36.2 C
Hyderabad
May 12, 2024 19: 07 PM
Slider జాతీయం

ఆర్థిక సాధికారతతోనే మహిళకు సమానత్వం

venkaiah 08

విద్య, ఆర్ధికంగా మహిళకు సాధికారత కల్పించినపుడే వారికి సమాజంలో సమానత్వం లభిస్తుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా, సామాజికంగా స్త్రీలను ముందుకు తీసుకెళ్లేందుకు మరింత కృషిజరగాల్సిన అవసరం ఉందన్నారు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రెండు వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళాసభ ఆధ్వర్యంలోని పి.ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడగలిగినపుడే మనం అభివృద్ధి చెందినట్లు, పనికేంద్రాల్లో మహిళలు క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. మన దేశంలో చాలాచోట్ల ఆడవారిని వంటింటి కుందేలుగా చూసే పరిస్థితి ఉంది.

ఇది వారికి ఆర్థిక అవకాశాల పరిధిని పరిమితం చేసింది. ఈ విధానంలో మార్పు తీసుకువచ్చి.. వారికి విద్య, ఉద్యోగంతోపాటు ఆర్థికపరమైన అంశాల్లో సమానత్వం కల్పించినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది’ అని అన్నారు. ‘స్త్రీకి విద్య, ఆర్థిక అధికారం దక్కినపుడే సమానత్వం, సాధికారతకు బాటలు పడతాయి.

ప్రభుత్వాలతో పాటుగా కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలతో సమాజంలో ఈ దిశగా మార్పు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వేదకాలం నుంచీ మహిళలకు సరైన గౌరవం దక్కేదని గుర్తుచేస్తూ.. తదనంతర కాలంలో పురాణాలకు సాకుగా చెప్పి మహిళలను తక్కువగా చూడటం మొదలుపెట్టారన్నారు.

మధ్యలో పుట్టిన ఈ రకమైన ఆలోచనకు చరమగీతం పలికి మళ్లీ పడతికి పట్టం గట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మహిళా సాధికారతను అనేక కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

దీని కోసం ముందు సమాజం ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు సాధికారత చాలా అవసరం. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న మంది మహిళలకు సరైన అవకాశాలు కల్పించి వారి శక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు.

ఈ దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతోపాటు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. విద్యనందించడంతోపాటు మహిళలకు సంస్కృతి, సంస్కారం నేర్పించడం ద్వారానే సమాజంలో సరైన గౌరవాన్ని అందించగలమని బలంగా విశ్వసించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆ దిశగా చేపట్టిన అనేక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

వారు చూపిన బాటలో స్రీజనోద్ధరణకు, మహిళల సమానత్వానికి అందరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పి. ఓబుల్ రెడ్డి విద్యాసంస్థ చైర్మన్, ఎస్‌వీ రావు, ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు, ఉషారెడ్డి, పి. ఓబుల్ రెడ్డి విద్యాసంస్థ కార్యదర్శి, నరసింహా రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతాశంకర్ సహా వివిధ రంగాల ప్రముఖులు, పాఠశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆడదంటే గడపదాటడంలోనే కాదు.. చరిత్ర పుటల్లో కి ఎక్కాలి

Satyam NEWS

సంపదను సృష్టిద్దాం.. ప్రజలకు పంచుదాం

Bhavani

ప్లేన్ క్రాష్:బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ తో సహా 9మృతి

Satyam NEWS

Leave a Comment