ప్రధాని నరేంద్ర మోడీని ఒక విషయంలో మాత్రం అభినందించాల్సిందే. పోల్చడం కరెక్టు కాదు కానీ తప్పదు. ఈ కొత్త ఇంగ్లీష్ సంవత్సరానికి ఎలా స్వాగతం పలకాలా అనే విషయంపై ఆయన దేశ ప్రజలకు ఒక క్లూ ఇచ్చారు. కొందరు నిరసనతోనూ, మరి కొందరు ఉత్సాహం గానూ దేశభక్తిని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు.
పౌర సత్వ సవరణ చట్టం ఇప్పుడు దేశభక్తిని ప్రదర్శించే వారికి ఒక ఆధారం అయింది. అదే విధంగా తమ నిరసన వ్యక్తం చేసే వారికి కూడా ఇదే పనికి వచ్చింది. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పౌరసత్వ చట్టంపైనా, ఎన్ ఆర్ సి పైనా నిరసన తెలిపేందుకు ప్రతి ముస్లిం తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
దాంతో హైదరాబాద్ పాత బస్తీలో చాలా మంది ముస్లింల ఇళ్లపై ఇప్పుడు జాతీయ జెండాలు ఎగురుతున్నాయి. ఇది నిరసనతో చేసినా దేశ ప్రజలంతా సంతోషించాల్సిన విషయమే. ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్న నిర్ణయం నిరసనతోనైనా దేశభక్తిని చాటటమే కదా? అందుకే ప్రతి ముస్లిం తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే స్థితికి తీసుకువచ్చిన మోడీని అభినందించాలి.
అలాగే పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి లను స్వాగతించేవారు కూడా ఏం తక్కువ తినలేదు. తమ దేశభక్తిని చాటుకునేందుకు వారు మరో సాంప్రదాయాన్ని కొద్దిగా మార్చుకున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఇంటి ముందు వేసే ముగ్గులను వేదికగా చేసుకుని తమ దేశభక్తిని ప్రదర్శించాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఈరోజు ఇంటి ముందు వేసే ముగ్గులో భాగంగా వెల్ కమ్ సిఏఏ ఎన్ ఆర్ సి అని ముగ్గు పిండితో రాశారు.
ఈ విధంగా పాజిటీవ్ దేశభక్తిని ప్రదర్శించారు. నిరసనతోనైనా, ప్రేమతోనైనా దేశభక్తిని ప్రదర్శించడం హర్షించదగిన విషయమే కదా? అందుకే ఈ విషయంలో ప్రధాని మోడీని అభినందించాలి. మతం పేరుతో దేశాన్ని విభజిస్తున్నారు అనే విమర్శ చేసేవారు కూడా జాతీయ జెండాలు ఎగరడాన్ని అందరూ అభినందించాలి.
వివాదాల సంగతి ఎలా ఉన్నా చాలా మంది కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాలని కోరుకుంటోంది సత్యం న్యూస్. విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్.