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపింది. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను కాపాడాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాసంగిలో పండిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నూకలు ఏర్పడటం ద్వారా వచ్చే నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధపడింది. రైతులు ఎవరూ తక్కువ ధరకు తమ ధాన్యం అమ్ముకోవాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరనిచ్చి చివరి గింజ వరకూ కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సమస్య కేంద్రం సృష్టించినప్పటికీ, భారాన్ని తమ నెత్తిన వేసుకొని, రైతుల్లో భరోసా నింపారు.

యాసంగి పంటను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ టీఆర్ఎస్ విస్తృత సభ తీర్మానిస్తున్నది. తాను రైతుబిడ్డననీ, వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే రైతుననీ, రైతుల సంక్షేమమే తన పరమావధి అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనస్ఫూర్తిగా నేటి టిఆర్ఎస్ ప్లీనరీ అభినందిస్తున్నది.

Related posts

ఎష్యూరెన్స్: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Satyam NEWS

తెలంగాణ వచ్చాక గిరిజనుల ఆత్మగౌరవం పెరిగింది

Satyam NEWS

Leave a Comment