29.7 C
Hyderabad
May 3, 2024 06: 34 AM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Puli Jamuna

ఓరుగల్లు పోరుగడ్డలో తెలంగాణ బిడ్డగా

ప్రభవించిన ప్రభాకరుడు పీవీ నరసింహారావు

పసితనంలోనే అంకురించిన దేశభక్తితో

నిజాం ప్రభుత్వం నిషేధించిన వందేమాతరగీతాన్ని

ధైర్యంగా గళమెత్తి ఆలపించిన ఉద్యమకారుడు

పదవులను ఆశించకయే సమర్థత సౌశీల్యంతో

రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి

ప్రధానమంత్రి పదవినలంకరించిన దక్షిణాత్యుడు

తిమిరాంధకారం అలముకున్న ఆర్థిక వ్యవస్థను

విప్లవాత్మకమైన సంస్కరణలతో పునాది వేసి

కాలానికి ఎదురు నిలిచిన మేరునగ ధీరుడు

ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజానేత

దేశ చరితను మలుపు తిప్పిన మేధో సంపన్నుడు

పరిపాలనలో దీక్షాదక్షతలు కలిగిన ద్రష్ట

సంస్కరణలతో వెలుగు బాట చూపిన స్రష్ట

చరిత్రపుటల్లో అరుదైన స్థానం పొందిన సవ్యసాచి

మోముపై చెదరని చిరు దరహాసంతో

తెలుగు దనం ఉట్టిపడే నిరాడంబర ఆహార్యం

బహుభాషలలో విశేష పాండిత్యం గడించినా

హంగులుఆర్భాటాలకు అల్లంతదూరంలో వుంటూ

మౌనమే రూపుదాల్చిన వినిర్మల శాంతమూర్తి

నీతి నిజాయితీలే నిలువెత్తు ఆభరణాలై

ఎంత ఎదిగిన ఒదిగి వుండే స్థితప్రజ్ఞుడు పీవీ

తెలుగు సాహితీవనంలో పరిమళించిన సుమమై

నిబద్దత కర్తవ్య నిర్వహణయే ధ్యేయంగా

ఒడిదుడుకుల రాజకీయ జీవిత యానాన్ని 

‘లోపలి మనిషి’గా ఆత్మకథాత్మక నవలను

ఆవిష్కరించిన సాహితీశిఖరం పీవీ

తెలంగాణ సాయుధ పోరాటంలో

తెగువ చూపిన వీర వనిత ‘గొల్ల రామవ్వ’ను

అక్షరీకరించిన నిత్య సాహిత్య పిపాసి 

పాండిత్య పటిమచే వేయి పడగలను

హిందీలోకి అద్భుతంగా అనుసృజన గావించి

సాహిత్య అకాడమీ అవార్డు సొంతం చేసుకున్న

బహుముఖ ప్రజ్జావంతుడు పండితుడు

వ్యాస అనువాద రంగాలలో అందెవేసిన చేయిగా

సాహితీ సేధ్యం చేసిన బహుభాషా కోవిదుడు

నవనవోన్మేష పరిణామాలకు శ్రీకారం చుట్టి

భరతావనిలో నవయుగానికి నాంది పలికి

దేశ కీర్తి చంద్రికలను విశ్వవ్యాప్తం చేసిన

తెలుగు తేజోపుంజం పీవీ నరసింహారావు

-పులి జమున, మహబూబ్ నగర్

Related posts

మరలిరా..

Satyam NEWS

మనదే మే డే

Satyam NEWS

ఆదర్శ భారతీయుడు

Satyam NEWS

Leave a Comment