40.2 C
Hyderabad
May 2, 2024 15: 42 PM
Slider సంపాదకీయం

రేవంత్ రెడ్డీ ఈ శకునులు… శల్యులను వదిలించుకో

#RevanthReddy

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వస్తుందా? గత ఎన్నికల మాదిరిగా మళ్లీ చతికిలపడుతుందా? ఈ ప్రశ్నలు ఎంతో మంది మదిలో ఉత్పన్నం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఇంకా ఉన్నవారి మనసును తొలిచేస్తున్న ప్రశ్నలు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నైరాశ్యం ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడు ఉండేవాడు కాదు. టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు నడచుకునే వారు ఎక్కువగా కనిపించేవారు.

టీఆర్ఎస్ తో లాలూచి పడి కాంగ్రెస్ నాయకులు బతికేవారు. ఈ దశలో చాలా మంది కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఈ దశలో ఉత్సాహవంతుడైన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని చాలా మంది కోరుకున్నారు.

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఒక్కరే తెలంగాణ లో బతికించగలరని చాలా మంది భావించారు. అయితే రేవంత్ రెడ్డి అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎన్నో అడ్డుపుల్లలు వేశారు. సుమారుగా ఏడాది పాటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నారు. అయితే ఈ సీనియర్ల మాట వినకుండా రాహుల్ గాంధీ చొరవ తీసుకుని రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించేశారు.

రేవంత్ రాకతో బలోపేతం అయిన కాంగ్రెస్ పార్టీ

రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకోవడం ప్రారంభించింది. కొత్త వర్గాలు కాంగ్రెస్ పార్టీలోకి రాకపోయినా ఉన్నవారు బయటకు వెళ్లడం ఆగిపోయింది. నిత్యం ప్రజల్లో ఉంటూ రేవంత్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ అభిమానుల మదిలో ఆశలు రేపారు. ఈ దశలో సీఎం కేసీఆర్ తనకు ప్రధాన ప్రత్యర్ధిగా బిజెపి ఉండాలని భావించారో ఏమో కానీ బిజెపిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం మొదలు పెట్టారు.

కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా తరచూ మాట్లాడుతూ ఆ పార్టీ తెలంగాణలో పెరిగేందుకు కేసీఆర్ దోహదం చేస్తున్నారు. దాంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బిజెపి రాష్ట్రంలోని కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నువ్వా నేనా అన్న స్థాయికి చేరింది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయాలి? అందరూ కలిసి కట్టుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అంతే కదా?…. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది?

ఏం జరుగుతున్నదీ అంటే… వెన్నుపోట్లు…. ముఠా తగాదాలు… పార్టీ సీనియర్ నాయకులుగా చెప్పుకునే వి.హనుమంతరావు, జగ్గారెడ్డి లు బాహాటంగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

పెరుగుతున్న శత్రువులు

ఇప్పటి వరకూ బయట ఒకడే శత్రవు ఉండేవాడు. అది టీఆర్ఎస్. ఇప్పుడు మరో శత్రవులు తయారయ్యారు. అది బిజెపి. ఈ రెండు బయటి శక్తులతో పోటీ పడటానికే రేవంత్ రెడ్డి శక్తికి మించి పని చేస్తుంటే ఇప్పుడు శకుని మామలు, శల్యులు తయారయ్యారు. ఈ శకునులు, శల్యులు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారు. ఈ శకునులు, శల్యులతో పార్టీకి ఏ మాత్రం లాభం లేదు సరికదా నష్టం వాటిల్లుతుంది.

వీరి వల్ల పార్టీ మరింత దిగజారిపోతున్నది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉరుకులు పెడుతున్న పార్టీకి వీళ్లు కళ్లెం వేస్తున్నారు. రేవంత్ రెడ్డి తక్షణమే హనుమంతరావు, జగ్గారెడ్డి లాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపి తన తదుపరి కార్యాచరణ చేసుకోవాలి. ఈ శకునులు, శల్యులు ఉన్నంత కాలం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు.

Related posts

రాజకీయాలలో ద్రోణంరాజు వారసత్వం కొనసాగించాలి

Satyam NEWS

హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

Satyam NEWS

కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ఆశా జనకం

Satyam NEWS

Leave a Comment