కేజీబీవీ కళాశాల విద్యార్థులకు,అధ్యాపకులకు కరోనా వైరస్ రాదా? అవును అంటున్నారు రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు. ఇక వివరాల్లోకి వెళితే ప్రతి జిల్లాలో 15 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ కేజీబీవీ, బాలికల కళాశాలలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు ఈనెల ఆఖరు వరకు మూసివేయాలని ఆదేశించారు కానీ కేజీబీవీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఇంటర్మీడియట్ అధ్యాపకులకు మాత్రం సెలవులు ఇవ్వడం లేదు. ఇదేమి విచిత్రం? ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా దాదాపు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలు, విద్యాసంస్థలు, మూత పడ్డాయి.
కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు మాత్రం ఈ నియమ నిబంధనలు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు కళాశాలకు రావాల్సిందేనని, అదేవిధంగా ఈనెల 25వ తారీకు నుంచి కే.జి.బి.వి.లలో ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇందులో పనిచేస్తున్న అధ్యాపకులు తమకు, విద్యార్థులకు, కరోనా వైరస్ రాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ వస్తే తమ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఏమిటని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సమగ్ర శిక్ష శాఖ అధికారులు తమ ఆలోచన మార్చుకుని కేజీబీవీ కళాశాలను తక్షణమే మూసి వేయాల్సిందిగా ఇటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.