38.7 C
Hyderabad
May 7, 2024 15: 16 PM
Slider ప్రత్యేకం

వ్యాపారమే రాజకీయం… రాజకీయమే వ్యాపారం

#politics

” ఎలాంటి సన్నద్ధతా అవసరం లేని వృత్తి బహుశా రాజకీయాలు ఒక్కటెనేమో!” రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ అనే స్కాటిష్  కవి, రచయిత అన్న మాటలు ఇవి. నేటి భారతదేశ రాజకీయాలను పరిశీలిస్తే… ఆ మాటకొస్తే ప్రపంచ రాజకీయాల తీరు తెన్నులు పరికించినా ఇదే అభిప్రాయం కలగడం సహజం. దీనికి ప్రబలమైన కారణం ఒక్కటే. ఒక జాతి వర్తమానం తో పాటు భవితను శాసించే శక్తివంతమైన ఆయుధంగా రాజకీయం పరిణామం చెందింది. చెందుతోంది.

ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రజల జీవితాలతో క్రీడిస్తోంది. భారత దేశం విషయం తీసుకుంటే… వేల సంఖ్యలో రాజకీయ పార్టీలు  పుట్టుకొస్తున్నాయి. వాటిలో ప్రభుత్వం గుర్తించినవి కొద్ది సంఖ్యలోనే ఉంటాయి.  రాజకీయ పార్టీలుగా తమను తాము చెప్పుకునే సమూహాలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవటం దగ్గరే ఆగిపోతాయి. ఇంకా వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 23, 2021నాటికి మొత్తం రిజిష్టర్ అయిన పార్టీలు 2858 కాగా, వాటిలో 8 జాతీయ స్థాయి పార్టీలు, 54 రాష్ట్ర స్థాయి పార్టీలు, 2796 గుర్తింపు పొందని పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

వీటిల్లో చాలా వరకు మఖలో పుట్టి పుబ్బలో పోయేవేనని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆయా ప్రాంతాలలో ఆయా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరని నేపథ్యంలో ప్రాంతీయంగా పుట్టుకొచ్చే రాజకీయ పార్టీలు ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ఏలుబడి సాగిస్తున్నాయి. మరికొన్ని చోట్ల జాతీయ రాజకీయ పార్టీల ఉనికిని గండికొట్టే దశకు ప్రాంతీయ పార్టీలు దూసుకు పోతున్నాయి.

స్థానిక అవసరాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం గడుతున్నారు. శతాధిక సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ , ఒకనాడు కార్మిక – కర్షక పక్షపాతిగా ఉద్యమాలు నెరపిన వామపక్ష పార్టీలు క్రమంగా ప్రజామోదం పొందడంలో విఫలమయ్యాయి. విఫలమవుతున్నాయి. అరవై, డెబ్భై దశకాల్లో…కాంగ్రెస్,సోషలిస్ట్, జనసంఘ్,వామపక్ష , తదితర పార్టీలకు ఎవరికి వారికే ప్రత్యేకమైన పార్టీ సిద్ధాంతాలు, నియమావళి ఉండేవి.

ప్రజల సమస్యలపై అంశాలవారీగా స్పందించే క్రమంలో ప్రజాస్వామ్య భావనకు ఎటువంటి తూట్లు పొడవని విధంగా రాజకీయాలు హుందాగా సాగేవి. సమాజంలో విద్వేషం రెచ్చగొట్టే సాహసానికి ఒడికట్టేవి కావు. నీతి నిజాయతీల నీడలోనే నేతలు నిస్వార్థ జీవితాల్ని గడిపేవారు. ఈ  కారణంగానే ఆ రోజుల్లో రాజకీయనేతలు అంటే ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉండేవి.

ఈనాడు చూద్దామన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక వావిలాల గోపాలకృష్ణయ్య  అరుదుగా ఉంటారు. అయితే.. ఇప్పటికీ కొంతమంది ప్రజా ప్రతినిధులు సాదా సీదాగా  ఉండడం వెలుగులోకి వస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఎక్కువశాతం ప్రజా ప్రతినిధులు రాజకీయాన్ని ప్రజాసేవగా కాకుండా వ్యాపార వనరుగా చూడటంతోనే అసలు ప్రజాస్వామ్యం అభాసుపాలు కావడం మొదలైంది.

కోట్లు వ్యయం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంతకు పదింతలు సంపాదన కోసం నేతలు అవినీతికి పాల్పడతారనేది జనాభిప్రాయం. జనం అలా ఆలోచించడం తప్పెలా అవుతుంది. పదవి చేపట్టిన కొద్ది కాలానికే ప్రజా ప్రతినిధులు సంపన్నులు కావడం కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం. వాస్తవాలు ఇలా ఉన్నా, బాధ్యత గల పౌర సమాజం స్పందించకపోవడం, విద్యావంతులు, మేధావులు మౌనం పాటించడం వంటి అంశాలు రాజకీయులకు రాచమార్గాలు వేశాయి.

ఇదే అదనుగా రాజకీయాలలోకి అన్ని రంగాలకు చెందిన వారు ప్రవేశించడం నిరాటంకంగా జరుగుతోంది. సమాజంలో గుర్తింపు పొందాలంటే రాజకీయ ప్రవేశం ఒక్కటే అన్నంత సహజంగా సో కాల్డ్ నేతల దృక్పథం మారిపోయింది. రాజకీయాల ప్రవేశానికి ధన బలం, మంది బలం ఉంటే చాలనుకనే  స్థాయికి పరిస్థితి దిగజారిపోవడం శోచనీయం. ఇవన్నీ గమనించిన వారికి రాజకీయం ఒక వృత్తిగా ఎంపిక చేసుకున్న వారికి ఎలాంటి సన్నద్ధత అవసరం లేదని ప్రత్యేకంగా రుజువు చేయాల్సిన అవసరం లేదు.

Related posts

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

ఆకట్టుకునే విధంగా ప్రమిదలు

Murali Krishna

ఖాకీల‌కు క‌రోనా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌….27 వ‌ర‌కు…!

Satyam NEWS

Leave a Comment