బెజ్జుర్ మండలంలోని నాగేపల్లి, మొగవెల్లి గ్రామాల శివార్లలో ఫారెస్ట్ అధికారులు తవ్వుతున్న కందకాలను కాంగ్రెస్ పార్టీ బెజ్జూర్ మండల కమిటీ నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆదివాసీలు తర తరాలుగా సాగు చేస్తున్న భూమిలో కందకాలు తవ్వి వారి జీవన భృతికి ఆటంకం కలిగిస్తున్న ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని నిలదీస్తున్నామని అన్నారు.
నాగెపల్లి గ్రామంలో కనీసం 50 మందికి అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి దని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు ఈ అటవీ హక్కు పత్రాలలో జిల్లా కలెక్టర్, కాగజ్ నగర్ డీఎఫ్ఓ, ఐటీడివో పీవో సంతకాలు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్న, రైతు బంధు వస్తున్న భూములలో కూడా కందకాలు తవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
గత 80, 90 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఈ గిరిజనుల రైతులు ఎటు పోవాలని ఆయన అన్నారు. ఈ తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గిరిజనుల మీద దాడులు ఎక్కువ అయ్యాయని, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని, అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క పొడు రైతు కూడా భూమిని కోల్పొరని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్, అటవీ శాఖ మంత్రి, ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా దౌర్జన్యంగా భూములలో కందకాలు తవ్వడం గిరిజనుల మీద కక్ష సాధింపు చర్యే అని ఆయన అన్నారు.
సిర్పూర్ నియోజక వర్గంలో 30 నుంచి 40 వేల ఎకరాల పోడు భూమి ఉందని, గిరిజనుల మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గిరిజనులకు పెళ్లిళ్లు చేయించడం కాదు వారు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలని పాల్వాయి డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో, మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమాలు, రిలే నిరాహారదీక్షలు చేస్తామని, అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతుల భూములలో కందకాలు తవ్వకుండా ఆపే విధంగా చూడాలని ఆయన అన్నారు.
ఈ మేరకు డీఎఫ్ఓ తో ఫోన్ లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవర్థన్, తాజుద్దీన్, లింగయ్య, తిరుపతి గౌడ్, వసీఖాన్, మోగవెళ్ళి మాజీ సర్పంచ్ కొడిపె లక్ష్మి, అథ్రం రాజారాం, మెస్రం రాజారాం, అరుణ్, కొడిపే శంకర్, బాపు, శంకరయ్య, ఉమామహేశ్, సంజీవ్, సంతోష్, శ్యామ్ సుందర్, సారయ్య, బషీర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.