కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపో ఎదుట తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనలో అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులు కూడా పాల్గొని సార్వత్రిక సమ్మెకు తమ నిరసన తెలిపారు.
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసు జులూం నశించాలంటూ వారు నినాదాలు చేశారు. ఆందోళనకారులను నరసరావుపేట పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.