బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర సుమారు 100 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో అంత ధర ఉన్న ఉల్లి రైతు బజార్లలో మాత్రం తక్కువకే దొరుకుతుంది. రోజుకు 500 నుంచి 1200 క్వింటాళ్ళ ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు ప్రతీరోజు తరలిస్తున్నారు.
ప్రతీ కిలో మీద సుమారు 50 రూపాయల పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న కారణంగా కిలో ఉల్లి సామాన్యులకు 25 రూపాయలకే దొరుకుతోంది. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంతవరకూ ఇదే విధంగా అమ్మాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రప్రభుత్వంపై ఆర్దిక భారం ఎంతైనా సామాన్యులకు మాత్రం రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.