31.2 C
Hyderabad
May 12, 2024 02: 47 AM
Slider మహబూబ్ నగర్

దళిత జర్నలిస్టు లాకప్ హింస కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో దళిత జర్నలిస్టు అవుట రాజశేఖర్ ను పోలీసులు లాకప్ లో కులం పేరుతో దూషించి హింసించారనే ఆరోపణలపై జరుగుతున్న విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ కొల్లాపూర్ ఎస్ఐ జి బాల వెంకట రమణ జర్నలిస్టు రాజశేఖర్ పై కేసు నమోదు చేశారు.

గత ఏడాది జూన్ 2న ఈ కేసుకు సంబంధించి జర్నలిస్టు రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాజశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు తనను కులం పేరుతో దూషించారని, తనపై పోలీసులు దాడి చేసి గాయపరిచారని జర్నలిస్టు రాజశేఖర్ ఎస్ సి, ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

అదే విధంగా నాన్ ఎక్రిడిటేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మురహారి బుద్ధారం  ద్వారా జాతీయ  బిసి కమిషన్ ను కూడా జర్నలిస్టు రాజశేఖర్ ఆశ్రయించారు. రాష్ట్ర డిజిపి,ఐజీ వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. లాకప్ లో తనపై కొల్లాపూర్ ఎస్ఐ జి.బాల వెంకటరమణ అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు పిలిచి తనపై దాడి చేశారని రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన కొట్టడమే కాకుండా కానిస్టేబుళ్లు శివ కుమార్, రవి కుమార్ లతో కూడా దాడి చేయించాడని రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మాల కులానికి చెందినందున తనను కులం పేరుతో రాయలేని భాషలో తిట్టారని కూడా రాజశేఖర్ ఆరోపిస్తున్నారు.

జర్నలిస్టు రాజశేఖర్ ఫిర్యాదు పై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గత ఏడాది జూన్ నెలలో అప్పటి కలెక్టర్ కు, ఎస్పీకి  ఎస్సీ, ఎస్టీ కమిషన్  నోటీసులు జారీ చేసింది. అదే విధంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి 2021 జూన్22న ఢిల్లీలో ఈ కేసుపై హియరింగ్ నిర్వహించారు.

అక్కడికి  ఈ కేసు లోని ఎంక్వైరీ  పోలీస్  అధికారి కల్వకుర్తి డిఎస్పీ గిరి బాబు 31పేజీల రిపోర్ట్ తో హాజరైయ్యారు. రిపోర్టర్ రాజశేఖర్ తాను బ్లాక్ మెయిల్  చేసినట్లు  ఒప్పుకున్నాడని, పోలీసులు కొట్టలేదనీ ఆయన బిసి కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

అయితే దాడి చేసిన సమయంలో తన శరీరంపై అయిన గాయాలను, సంబంధిత ఫోటోలను జర్నలిస్టు రాజశేఖర్ బిసి కమిషన్ కు చూపించారు. ఎస్ఐ చేస్తున్న అక్రమ దందాలపై వివిధ పత్రికలలో వార్తలు రాసినందుకే ఈ విధంగా ఆయనను లాకప్ లో కులం పేరుతో దూషించి లాకప్ లో హింసించారని నాజా జాతీయ అధ్యక్షుడు మురహరి బుద్ధారం కమిషన్ సభ్యులకు వివరించారు.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి వాస్తవాలను తెలుసుకొని డిఎస్పీ పై సీరియస్ అయ్యారు. వాస్తవాలు వెలుగులోకి తెచ్చే  జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు పెడతారా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? హింసిస్తారా? దాడి చేసి జైల్ కు పంపిస్తారా అంటూ  డిఎస్పీ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరొక్క సారి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి  ఎస్ఐపై సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించి జూన్2, 2021అంత కంటే ముందు రోజు సీసి కెమెరా ఫుటేజ్ లను కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించారు. లాకప్ లో ఉంచిన తర్వాత కోర్టుకు హాజరు పరిచే ముందు వైద్యుడితో పరీక్ష చేయించామని అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు రాజశేఖర్ చెప్పలేదని ఎస్ పి తన నివేదికలో పేర్కొన్నారు.

అదే రిపోర్టును జర్నలిస్టు రాజశేఖర్ కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పంపింది. ఈ నివేదికపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజశేఖర్ ను కోరింది. తనను పోలీసులు హింసించారని, కులం పేరుతో దూషించారని చెబుతున్నా నిస్పక్షపాతంగా విచారణ జరగలేదని రాజశేఖర్ అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉండగా కొల్లాపూర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించే సమయంలో జర్నలిస్టు రాజశేఖర్ చెప్పిన విషయాలను నమోదు చేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకూ పోలీసులు భిన్న కథనాలు వినిపించారు. అయితే ఇప్పుడు మేజిస్ట్రేట్ జారీ చేసిన మెమో బయటకు వచ్చింది.

దాంతో పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. జూన్2, 2021 నాడు కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకట రమణ  జర్నలిస్టు రాజశేఖర్ ను స్టేషన్ కు పిలిపించి, దాడిచేసి  ఐపిసి 385, 384  కేసులు బనాయించి రిమాండ్  చేయడానికి జడ్జీ ముందు హాజరు పరిచారు.

అయితే ఆ సమయంలో జడ్జికి అసలు విషయాన్ని రాజశేఖర్ చెప్పారు. ఎస్ఐ తనను స్టేషన్  పిలిపించి దాడి చేశారని, కానిస్టేబుళ్ల తో కూడా కొట్టించారని  రాజశేఖర్ న్యాయమూర్తికి చెప్పారు. అలా చెప్పవద్దు మేము చెప్పినట్లే చెప్పాలని రాజశేఖర్ ను పోలీసులు బెదిరించారు.

కానీ జరిగిన విషయాన్ని రాజశేఖర్ న్యాయమూర్తికి చెప్పారు. ఈ అంశాన్ని న్యాయమూర్తి నమోదు చేసుకొని ఎస్ఐకి మెమో కూడా జారీచేసింది. అయితే ఆ విషయం బయటికి రాకుండా పోలీస్ లు దాచి పెట్టినట్లు తెలుస్తోంది. కోర్టుకు ఎలాంటి వివరణ ఇచ్చారో కూడా తెలియదు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారులనే పోలీసులు సాక్షులుగా పెట్టడంపై కూడా ఇప్పుడు న్యాయవివాదం తలెత్తున్నది.

Related posts

బత్తాయి, నిమ్మ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

Satyam NEWS

మున్సిపల్ సమావేశం తక్షణమే నిర్వహించాలి

Satyam NEWS

బిచ్చం వేసి ఆర్టీసీని ఆదుకోండి ప్లీజ్

Satyam NEWS

Leave a Comment