38.2 C
Hyderabad
May 5, 2024 20: 13 PM
Slider తూర్పుగోదావరి

సంక్రాంతి సంబరాలు సంప్రదాయానికి ఆనవాలు

#Sankranti celebrations

సంక్రాంతి సంబరాలు తెలుగు ప్రజల లోగిళ్ళలో సంప్రదాయానికి ఆనవాలుగా నిలుస్తాయి.‌ చిన్న పెద్దా, ముసలి ముతకా, అక్కడా ఇక్కడా అనే బేదభావం లేకుండా ఎల్లెడలా జనులందరూ ఐకమత్యంతో జరుపుకునే ఈ సంబరాలు గత కొన్నేళ్లుగా ముందస్తుగా జరుగుతున్నాయి. ముందస్తుగా సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఇప్పుడు ఓ సంప్రదాయంగా వస్తోంది.

ఈ క్రమంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను బుధవారం నూతన ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు యరమాటి సూర్యనారాయణ మార్గనిర్దేశంలో ఉదయం సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలు భువికి దిగివచ్చినట్టు రంగురంగుల దుస్తులను ధరించి అచ్చ తెలుగింటి ఆడపడుచుల్లా సంక్రాంతి కళ కొట్టొచ్చినట్టు ముస్తాబై వచ్చిన చురుకైన విద్యార్ధినిలు పాఠశాల పుడమికి పచ్చని చీరకట్టినట్టు రంగువల్లులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.‌ భోగి మంటలను వేసి చలికాచుకొని శీతాకాలపు చల్లదనాన్ని పారదోలే ప్రయత్నం చేశారు.‌ గొబ్బెమ్మలను అలంకరించారు. అందమైన బొమ్మల కొలువును నెలకొల్పారు.

విద్యార్ధినిలు తమ ఇండ్ల వద్ద తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్ధాలను బోనాలు పండుగలా ప్రదర్శించారు.‌ వాటిని కార్యక్రమం అతిధి దేవుళ్ళకు వినమ్రంగా అందించి సంక్రాంతి వంటకాల రుచులను చవిచూపించారు.‌ ఇక మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత కళాసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో బాలబాలికలు నిమగ్నం అయ్యారు. ఒకప్పుడు ఈ హిందూ దేశంలో సింధు నాగరికత ఆవిర్భావం తర్వాత తెలుగు జనపదాల్లో వెలసి విలసిల్లి క్రమంగా కాలానుగుణంగా కనుమరుగై పోతున్న జానపద కళలను ప్రదర్శించారు.

హరిదాసు, గంగిరెద్దులు, సంప్రదాయ వస్త్రధారణ వంటి వివిధ వేషధారణలు, ఆహార్యాలను ప్రదర్శించారు. వివిధ నృత్య రీతులను చూపరుల కనులకు ఇంపుగా వీనుల విందుగా ప్రదర్శించారు. తమలోని ప్రతిభను సంక్రాంతి వేడుకల వేదికపై ప్రజల ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతను, ప్రాధాన్యతను ప్రధాన ఉపాధ్యాయులు యరమాటి సూర్యనారాయణ విద్యార్థులకు వివరించారు.

మొత్తం మీద సంక్రాంతి వేడుకల శోభకు పాఠశాల ప్రాంగణంలో ప్రాణం పోసారు. సభికుల అభినందనలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండలాధీశుడు పర్వత రాజబాబు, స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, 31 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు

Satyam NEWS

ఆత్మ‌విశ్వాసంతో ప‌రీక్ష‌ల‌కు సిద్దంకండి

Satyam NEWS

పూలమ్మ ను చూసి నేర్చుకోండి పాలకులూ

Satyam NEWS

Leave a Comment