28.7 C
Hyderabad
May 6, 2024 02: 49 AM
Slider సంపాదకీయం

సలామ్ కుటుంబం ఆత్మహత్య వెనుక నిజం బయటకు వస్తుందా?

#SalamFamily

నంద్యాలలో జరిగిన ఘోరమైన సంఘటన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. పోలీసుల వేధింపులకు ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సంఘటన ఎంత చెడ్డపేరు తెచ్చిందో అధికార పార్టీకి ఉత్తర క్షణంలోనే అర్ధం అయింది.

అందుకే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం పక్షపాతి, వై ఎస్ జగన్ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమం కోసం ఎంతో చేశాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ముస్లిం లీడర్లు ప్రతి రోజూ జగన్ ప్రభుత్వం ముస్లింలకు చేసిన మేలు గురించి చెబుతున్నారు.

దిద్దుబాటు చర్యల్లో వైసీపీ నేతల హడావుడి

ముస్లింలకు మేలు చేయడం, ముస్లింల కోసం పథకాలు ప్రవేశ పెట్టడం, ముస్లింల కోసం కార్పొరేషన్లు పెట్టడం కాదు ఇక్కడ చర్చనీయాంశం. ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, పోలీసుల వేధింపులు. ఈ రెండు అంశాలు మాత్రమే ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది.

వంద మంది ముస్లిం కుటుంబాలకు మేలు చేసి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా ఏర్పాటు చేస్తాం అంటే ఎవరూ ఊరుకోరు కదా? ఇప్పటి వరకూ దళితులపై దాడులు, శిరోముండనాలు, దళితుల అరెస్టులు, చేతికి సంకెళ్లు విన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ముస్లింలపై దాడులు, ముస్లిం కుటుంబాల ఆత్మ హత్య సంఘటనలు వస్తున్నాయి.

 ఇలాంటి అన్నీ అధికార పార్టీ నాయకులు, వారి ఆదేశాలతో పోలీసులు చేసిన చర్యలు కావడంతో సమస్య మరింత జటిలం అవుతున్నది. ఏదైనా సంఘటన జరగగానే తక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంటారు.

సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు. ఆయా సంఘటనలకు సంబంధించి ఎక్కువ శాతం కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటున్నారు.

దాన్ని సరిదిద్దు కోవాలి. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 3వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో అందరూ కూడా దాన్ని ఆర్ధిక కారణాలతో తనువు చాలించారనే అనుకున్నారు. షేక్ అబ్దుల్ సలామ్ (45) భార్య నూర్జహాన్ (38) కుమార్తె సల్మా (14) కుమారుడు దాదా కలందర్ (12) గూడ్సు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

మనసు వికలం చేసిన సంఘటన ఇది

వార్త తెలియడంతోనే చాలా మంది మనసు వికలం అయిపోయింది. ఆ తర్వాత తెలిసిన విషయాలు మరింత ఆందోళన కలిగించాయి. బంగారు నగల షాపులో సలామ్ పని చేస్తాడు. అతని భార్య ఒక ప్రయివేటు స్కూల్ టీచర్ గా పని చేసేవారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయారు.

ఈ లోపు బంగారం దుకాణంలో చోరీ జరిగింది. దాదాపు 5 కిలోల బంగారం దొంగతనం చేశాడని సలామ్ పై పోలీసులు కేసులు పెట్టారు. మానసికంగా శారీరకంగా వేధించారు. 42 రోజుల పాటు జైలుకు పంపారు. సలామ్ బయటకు వచ్చిన తర్వాత ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే ఆటోలో ప్రయాణం చేసిన ఒక వ్యక్తి తన 70 వేల రూపాయలు పోయాయని ఫిర్యాదు చేశాడంటూ మళ్లీ ఇంకో కేసు పెట్టారు.

మళ్లీ సలామ్ ను పోలీసులు పట్టుకువెళ్లారు. ఇలా సలామ్ జీవితం పోలీసుల వేధింపులకు టార్గెట్ గా మారింది. ఏం చేయాలి? ఉపాధిలేదు. పోలీసులు ఇక బతకనివ్వరని అర్ధం అయింది. అందుకే అతను కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సలామ్ లాంటి గౌరవ ప్రదమైన కుటుంబాలకు చెందిన వారు పోలీసుల వేధింపులు తాళలేరు.

సెల్ఫీ వీడియో తో నే బయటకు వచ్చిన కేసు

అసలు ఈ కేసు బయటకు వచ్చేదే కాదు. సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అది బయటకు రావడంతో కేసు తీవ్రత బాహ్య ప్రపంచానికి తెలిసింది. అయితే ఇది ఎడిటెడ్ వర్షెన్ అని పోలీసులు ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు.

సెల్ఫీలో చాలా విషయాలు ఉన్నాయని, పూర్తి వీడియో చూస్తే కానీ కేసును పూర్తిగా పరిష్కరించలేమని పోలీసులు అంటున్నారు. బంగారం షాపులో చోరీ కేసు మిస్టరీ వీడితే తప్ప సలామ్ కేసు పరిష్కారం కాదు. అంత పెద్ద మొత్తంలో బంగారం తనంత తానుగా చోరీ చేసి ఉంటే సలామ్ మరణించేవాడు కాదు.

అంటే సలామ్ దోషి కాదు. మరి బంగారం చోరీ చేసింది ఎవరు? అది కనుక్కుంటే తప్ప సలామ్ కేసు పరిష్కారం కాదు. సలామ్ మరణానికి సంబంధించి నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతం సవాంగ్ ఆదివారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఐ జీ పీ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అధికారి అరిఫ్ ఆఫీజ్ నంద్యాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని చెప్పిన గౌతం సవాంగ్, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.

నంద్యాల పోలీసులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. పోలీసు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పలువురు ఫిర్యాదులు చేశారు. సలామ్ కుటుంబం మరణం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది.

ఇది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టబోతున్నది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని సంఘటనలూ పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగినవే. లేదా పోలీసులు పక్షపాత ధోరణితో ఉండి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్లు చేయడం వల్ల జరిగినవే. తప్పు దిద్దాల్సింది ఒక్క పోలీసులనే కాదు. అధికార పార్టీ నేతలను కూడా.

Related posts

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ

Satyam NEWS

లాక్ డౌన్ ఉన్నా రైతులకు ఇబ్బందులు లేవు

Satyam NEWS

విశాఖలో నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

Satyam NEWS

Leave a Comment