37.7 C
Hyderabad
May 4, 2024 13: 47 PM
Slider ప్రత్యేకం

రఘురామకృష్ణంరాజును లాకప్ లో నిజంగానే కొట్టారా?

#RRRNew

లాకప్ లో పోలీసులు తనను కొట్టారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు ఈ నెల 14న హైదరాబాద్ లో అరెస్టు చేసి రఘురామకృష్ణంరాజును మంగళగిరి తీసుకువెళ్లిన తర్వాత పలు అంశాలు చోటు చేసుకున్నాయి.

ఇందులో భాగంగా ఆయన కాళ్లకు గాయాలయ్యాయి. ఈ గాయాలు ఆయనకు ఎలా అయ్యాయి అనే విషయంపై నిజానిజాలు తేల్చేందుకు సీఐడి కోర్టు జడ్జి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రి అయిన రమేష్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించి రెండు రిపోర్టులను తమకు సీల్డ్ కవర్ లో అందివ్వాలని ఆదేశించారు.

అయితే సిఐడి పోలీసులు ఆయనను గుంటూరు ఆసుపత్రిలో పరీక్ష చేయించి నేరుగా జైలుకు తరలించారు. అంతే కాకుండా ఆయనకు ఈ గాయాలు ముందు నుంచి ఉన్న సోరియాసిస్ వ్యాధివల్ల కలిగాయని సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరిగింది.

ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టులో కూడా ఎడిమా కారణంగా రఘురామకృష్ణంరాజు కాళ్లకు పగుళ్లు వచ్చాయనే విధంగా ఉంది. అయితే ఈ రిపోర్టు ఇచ్చిన డాక్టర్ ఒక గైనకాలజిస్టు అని, ఆమె భర్త అధికార పార్టీ లీగల్ సెల్ లో కీలక బాధ్యతలు పోషిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలకు తరలించాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో తీవ్ర జాప్యం  జరగడంతో రఘురామకృష్ణంరాజు సతీమణి రమాదేవి తన తీవ్ర నిరసన తెలుపుతూ ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ తరలించే ఏర్పాటు చేశారు.

రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వద్దకు రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్మీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టిన విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మళ్లీ చెప్పారు. తాను పోలీసుల కష్టడీలో ఉన్నప్పుడు ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారని ఆయన చెబుతున్నారు.

ముసుగు వేసుకుని వచ్చిన వారిలో సిఐడి ఉన్నతాధికారి కూడా ఒకరు ఉన్నారని రఘురామకృష్ణంరాజు స్పష్టంగా చెబుతున్నారు. ఈ సంఘటన నిజంగా జరగకపోతే రఘురామకృష్ణంరాజు ఈ విధంగా చెబుతారా అనే సందేహం చాలా మందికి వస్తున్నది.

పోలీసు లాకప్ లో ఉన్న తనపై దాడి జరగకపోయినా జరిగినట్లు చెబితే కేసు ఎంత తీవ్రం అవుతుందో రఘురామకృష్ణంరాజుకు తెలియదా? అయినా ఆయన అలానే చెబుతున్నారంటే లాకప్ లో ఏదో జరిగి ఉంటుందనే అనుమానం కలుగుతున్నది. అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాత్రం అందుకు విరుద్ధంగా నివేదిక ఇచ్చారు.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు నిష్పక్షపాతంగా రిపోర్టు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. లాకప్ లో దాడి జరిగినట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరిస్తే సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలు ఉంటాయి.

అదే విధంగా వైద్య పరీక్షలు జరిపి తప్పుడు నివేదిక ఇచ్చారని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆర్మీ వైద్య అధికారులు రఘురామకృష్ణంరాజు శరీరంపై గాయాలను సహజమైనవేనని, పోలీసులు కొట్టినవి కాదని చెబితే రఘురామకృష్ణంరాజు తీవ్రమైన శిక్షను ఎదుర్కొనాల్సి రావచ్చు.

ఏపి సిఐడి పోలీసులు ఆయనపై మరిన్ని కేసలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆంధ్రప్రదేశ్ పోలీసులను లోనికి రానివ్వలేదు. వారిని ఎంట్రెన్సులోనే నిలిపివేశారు.

గుంటూరు జైలు నుంచి కారులో వచ్చిన రఘురామకృష్ణంరాజును అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆర్మీ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వైద్య పరీక్షల తర్వాత నివేదికను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అందచేయాల్సి ఉంటుంది. ఈ ప్ర్రక్రియ మొత్తం వీడియో తీసి దాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందచేయాల్సి ఉంటుంది.

Related posts

ప్రతి ప్రైవేట్ ల్యాబ్ ధరల పట్టికను తప్పనిసరిగా ప్రకటించాలి

Satyam NEWS

దింపుడు కళ్లెం ఆశలా రాయలసీమ డిక్లరేషన్

Bhavani

మిస్సింగ్ కేసుల పరిష్కారంలో ముందంజ

Satyam NEWS

Leave a Comment