28.7 C
Hyderabad
May 6, 2024 01: 23 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఖాళీ..?

#kamareddymunicipality

హస్తం గూటికి క్యూ కట్టిన కౌన్సిలర్లు

కామారెడ్డి మున్సిపాలోటీలో పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం సాగించిన బీఆర్ఎస్ బీటలు వారుతున్నాయా..? ఆ పార్టీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా చేజారుతూ హ్యాండివ్వనున్నారా..? ముఖ్య నాయకులకు త్వరలో భారీ ఝలక్ తప్పదా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత ఓటమి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడం ఆ పార్టీ నేతలను నైరాశ్యంలోకి నెట్టాయి. గతంలోనే పార్టీ మారాలని ఫిక్స్ అయినా అధినేత పోటీతో కౌన్సిలర్లు కాస్త వెనక్కి తగ్గారు. పార్టీ అధినేతే ఇక్కడ ఓటమి పాలు కావడం, రాష్ట్రంలో అధికారంలో పార్టీ లేకపోవడంతో గతంలో అనుకున్న నిర్ణయాన్ని కౌన్సిలర్లు ఇప్పుడు అమలులోకి తెస్తున్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీ మారాలనుకున్న కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతూ బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

చేరికలతో బీఆర్ఎస్ కు బలం

గత 2020 సవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 23 మంది కౌన్సిలర్లు గెలుపొందగా బీజేపీ నుంచి 8 మంది గెలుపొందారు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు కౌన్సిలర్లుగా గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఇందులో 8 మంది కౌన్సిలర్లు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు, బీజేపీ నుంచి ఇద్దరు అధికార పార్టీలో చేరారు. దాంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి 36 మంది బలం చేకూరింది. దాంతో మున్సిపల్ చైర్మన్ గా అధికార పార్టీకి చెందిన నిట్జ్ జాహ్నవి ఎన్నికయ్యారు.

నాలుగేళ్లలో ఒడిదుడుకులు

అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు, ఆ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లకు మూడేళ్లలోనే తత్వం బోధపడింది. వెళ్ళమీద లెక్కపెట్టే వ్యక్తుల కనుసన్నల్లో మున్సిపాలిటీ ఉందని తెలియడంతో గ్రూపులుగా మారిపోయారు. దాంతో కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు మధ్య అంతర్గత విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకానొక సందర్భంలో తమకు నిధులు కేటాయించకుండా కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సమావేశ హాలులోనే అధికార పార్టీ కౌన్సిలర్లు కింద కూర్చుని తమ గోడును వెళ్లగక్కడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో మున్సిపల్ అంశం ఒక్కసారిగా గ్రూపు రాజకీయాలకు అడ్డాగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాకుండా పార్టీ అధినేతే నేరుగా పోటీలో ఉండటంతో తమ బాధను కేసీఆర్ కు నేరుగా చేరేలా అసంతృప్త కౌన్సిలర్లు రహస్యంగా భేటి కావడం చర్చనీయాంశంగా మారింది. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేరుగా రంగంలోకి దిగి కౌన్సిలర్లతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారన్న ప్రచారం సాగింది. ఎన్నికల్లో పార్టీ అధినేత ఓటమి పాలు కావడంతో సీన్ రివర్స్ అయింది.

హస్తం గూటికి కౌన్సిలర్లు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారాలని భావించిన కౌన్సిలర్లకు పార్టీ ఓటమి కలిసొచ్చింది. ఎన్నికలకు ముందే జరిగిన ఓ గొడవ కారణంగా మున్సిపల్ వైస్ చైర్మన్ భర్తను పార్టీ సస్పెండ్ చేయడంతో మరుసటి రోజే వైస్ చైర్మన్ దంపతులతో పాటు ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ బీటలు వారడం మొదలైందన్న చర్చ సాగింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గులాబీ కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో రోజురోజుకు బలం పుంజుకుంటోంది

తాజాగా ముగ్గురు కౌన్సిలర్లు చేరిక

శనివారం బీఆర్ఎస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. 2020 తర్వాత జరిగిన పరిణామాలతో నలుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ బలం శనివారం చేరిన కౌన్సిలర్లతో కలిపి 22 కు చేరింది. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది

త్వరలో చైర్మన్ పై అవిశ్వాసం..?

కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్ల బలంతో వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని సమావేశం నిర్వహించినట్టుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆ పరిస్తితి కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్న ప్రచారంతో చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టడం పక్కా అనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణాలు చేయడంతో మున్సిపాలిటీలు హస్తగతం అవుతున్నాయి. త్వరలో కామారెడ్డి మున్సిపాలిటీ కూడా హస్తగతం కావడం ఎవరు ఆపలేరన్న ప్రచారం సాగుతోంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

అధికార పార్టీ పేరు చెప్పి మహిళ స్థలం ఆక్రమిస్తున్న ప్రబుద్ధుడు

Satyam NEWS

పదో తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్య

Satyam NEWS

ఎస్ బి ఐ కొత్త చీఫ్ జనరల్ మేనేజర్ గా అమిత్ జింగ్రాన్

Satyam NEWS

Leave a Comment