రాజకీయ నాయకులు రంగులు మారుస్తారని అందరికి తెలుసు. అన్ని రంగులూ మారతాయి కానీ ఎర్ర రంగు అంత సులభంగా మారదని అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఎర్ర రంగు కూడా మారిపోతుందని సిటిజన్ షిప్ ఎమెండ్ మెంట్ బిల్ (సిఏబి) నిరూపించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) అనే బలమైన సిద్ధాంత పునాదులు ఉన్న పార్టీ ఒకటి ఉంది.
వాడుక భాషలో సిపిఎం అంటారు. 2012 ఏప్రిల్ లో 20వ సిపిఎం మహాసభలు జరిగాయి. ఆ మహాసభల్లో ఒక తీర్మానం చేశారు. అదేమిటంటే బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న బెంగాలీ హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వాలని. దానికోసం పౌరసత్వ చట్టాన్ని సవరించాలని ఆ మహాసభల్లో తీర్మానం చేశారు కూడా.
బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువులు అక్కడి మెజారిటీ ప్రజల చేతుల్లో నానా హింస పడి భారత్ కు వలసవస్తున్నారని అలాంటి శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. అసోం ఒప్పందానికి విఘాతం కలగకుండా ఇది చేయాలని తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని 2012 ఏప్రిల్ లో వారు చేసిన డిమాండ్ ను వారే మర్చిపోయారు.
ఆనాడు చేసిన తీర్మానంలో సిపిఎం మరొక్క విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ‘‘ చారిత్రక పరిణామాల నేపథ్యంలో తమకు సంబంధం లేకుండా బాధితులుగా మారిన అలాంటి పౌరుల పట్ల అన్ని పార్టీలూ సానుకూలంగానే ఉన్నాయి. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో జరిగిన చర్చల్లో వెల్లడించారు’’ అంతే కాకుండా ఆనాడు సిపిఎం ఆమోదించిన తీర్మానంలో మరో ముఖ్య విషయం కూడా ఉంది.
రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలను సిపిఎం తీర్మానంలో ఉటంకించారు. వారి తీర్మానంలో పేర్కొన్న ప్రకారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే ‘‘ దురదృష్టవశాత్తూ శరణార్థులుగా మారిన వారిని మానవతా దృక్పథంతో చూడాలి. ఈ శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందుకోసం మానవత్వంతో వ్యవహరించాలి’’. ఆ రోజుల నుంచి ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి.
ఈశాన్య రాష్ట్రాలలోని సాంప్రదాయ గిరిజన జాతులను నిర్మూలించే కుట్ర ఇది అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పుడు అంటున్నారు. మహ్మద్ అలీ జిన్నా, సావార్కర్ లు కలలుకన్న విధంగా ఈ బిల్లు ఉందని మత ప్రాతిపదికన దేశాన్ని బిజెపి వాళ్లు విడగొడుతున్నారని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడమే తప్ప న్యాయంగా విమర్శిద్దాం అనే ప్రతిపక్షాలు లేకపోవడం నిజంగా దేశం చేసుకున్న దురదృష్టం.