Slider సంపాదకీయం

మోకరిల్లే పోలీసుల వల్లే ఇలా జరుగుతున్నది

#Police

ఏదైనా నేరం జరిగినప్పుడు సమాచారం అందగానే పోలీసులు అక్కడకు వెళతారు. వారు ప్రాధమిక సమాచారాన్ని సేకరించి నేర తీవ్రతను బట్టి ఆధారాలను సేకరించే నిపుణులను పిలుస్తారు. నిపుణులు ఆధారాలు సేకరించిన తర్వాత నేరానికి సంబంధించిన మిగిలిన ఆధారాలు అంటే మర్డర్ లాంటి నేరాలు అయితే పోస్టు మార్టం రిపోర్టులు లాంటివి తెప్పించుకుంటారు.

అప్పుడు అనుమానితులకోసం వెతికి అరెస్టు చేసి చట్టం నిర్దేశించిన గడువు లోపు న్యాయస్థానం ముందు నిలబెడతారు. ఇదిగో ఇప్పటి వరకూ ఈ ఆధారాలు సేకరించాం, ఇంకా నిందితులు ఉన్నారు, వారిని కూడా అరెస్టు చేయాలి, అందుకు ఈ నిందితుడిని మా కష్టడీకి ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు న్యాయమూర్తి పోలీసులు చెప్పింది సహేతుకమని భావిస్తే పోలీసు కష్టడీకి లేకపోతే జ్యుడీషియల్ కష్టడీకి ఇస్తారు.

అత్యంత సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. ఇందుకు భిన్నంగా జరిపితే న్యాయస్థానంలో పోలీసులు తాము చేసిన పనిని సహేతుకంగా సమర్థించుకోవాల్సి ఉంటుంది. దాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది.

ఇలాంటివేం చేయకుండానే ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం దానిపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, దానికి రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. గత ప్రభుత్వం రాజ్యంగ బద్దంగా తమకు సంక్రమించిన అధికారాల ప్రకారం తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ కేసులు ఎలా దాఖలు చేస్తారనేది ప్రాధమిక ప్రశ్న.

రాజకీయంగా కక్ష సాధించేందుకే ఇలాంటి కేసు పెట్టారనది సాధారణ పౌరుడికి కూడా వచ్చే ఆలోచన. వీటన్నింటితో బాటు సరైన ఆధారాలు సేకరించకుండా పోలీసులు ఇలా నోటీసులు ఎలా ఇస్తారనేది మరో ప్రధాన ప్రశ్న.

అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని చెప్పి రాజకీయంగా లబ్ది పొందిన వైసీపీ ప్రభుత్వం ఆ కుంభకోణాన్ని నిరూపించాలనే పట్టుదలతో చేయరాని తప్పులు చేస్తున్నది. పోలీసు అధికారులు అయినా అలా కాదండీ ఇలా చేయాలని అని చెప్పడం లేదు.

అధికారంలో ఉన్నవారు ఏది చెబితే అదే చేస్తూ పోతే పరువు పోయేది పోలీసులకే తప్ప అధికారంలో ఉన్నవారికి కాదు. ముందు అరెస్టు చేయనివ్వండి ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తాం అని పోలీసులు అంటే ఏ కోర్టూ ఒప్పుకోదు.

అందులోనూ మాజీ ముఖ్యమంత్రిని అధికారిక కార్యకలాపాలు చేసినందుకు అరెస్టు చేస్తామంటే న్యాయ స్థానాలు అంగీకరించవు. అదే జరుగుతున్నది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఏ ప్రభుత్వంలో వెళ్లనన్ని సార్లు కోర్టుల ముందు హాజరు కావాల్సివచ్చింది.

అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేసి ఉద్యోగం పోగొట్టుకున్న పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి తప్ప మంచి పోస్టింగుల కోసం మోకరిల్లే పరిస్థితి ఉండకూడదు.   

Related posts

ట్రంప్ చెత్త పాలనను ఎండగట్టిన పెంటగాన్ మాజీ అధికారి

Satyam NEWS

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

సొంత చెల్లెలిపై దుష్ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment