27.7 C
Hyderabad
April 30, 2024 07: 40 AM
Slider నిజామాబాద్

వాడివేడిగా కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం

#municipality

కామారెడ్డి బల్దియాకు సంబంధించిన బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగింది. బడ్జెట్ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. కామారెడ్డి బల్దియాకు 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు.

01-04-2023 నాటి అంచనా ప్రారంభ నిలువ రూ. 2566.65 లక్షలు ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం అంచనాల ఆదాయం రూ.4858.47 లక్షలుగా రూపొందించారు. 2023-24 అంచనా సాధారణ వ్యయం రూ.4858.47, ఉండగా 31.03.2024 నాటికి 2566.65 లక్షలు ఉందని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ బడ్జెట్ చదివి వినిపించారు. అనంతరం బడ్జెట్ పై చర్చను కొనసాగించారు.

గత సంవత్సర బడ్జెట్ కు ప్రస్తుత బడ్జెట్ కు ఆదాయాన్ని పెంచాల్సింది పోగా తగ్గించారని కొందరు కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. విఎల్టీ ఆదాయంపై కౌన్సిలర్ అంజల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విఎల్టీలు మున్సిపాలిటీ ద్వారానే ఇవ్వాలని కోరారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డబ్బులు తీసుకుని విఎల్టీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా కాకుండా మున్సిపల్ ద్వారానే విఎల్టీలు జారీ చేస్తే మున్సిపల్ కు ఆదాయం సమకూరే అవకాశం ఉందనగా మున్సిపల్ నుంచే విఎల్టీలు ఇస్తున్నారని చైర్మన్ తెలిపారు.

ప్రతిరోజు కేవలం నాలుగైదు విఎల్టీలు మాత్రమే జారీ అవుతున్నాయని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజు 40-50 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలో వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ సభ దృష్టికి తేగా కలెక్టర్ స్పందిస్తూ హైవేపై మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయం తన దృష్టిలో ఉందని, అధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చూస్తానని పేర్కొన్నారు.

సేవ్ మున్సిపల్ ఓపెన్ ప్లేస్

మున్సిపల్ ఓపెన్ స్థలాలను రక్షించాలని 15 వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీకృష్ణ ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు. తన వార్డులో ఓపెన్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీ స్థలాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. 3 నెలలుగా చెప్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం రావడం లేదన్నారు.

నిర్మాణం చేపడుతున్న వారికి ఇదివరకే నోటీసులు జారీ చేసామని టిపిఓ అధికారులు చెప్పగా మరోసారి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి సహా విలీన గ్రామాల్లో ఉన్న మున్సిపల్ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాకు గురి కాకుండా చూడాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్ కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మార్చి 15 లోపు మున్సిపల్ స్థలాల లిస్ట్ తయారు చేయాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్డు రాకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు

తన వార్డులో రోడ్డు కోసం స్థలం వదలకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్ భాస్కర్ గౌడ్ సభ దృష్టికి తెచ్చారు. పాత మాస్టర్ ప్లాన్ లో 50 ఫీట్ల రోడ్డు ఉందని, ప్రస్తుతం ఇంటి నిర్మాణం ద్వారా రోడ్డు 33 ఫీట్లు మాత్రమే అవుతుందన్నారు. దానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒక్కరినీ చూసి అందరూ అదే విధంగా నిర్మాణాలు చేస్తారని, అక్కడ రోడ్డు 50 ఫీట్లు ఉండాలా, లేక 33 ఫీట్లు ఉండాలా అని ప్రశ్నించారు.

ప్లకార్డు ప్రదర్శిస్తున్న కౌన్సిలర్ వంశీకృష్ణ

చైర్మన్, కమిషనర్ కాళ్ళు మొక్కాలా..?

తన వార్డులో మిగిలిన పనుల కోసం చైర్మన్, కమిషనర్ కాళ్ళు మొక్కాలా అని 9 వ వార్డు కౌన్సిలర్ బుక్యా రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ వార్డు అయిన తన వార్డులో 40 లక్షలు పనులకు మంజూరు కాగా 25 లక్షల పనులు మాత్రమే చేపట్టారని, మిగతా 15 లక్షల పనులు మూడేళ్ళుగా చేయడం లేదని తెలిపారు. అడిగితే నిధులు రాలేదన్నారని, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే 15 లక్షలు కరెంట్ బిల్లుకు చెల్లించామని చెప్తున్నారన్నారు. నిధులు రానప్పుడు కరెంట్ బిల్లు ఎలా చెల్లించారని ప్రశ్నించారు.

వార్డులో నీటి సమస్య ఉందని, మోటార్ ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను అడిగితే కమిషనర్ వద్దకు పంపిస్తారని, కమిషనర్ ను అడిగితే చైర్మన్ అంటారని, చైర్మన్ వద్దకు అడిగితే అధికారులకు చెప్పినా పనులు చేయడం లేదన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే బడ్జెట్ మీటింగ్ వచ్చి చప్పట్లు కొట్టి వెళ్లాలా.. ? అని ప్రశ్నించారు. కమిషనర్ ఒక బొమ్మలా ఉన్నారని విమర్శించారు. కలెక్టర్ స్పందిస్తూ తన కార్యాలయానికి వచ్చి పర్సనల్ గా కలవాలని కౌన్సిలర్ కు సూచించారు.

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దాలి- కలెక్టర్ జితేశ్ వి పాటిల్

కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్ ను  వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. పట్టణంలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వాట్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్

Satyam NEWS

అల్లాహ్ అందరినీ చల్లగా చూస్తారు: మంత్రి పువ్వాడ

Satyam NEWS

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

Satyam NEWS

Leave a Comment