28.7 C
Hyderabad
May 14, 2024 23: 28 PM
Slider ప్రత్యేకం

హేతువాద జ్యోతి రావిపూడి వెంకటాద్రి 103వ జయంతి నేడు

#ravipudi

రావిపూడి అనే నాలుగక్షరాల పేరు తెలుగు నాట  హేతువాద ,మానవవాద ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కవిరాజు త్రిపురనేని రామస్వామి తరువాత హేతువాద భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అలుపెరుగని నడక రావిపూడి వారికే సాధ్యమైంది. 102 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో 80 సంవత్సరాలు హేతువాద, మానవవాద ఉద్యమాల వ్యాప్తికి వెచ్చించిన రాజీలేని ఉద్యమ సారధి రావిపూడివారు. ఆలోచనాపరులైన చిన్న, పెద్ద అందరికీ హేతువాదాన్ని పరిచయం చేసిన రావిపూడి వేంకటాద్రి గారు 1922 ఫిబ్రవరి 9న బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచే స్వీయ ఆలోచనలతో ఎదిగారు. విద్యార్థి దశలోనే కవిత్వం రాశారు. త్రిపురనేని  రామస్వామి, ఎమ్.ఎన్.రాయ్ ప్రభావంతో సామాజిక భావ విప్లవం వైపు అడుగులు వేశారు. స్వగ్రామంలో కవిరాజాశ్రమం స్థాపించారు. ఎందరో యువకులను హేతువాదులుగా మార్చారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1982లో హేతువాది పత్రికను స్థాపించారు.

తను నమ్మిన నిజాన్ని, సిద్ధాంతాన్ని, ఉద్యమ లక్ష్యాలను  స్పష్టమైన, సరళమైన తెలుగులో తమ రచనల ద్వారా ప్రజలకు పరిచయం చేసి , ఉద్యమానికి కొత్త మలుపునిచ్చారు. 100 పైగా రచనలు చేసి సమకాలీకుల్లో స్ఫూర్తిదాతగా నిలిచారు. “వేల సంవత్సరాల నుంచి ప్రజల మనస్సులో పేరుకుపోయిన మౌఢ్యాన్ని తొలగించి , శాస్త్రీయ దృష్టి తో ఆలోచించేందుకు నా రచనలు ఉపయోగపడితే నా కృషి సార్ధకమైనట్లే ” అన్నారు రావిపూడి. 

“నేను వ్యక్తిగత గుర్తింపు కోసమో , డబ్బుకోసమో , అవార్డుల కోసమో రచనలు చేయలేదు. సహేతుక దృష్టి తో, సత్యాన్వేషణతో రాస్తున్నాను. చాలామందికి నా భావాలు నచ్చకపోవచ్చు. చాలామందికి  నచ్చినా, నచ్చకపోయినా నా మార్గం మారదు” అని  తమ రచనల ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. “హేతువాదులంతా పిడివాదులు,పెడవాదులు “అన్న అపవాదును భూస్థాపితం చేసి, హేతువాదులు సమాజ హితవాదులు, మానవవాదులు  సకల మానవాళి శ్రేయోవాదులనే కొత్త భావజాలాన్ని రావిపూడి వారు ప్రాణం పోశారు.  విప్లవమంటే మార్పేకాని వీరంగం కాదన్నారు. మూక ఉద్యమాలు , మూస ఉద్యమాలు ప్రజల్ని మార్చలేవన్నారు. పుట్టుకతో ఆలోచనా పరుడైన మానవుడు పరిపూర్ణ వ్యక్తిగా ఎదగాలంటే మానవవాదమే శరణ్యమన్నారు.

బాపట్ల జిల్లాలోని ఇంకొల్లులో “రాడికల్ హ్యూమానిస్తూ సెంటర్ “ను స్థాపించి విశాలమైన భవనాన్ని, విలువైన గ్రంథాలయాన్ని తమ ఉద్యమ కానుకగా వారు బహుకరించారు .  హేతువాదాన్ని తమ జీవన విధానంగా మార్చుకొని, సమకాలీన మేధావులు, ఉద్యమ కర్తలైన ఆవుల గోపాల కృష్ణ మూర్తి (ఏ .జి .కె ) కొల్లా  సుబ్బారావు, ఎన్ .వి .బ్రహ్మం, మల్లాది రామమూర్తి, గోరంట్ల రాఘవయ్య, అంచా  బాపారావు, బసవ వున్నా రావు వంటి వారితో నడచి ఉద్యమాన్ని బలోపేతం చేశారు.

రావిపూడి వెంకటాద్రి గారు మన తరం గర్వించతగ్గ గొప్ప హేతువాది. హేతువాదాన్ని మానవ వాదంతో సమన్వయించి “దేవుడు పచ్చి  అబద్దం. సృష్టిలో అన్నింటికీ కేంద్ర బిందువు మానవుడే ” అని స్పష్టంగా చెప్పారు. కవిరాజు త్రిపురనేని జాతికిచ్చిన “ప్రశ్న” ఖడ్గాన్ని ఒక చేత్తో , ఎమ్ .ఎన్ .రాయ్  శాస్త్రీయ దృక్పధాన్ని మరో చేత్తో పట్టుకొని తెలుగునాట భావవిప్లవ జ్యోతిని వెలిగించిన మనతరం మేధావి రావిపూడివారు.

 “నేను హేతువాదినే,  మోటు తార్కికుణ్ణి కాదు . నేను మానవవాదినే  , మతవాదిని  కాదు” అని తమ జీవన తత్వాన్ని , వ్యక్తిత్వాన్ని నిర్వచించుకునే వెంకటాద్రి  గారికి అసంఖ్యాకంగా శిష్యులున్నారు, అనుచరులున్నారు, ఉద్యమాభిమానులున్నారు. అందరూ ఆచరణాత్మక హేతువాదులు కావాలి. నాలుగు గోడల మధ్య ఉపన్యాసాల కంటే నలుగురిలోకి వెళ్లి  హేతువాద, మానవవాదల ఆవశ్యకతను వివరించాలి ,ఆలోచింపచేయాలి. రావిపూడి వారి ఆశయం కూడా అదే. ఇవాళ పదుల్లో , వందల్లో వున్న హేతువాదులు, భవిష్యత్తులో  వేల సంఖ్యకావాలంటే రావిపూడి వారి రచనలను పరిశీలించాలి, పఠించాలి. పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. మన రాజ్యాంగం లో పొందుపరచిన శాస్త్రీయ దృక్పథం ప్రాధాన్యతను రాజకీయ నేతలు, అధికారులు , యువతీయువకులు గ్రహించాలి. స్వీయాలోచనతో ముందుకు సాగాలి. ఆ మార్గంలో రావిపూడి వెంకటాద్రి  గారు హేతువాద ఉద్యమ జ్యోతిగా వెలుగులీనుతూనే వుంటారు.  వారి జయంతి సందర్భంగా  ఆత్మీయ నివాళి.

డాక్టర్ బీరం సుందర రావు, చీరాల

Related posts

మైనారిటీ ఓట్ల కోసం సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసరాలు ఇచ్చిన గాయత్రి సొసైటీ

Satyam NEWS

Leave a Comment