నర్సింగ్ సమస్యలు పరిష్కరించాలని తాము చాలా కాలంగా కోరుతున్నా అధికార పార్టీ పట్టించుకోవడం లేదని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ అన్నారు. క్షేత్ర స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న నర్సుల బాధలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడం అన్యాయమని ఆయన తెలిపారు.
అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి చాలా కాలం నుంచి తమ సమస్యలు తీసుకువెళుతున్నా పరిష్కరించడానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని అందువల్ల తాము కీలక నిర్ణయం తీసుకున్నామని లక్ష్మన్ తెలిపారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రాంతాలలో నర్సింగ్ కుటుంబాలు దాదాపుగా 30 వేల నుండి 40 వేల వరకూ ఉన్నాయని కుటుంబం లోని సభ్యులను కలుపుకుంటే తమకు దాదాపుగా లక్ష పైగా ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ ఓట్లన్నీ తమ బాధలు తీర్చే వారికి వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని నర్సింగ్ సమాజం ఈ క్రింది అంశాలను ప్రతిపాదిస్తున్నదని ఏ రాజకీయ పార్టీ దీన్ని ఆమోదిస్తుందో తాము వారికే ఓటు వేస్తామని తెలిపారు. 1ప్రజారోగ్యం నిమిత్తం ప్రతి మున్సిపాలిటీలో 100 పడకల వైద్యశాల నిర్మాణం చేపట్టాలి.
2. ప్రతి కార్పొరేషన్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలి.3. కల్తీ ఆహార పదార్థాలను అరికట్టాలి. 4. శుభ్రమైన తాగు నీరు అందించాలి. 5.డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటు చెయ్యాలి. 6. సీజనల్ వ్యాధులను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి.
7. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల(Ministry of health and family welfare vide order no.Z-29011/15/2013-N DATED 24.O2.2016-) ప్రకారం ప్రయివేటు వైద్యశాలలో పనిచేసే నర్సింగ్ అధికారులకు ప్రతి నెల రూ.20 వేల కనీస వేతనాలను అమలు చేయాలి.
8. రాష్ట్రంలో 10 వేల నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని ఎప్పటిలోపు భర్తీ చేస్తారో స్పష్టంగా ప్రకటించాలి.9. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నర్సింగ్ డైరెక్టరేట్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి నర్సింగ్ కార్యకలాపాలు అక్కడి నుండే కొనసాగేలా చూడాలి.