37.2 C
Hyderabad
May 6, 2024 20: 39 PM
Slider ప్రత్యేకం

భాషా ‘మిత్ర’లాభం

#amithshah

నిన్ననే ‘హిందీ దివస్’ ముగిసింది. ప్రతి సెప్టెంబర్ 14 వ తేదీ హిందీ భాషా దినోత్సవం జరుపుకోవడం ఏడు దశాబ్దాల పైనుంచీ మన ఆనవాయితీ. భారత జాతీయ ఉద్యమంలో అఖిల భారతాన్ని చైతన్యమూర్తిగా నిలిపి, ఒకే తాటిపై నడిపించడంలో హిందీ ఎంతగానో తోడ్పడిందన్నది చరిత్ర ప్రముఖం.

మహాత్మాగాంధీ నింపిన స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14 వ తేదీ నాడు హిందీని అధికార భాషగా గుర్తిస్తూ ప్రకటన చేశారు. అప్పటి నుంచి వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సూరత్ లో బుధవారం నాడు భాషోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా భాషాపరమైన బంధాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హిందీని మిత్రభాషగా అభివర్ణించారు.

దేశంలోని ఏ భాషకూ హిందీ పోటీ కానేకాదని వ్యాఖ్యానించారు. హిందీని కలుపుకుంటూ ప్రాంతీయ భాషలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇతర భాషల నుంచి పదాలను కలుపుకుంటూ నిఘంటువును మరింత విస్తృత రీతిలో విస్తరించడం అత్యంత కీలకమని అమిత్ షా అభివ్యక్తీకరించారు. హిందీ -గుజరాతీ,హిందీ-మరాఠీ, హిందీ – తమిళం మధ్య పోటీ నడుస్తోందనే మాటలను ఆయన కొట్టి పారేశారు.

హిందీ భాషల అభివృద్ధితో మిగిలిన ప్రాంతీయ భాషల అభివృద్ధిని ముడిపెట్టారు. ఇందులోని వాస్తవికతపై ఇంకా చర్చ జరగాల్సివుంది. ఒక్క తమిళనాడులో తప్ప హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన రాష్ట్రాలు పెద్దగా లేవు. కర్ణాటకలో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది.

నిజానికి తమిళులు మాతృభాషపై అమితమైన మమకారాన్ని చాటుకుంటూనే అటు అంతర్జాతీయ భాషగా చలామణి అవుతున్న ఇంగ్లిష్ ను – ఇటు దేశీయ భాషగా స్థిరపీఠం వేసుకున్న హిందీపై కూడా మంచి అధికారాన్ని సంపాయించారని చెప్పవచ్చు. ఇక తెలుగునాట అధిక సంఖ్యాకులకు హిందీలో మంచి ప్రవేశం ఉంది. హిందీలో మహాపండితులు, కవులైన తెలుగువారు ఎందరో ఉన్నారు.

విజయవాడకు చెందిన పింగళి లజపతిరాయ్ (విభూతి పంతులుగారు) నుంచి కవి ఆలూరి బైరాగి,ఆదేశ్వరరావు మొదలు ఎందరెందరో తెలుగునేలపై హిందీ సరస్వతికి అద్భుతరీతిన ఆరతులిచ్చారు. ఇక పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయుపడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ గా హిందీలోకి అనువదించి చరిత్ర సృష్టించారు.

దానితో విశ్వనాథ ఖ్యాతి దేశ వ్యాప్తంగా మిన్నుముట్టింది. తెలుగువాడిని తొలిగా ‘జ్ఞానపీఠం’ వరించింది. అలా అన్య భాషీయులకు హిందీ అక్కరకు వచ్చింది. చేబోలు శేషగిరిరావు, వద్దిపర్తి పద్మాకర్ వంటివారు హిందీలో ‘అవధానాలు’ కూడా చేశారు. ఇలా మాతృభాష /ప్రాంతీయ భాష  /స్థానిక భాషతో పాటు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. దీని వల్ల ఆ భాషలకు వనకూరేది ఏమీ ఉండదు.భా ష వల్ల మనిషికి ప్రయోజనం ఉంటుంది.

మొత్తంగా సామాజిక వికాసం జరుగుతుంది. భాషాభిమానం వెర్రితలలు వేసి దురభిమానంగా పరిణమించకుండా ఉంటే చాలు. నిజంగా ఏ భాషకూ ఏ భాషా పోటీ కాదు.బహుభాషజ్ఞత రసజ్ఞత,మనోవికాసాన్ని పెంచుతుంది. సరిహద్దులను బద్దలుకొట్టి బంధాలను పెనవేస్తుంది. మన మరో జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణరెడ్డికి ఉర్దూ భాషాజ్ఞానం ఎంతగా ఉపయోగపడిందో లోక విదితం.

ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వాజ్ పెయ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఇద్దరినీ దగ్గర చేర్చింది ఆ భాషాజ్ఞానమే, ఆ కవితా రసజ్ఞతే. నిన్నటి వరకూ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించిన ఎం వెంకయ్యనాయుడుకు హిందీ భాష భూషణంగా నిలిచింది. ఇలా కేవలం తెలుగువారే కాదు,ఎందరికో హిందీతో పాటు బహుభాషజ్ఞత బహుముఖీనంగా ఉపయోగపడింది.

చాలా ఏళ్ళు కన్నడ – తెలుగు ఉభయ భాషలకు లిపి ఒక్కటిగానే ఉండేది. అందుకే కవి సార్వభౌముడు శ్రీనాథుడు  “నా కవిత్వంబు నిజము కర్ణాటభాష” అన్నాడు. సరే! కర్ణాట అంటే చెవులకు ఇంపైన.. అనే అర్థం కూడా ఉంది. అదొక విషయం. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో విలసిల్లే కర్ణాట శాస్త్రీయ సంగీతానికి మన తెలుగు భాష రాజభాషగా ఇప్పటికీ విరాజిల్లుతూనే ఉంది.

అది త్యాగయ్య వంటి మహా వాగ్గేయకారుల తపఃఫలం,అక్షర ప్రసాదం. “జనని సంస్కృతంబు సకల భాషలకు ” అనే ఆర్య వాక్కులను ఎక్కువమంది భారతీయులు గౌరవిస్తారు.హిందీకి అనుకూలంగా బీహార్ రాజేంద్ర సింహతో పాటు హజారీ ప్రసాద్ ద్వివేది, మైథిలీ శరణ్ గుప్తా వంటి వారు ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో దేవనాగరి లిపిలో రాయబడే హిందీకి అధికార భాషా హోదా లభించింది.

ఇది జరిగి కూడా ఏడు దశాబ్దాలు దాటిపోయింది. లిపిలేని భాషలు,ఇప్పటికీ అధికార భాషగా గుర్తింపు రాని భాషలు చాలా ఉన్నాయి. తెలుగుకు ప్రాచీన హోదా రావడానికి ఎన్నో పాట్లు పడాల్సి వచ్చింది. ఇప్పటికీ నిధులు,వసతులు అంతంత మాత్రమే అన్నది చేదు నిజం. మైసూర్ లో ఉన్న తెలుగు భాషా అధ్యయన కేంద్రాన్ని తెలుగు రాష్ట్రానికి తరలించడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది.

భారతీయ భాషల్లో అధిక సంఖ్యాకులు మాట్లాడే భాష హిందీ. అందులో ఎటువంటి సందేహం లేదు. హిందీతో పోల్చుకుంటే ప్రభుత్వ పరంగా మిగిలిన భాషలకు దక్కే గౌరవం,ప్రయోజనాలు తక్కువేనని చెప్పాలి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, అస్సాం,పంజాబ్ మొదలైన రాష్ట్రాలలో హిందీ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భారత భాషలలో బెంగాలీ రెండో స్థానంలో ఉంది.

ప్రతి భాషకు ఒక సొగసు, ఒక సోయగం ఉంటాయి. అనేక భాషల్లో గొప్ప కవిత్వం పండింది,సారస్వతం విలసిల్లింది. ఉర్దూకు ఉండే సౌందర్యం భిన్నంగా ఉంటుంది. తెలుగుకుండే తియ్యదనం విశిష్టంగా ఉంటుంది. మాతృభాష,జాతీయ భాష హిందీ , అంతర్జాతీయ భాష ఇంగ్లిష్ ను కలుపుకొని ‘ త్రిభాషా సూత్రం’ రచించుకొని గొప్ప ప్రయోజనాలు పొందాం. ఆ సంస్కృతి,ఆ వ్యవస్థ ఎప్పటికీ ఆదర్శం.

అట్లే సర్వ భాషలకు తల్లిగా భావించే సంస్కృత భాషకు ఇంకా ఎన్నో రెట్లు ప్రోత్సాహం,ప్రాచుర్యం, అధ్యయనం వాడుక పెరగాలి. భిన్న భాషలు,సంస్కృతుల సంగమమైన భారతదేశానికి ఏకత్వమే ఏకైక సౌందర్యం. అన్ని భాషల మధ్య తులనాత్మక అధ్యయనం జరగాలి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణలు (ఆదాన్ – ప్రధాన్) పెరగాలి. ప్రతి భాషను విస్తరించుకుంటూ ముందుకు సాగాలి.అన్ని భాషలు అందరికీ దగ్గరవ్వాలి. భాషా వైషమ్యాలు సామజిక శాంతికి,దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు. భాషల మైత్రి పెరిగితే దేశ ప్రజల మధ్య శతృత్వం తగ్గుతుంది, మిత్రత్వం పెరుగుతుంది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బి ఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికులకు కట్టుబడి ఉంది

Satyam NEWS

25 రోజులకు స్పష్టమైన హామీతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆదోళన విరమణ

Satyam NEWS

లే అవుట్ల అనుమతులు గడువు లోగా ఇవ్వాలి

Bhavani

Leave a Comment