నీళ్లు, నీళ్లలో ఉండే చేపలు ఇదే వారి జీవితం. ఈ రెంటిలో ఏది లేకపోయినా వారి కడుపు ఖాళీగా ఉండిపోవాల్సిందే. సాంప్రదాయ వలలు ఉపయోగించి ఒక్కో చేపా వేటాడి జీవనోపాధి సాగించే వారిపై అలివి వలలు ఉప్పెనలా వచ్చి పడ్డాయి.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులు తెలంగాణా ప్రాంతంలో సాగిస్తున్న దోపిడికి మరో ఉదాహరణగా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక వైపు చేప పిల్లల్ని వదిలి మత్స్యకారుల జీవితాలను బాగు చేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే అలివి వలలతో చేప పిల్లల్ని పట్టేసి అన్ని రకాలుగా అందరిని ఇబ్బంది పెడుతున్న దళారులు కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువయ్యారు.
ఎన్నో రోజులుగా మత్స్య కారులు గొడవ చేస్తుంటే ఇప్పటికి అధికారులు కళ్లు తెరిచారు. కొల్లాపూర్ మండల పరిధిలోని అమరగిరి, మొల్ల చింతలపల్లి లోని కృష్ణా నది ప్రాంతంలో మత్స్యకారుల పొట్ట కొడుతున్న ఆల్వివలలపై ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లూరు మత్స్యకారులు, పోలీస్ అధికారులు ఒక ఆల్వివలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులతో స్థానిక వ్యక్తి ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారని ఎల్లూరు గ్రామ వాసులు తెలుపుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఖాదర్ అనే వ్యక్తి వైజాగ్ నుంచి దళారులను తీసుకువచ్చి అల్వివలల కథ నడిపిస్తున్నారని ఎల్లూరు గ్రామ మత్స్యకారులు పొట్టకొడుతున్నారని మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారు.
ఇదివరకు అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాడులు నిర్వహించి ఆల్వివలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 12.40 లకు పోలీస్ స్టేషన్ కు ఆ వలను తీసుకువచ్చారు. పూర్తి వివరాలు పోలీసు అధికారులు అధికారికంగా తెలియజేయాల్సిఉంది.
అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్న అల్వి వలను మత్స్య శాఖ అధికారులు వచ్చాక పంచనామా నిర్వహిస్తామని అప్పుడు పూర్తి వివరాలు తెలియచేస్తామని స్థానిక ఎసై కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు.