38.2 C
Hyderabad
May 5, 2024 19: 36 PM
Slider ఆదిలాబాద్

ఓపెన్ లెటర్: కాగజ్ నగర్ లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

sand mafia

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నది. ఈ విషయంపై అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏ నాయకుడు ఇసుక అక్రమ రవాణాలో పాలుపంచుకున్నా తక్షణ చర్యలు తీసుకోండి అని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు జిల్లా పాలనాధికారికి లేఖ రాశారు.

ఆ లేఖ పూర్తి పాఠం ఇది: గత కొద్ది నెలలుగా కాగజ్ నగర్ డివిజన్ లోని పలు వాగులు, వంకల వద్ద  నుండి అక్రమంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక తరలింపు కార్యకలాపాలను మీ దృష్టికి తీసుకురాదలచుకున్నాను. కాగజ్ నగర్ మండలం వంజీరీ వద్ద గల పెద్దవాగు, రాస్పెల్లి వాగు, సిర్పూరు (టి)  మండలంలోని పన్ గంగ నుండి, హీరాపుర్ వాగు నుండి,  కౌటాల, చింతలమానెపెల్లి మండలాల్లో ప్రాణహిత నది నుండి, బెజ్జూర్ మండలంలోని కుశ్నపెల్లి వాగు నుండి, పెంచికల్ పేట్ మండలంలోని లోడ్పెల్లి వద్ద ఉన్న బొక్కివాగు నుండి, దహెగాం మండలంలోని గిరవెల్లి వద్ద ఎర్ర వాగు నుండి పట్టపగలు అక్రమ ఇసుక దోపిడి జరుగుతున్నది. 

జేసీబీలు, లారీలు, ట్రాక్టర్ లను పెద్దఎత్తున ఉపయోగిస్తూన్నారంటే వ్యవహారం ఎంత దూరం పోయిందో ఆలోచించవచ్చు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ తదితర పట్టణాలకు ఈ అక్రమ ఇసుక తరలించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. 

ఇవాళ ఒక్క టన్ను ఇసుక రూ. 2500/- నుండి రూ.  3500/- ధర పలుకుతుంది.  ఎండాకాలం ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు జరుగుతాయి.  అక్కడి డిమాండ్ అదునుగా భావించి అక్రమార్కులు కాగజ్ నగర్ డివిజన్ లో అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు.

అక్రమ ఇసుక తవ్వకాల వలన కేవలం ప్రభుత్వానికి రెవెన్యూ రాబడి తగ్గుతుంది అనుకోవడం పొరపాటు. వాగులు, వంకలు ఎండిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉంది. వాల్టా చట్టం 2002 ప్రకారం మనం సహజవనరులను అతి భద్రంగా వాడుకోవల్సి వుంది.

ఈ అక్రమ ఇసుక మాఫియా ను నడిపిస్తూ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు దీనినే ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ అడ్డగోలు వ్యవహారాల్ని బహిరంగంగా కొనసాగిస్తున్నారు. పెంచికల్ పేట్ యంపీపి భర్త జాజిమొగ్గ శ్రీనివాస్, దహెగాం యంపిపి భర్త సంతోష్ గౌడ్,  కాగజ్ నగర్ వార్డ్ నెంబర్ 11 కౌన్సిలర్  యండి వలీ,  సిర్పూరు (టి) సర్పంచ్ భర్త కీజర్ హుస్సేన్, బెజ్జూర్ పిఎసియస్ చైర్మన్ అర్షద్ హుస్సేన్ తదితరులు ఈ అక్రమ వ్యాపారాల్లో తరిస్తున్నారు.

వీరందరికి ప్రధాన సూత్రధారి గా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్ పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తమ అక్రమ కార్యకలాపాలను యధేచ్చగా కొనసాగించడానికి కోనేరు కృష్ణ ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

ఈ అక్రమార్కుల ఆట కట్టించాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికక్కడ ఈ తవ్వకాలు జరుపుతున్న జేసీబీలను, ట్రాక్టర్ లను వెంటనే సీజ్ చేయాలి. రెండు సార్లు పట్టుబడితే పి.డి యాక్టు కింద కేసులు నమోదు చేసి అక్రమార్కులను జైలుకు తరలించాలి. అప్పుడు గాని సహజ వనరులను అతి సహజంగా దోపిడి చేస్తున్న వ్యక్తులను నిలువరించలేము.

ఒకవేళ ఈ వ్యవహారంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని తల దూర్చినట్లు తేలితే వారిపై నిరభ్యంతరంగా చర్యలు చేపట్టండి. మీరు నిజాయితి, నిబద్ధత గల అధికారి అని మంచి పేరు ఉన్నది.  మీరు తలుచు కుంటే ఈ అక్రమార్కుల భరతం పట్టడం పెద్ద విషయం కాదు. కావున ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని తక్షణ చర్యలకు ఉపక్రమించవలసిందిగా కోరుతున్నాము. భావి తరాలకు అందించ వలసిన విలువైన వనరులను మనం ఇప్పుడు కాపాడుకోలేక పోతే వచ్చే తరాలు మనల్ని క్షమించవు.

డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, సిర్పూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ.

Related posts

తెలంగాణాను ప్రగతి బాటన నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

నగరాభివృద్దిలో భాగంగానే నిధులు మంజూరు

Bhavani

ట్రాజెడీ: సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

Satyam NEWS

Leave a Comment