31.2 C
Hyderabad
May 3, 2024 00: 39 AM
Slider సంపాదకీయం

దయచేసి ఇక సోనూ సూద్ ను వదిలేయండి

#SonuSood

నిజంగానే సోనూ సూద్ ను వదిలేయండి. ప్లీజ్. ఆయన ప్రజా సేవ చేసీ చేసీ అప్పుల పాలవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించడం మొదలు పెట్టిన నాటి నుంచి మానవత్వంతో ఆయన సేవ చేస్తున్నారు. ఎంతో మందికి ఆర్ధిక సాయం చేశారు. జీవితాలను నిలబెట్టారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా పని చేసే చోట ఇరుక్కుపోయిన వేలాది మంది వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంతో ప్రారంభమైన సోనూ సూద్ సేవా ప్రయాణం అనంతంగా సాగుతూనే ఉంది. వేలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మహా వ్యక్తి సోనూ సూద్.

సేవాభావంలో అనితర సాధ్యుడుగా మారిన సోనూ సూద్ ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న సేవకు సొంత డబ్బులను ఉపయోగిస్తున్నారు. ఆస్తులు కరిగిపోతున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కూడా ఇప్పించిన సోనూ సూద్ కు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

అయితే వాటిని ఆయన కష్టాలు అనుకోవడం లేదు. పది కోట్ల రూపాయల అప్పు కోసం ఆయన ఎనిమిది ఆస్తులు తాకట్టు పెట్టారు. ముంబయిలో ఆయనకు ఉన్న ఆరు ఫ్లాట్ లు, రెండు షాపులు తాకట్టు పెట్టడం ఇప్పుడు వార్తగానే కనిపిస్తున్నా ఇది బాధ కలిగించే విషయం.

దేశంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అందులో మంత్రులు అయిన వారు ఇంత మంది ఉన్నారు. తాము ఓటేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు తమ బాధలు చెప్పుకోకుండా సోనూ సూద్ కు ఎందుకు చెబుతున్నారని సత్యం న్యూస్ ప్రశ్నించింది.

ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోకుండా భారమంతా సోనూ సూద్ పైకి ఎందుకు తోస్తున్నారని కూడా ప్రశ్నించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యతను సోనూ సూద్ మోశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లూ చెవులూ మూసుకుని కూర్చున్నాయి.

తన పిల్లల్ని కాడెద్దులుగా చేసుకుని సాగు చేస్తున్న చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ కొనిపెట్టిన సోనూ సోద్ ను ఎగతాళి చేసిన మహానుభావులు కూడా ఉన్నారు మన సమాజంలో. ఇవేవీ పట్టించుకోని సోనూ సూద్ వితరణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఆయనకు వేలాది ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.

దయచేసి ఇప్పటికైనా సోనూ సూద్ ను వదిలేయండి. సొంత ఆస్తులు అమ్ముకుని మీకు సాయం చేస్తున్న ఆ మహావ్యక్తిని ఇప్పటికైనా వదిలేయండి. ఆయనకు బహుశ ఆస్తి మొత్తం అయిపోయినట్లుంది, మిగిలిన వాటిని తాకట్టు పెడుతున్నాడు.

సాయం చేస్తున్నాడు కదా అని ఆయన నెత్తిన భారం వేసి మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాలను వదిలేస్తున్నారు. ఇప్పటికైనా మీరు స్వయంగా ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలను మీకు కావాల్సిన సాయం అడగండి.

మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కాలర్ పట్టుకుని నిలదీయండి. సోనూ సూద్ ను వదిలేయండి. పాపం… మీకు సాయం చేస్తూ సోనూ సూద్ అప్పుల పాలు అవుతున్నారు. దయచేసి వదిలేయండి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్

Related posts

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీహార్ కు చెందిన ముస్లిం కార్మికులు

Bhavani

New Game Started: తెరాస లోకి పెద్దిరెడ్డి: బీజేపీ లోకి ఈటెల

Satyam NEWS

Leave a Comment