37.2 C
Hyderabad
May 6, 2024 22: 01 PM
Slider ప్రత్యేకం

ఎన్నికల కమీషనర్ నియామకంపై వెల్లువెత్తుతున్న నిరసనలు

#supremecourt

తాజాగా జరిగిన ఎలక్షన్ కమీషనర్ నియామకం తీరు తెన్నులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు, మేధావులు, పరిశీలకులే కాక సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ప్రజలను పాలించి దేశాన్ని నడిపించాల్సిన నాయకుల ఎంపిక ప్రక్రియ ఎన్నికల ద్వారానే జరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. కేంద్ర ఎన్నికల సంఘం దానికి ప్రధానమైన కేంద్రం.

దానిని నడిపించే అధికారులు ఇంకా కీలకం. పేరిశాస్త్రి మొదలు నేటి వరకూ ఎందరో గొప్ప బాధ్యతలను నిర్వహించారు. సరే! వారిలో టీ ఎన్ శేషన్ సంచలనం సృష్టించారు. ఎన్నికలు, ఎన్నికల కమీషన్ అనగానే నేటికీ ఆయనే గుర్తుకు వస్తారు. ఆయన దూకుడు, ఏకస్వామ్యాన్ని కళ్లెం వేయడానికి పీవీ నరసింహారావు మరో ఇద్దరిని అదనంగా నియమించి సరికొత్త వ్యూహాన్ని అమలుపరిచారు. అదొక కథ!

అందరిని ఆలోచనలో పడేసిన సుప్రీంకోర్టు

దానిని అలా ఉంచుదాం. అరుణ్ గోయల్ ను ఎన్నికల కమీషనర్ గా చేపట్టిన ఎంపిక విధానంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సామాన్యులను కూడ ఆలోచనలో పడేస్తున్నాయి. అవసరమైతే ప్రధానమంత్రిపై కూడా చర్యలు తీసుకొనే స్థాయిలో ఎన్నికల కమిషన్ ఉండాలని ప్రధాన ధర్మాసనం వ్యాఖ్యానించింది. గోయల్ నియామక పత్రాలు తీసుకురండి… అంటూ హుకుం జారీ చేసింది.

నియామకాల వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఈ నియామకం ఎలా చేపట్టారని ప్రశ్నించింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకాలకు సంబంధించి చట్టం తీసుకురాకపోవడాన్ని తప్పు పట్టింది.72 ఏళ్ళుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరు ఒక్కటిగానే ఉందని అసహనం వ్యక్తం చేసింది.రాజ్యాంగ వ్యవస్థలు పాటించిన మౌనాన్ని ప్రభుత్వాలు తనకు అనుకూలంగా మలుచుకున్నాయని ఆగ్రహించింది.

ఆరోపణలకు ఊతమిచ్చిన ‘వేగం’

ఉన్నపళంగా ఆగమేఘాల మీద 24గంటల వ్యవధిలోపే చకచకా గోయల్ నియామకం ఎలా జరిగిందని సుప్రీం కోర్టు ఆశ్చర్యం, ఆగ్రహం,అసహనం ప్రదర్శించింది. మొత్తంగా ఈ వ్యవహారం సంచలన కథనాలకు వస్తువుగా మారింది. ఆ యా స్థాయిల్లో విభిన్న వేదికలపైన పెద్ద చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో గానీ,కేంద్రంలో గానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా నడుచుకుంటారనే విశ్వాసం ఉన్నవారినే ఎన్నికల అధికారులుగా నియమిస్తున్నారని వినపడుతున్న మాటలు రాజ్యాంగ రాజసానికి,ప్రజాస్వామ్య సౌందర్యానికి మచ్చను తెస్తున్నాయి.

ఈ తీరుకు అద్దం పట్టే అనేక ఉదాహరణలను మేధావులు ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రధానమంత్రి ర్యాలీని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ ను ఆలస్యంగా విడుదల చేయడం, తద్వారా ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించడానికి అధికార పార్టీకి వీలుకల్పించడం ఇటీవలే చూశామని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై చేసిన జాప్యంతో పాటు మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను తలపుల్లోకి తెస్తున్నారు.

ప్రశ్నార్ధకంగా మారుతున్న స్వయం ప్రతిపత్తి

కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను 8 దఫాలుగా నిర్వహించడం వెనకాల వున్న మతలబు ఏంటనే ప్రశ్నలు ఆనాడే ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తున్నాయి. అరుణ్ గోయల్ సామర్ధ్యం విషయంలో సుప్రీం కోర్టు తప్పు పట్టడం లేదు. నియామకం జరిగిన తీరుపైనే ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమీషన్ సర్వ అధికారాలు కలిగిన స్వయంశక్తి కేంద్రంగా ఉండాలన్నది సుప్రీం కోర్టుతో పాటు చాలామంది అభిప్రాయం.

ఎన్నికల్లో రావాల్సిన సంస్కరణల్లో దీనిని ప్రధానంగా భావిస్తున్నారు. విధి విధానాలు,నిర్వహణ, నియామకాలపై విమర్శలకు తావే ఇవ్వ కూడదు. ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉండాలి. ప్రత్యేకమైన వ్యవస్థగా నిర్మాణం జరగాలి. కోలీజియం విధానం రావాలని కొందరు సూచిస్తున్నారు. దీనిపై ప్రజాస్వామ్యయుతంగా పెద్ద చర్చ జరగాలి. న్యాయమూర్తుల ఎంపిక కూడా ప్రభుత్వాలకు అప్పజెప్పాలని ఇటీవలే కేంద్ర న్యాయశాఖా మంత్రి వ్యాఖ్యానించారు.

ఇటువంటి తరుణంలో ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయా,స్వాగతం పలుకుతాయా అన్నది ప్రధానమైన ప్రశ్న. కేవలం కమీషనర్లను చీఫ్ కమీషనర్లుగా పదోన్నతి కలిపించే వెసులుబాటు వ్యవస్థగా ఈ విధానాలు ఉండకూడదని కొందరి వాదన. కేవలం తమకు అనుకూలంగా ఉండే నచ్చిన వ్యక్తులను నియమించే సంస్కృతి పోవాలన్నది అందరి ఆకాంక్ష.

ప్రధాన ఎన్నికల కమిషనర్  నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా అభిప్రాయపడుతోంది. ఇది నూటికి నూరు పాళ్ళు స్వాగతీయమే. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలోనూ పారదర్శకత పెరగాలని మేధావులు అంటూనే ఉన్నారు. న్యాయమూర్తులు ధర్మమూర్తులై వుంటే చట్టం శక్తివంతంగా ఉంటుంది. దానికి ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. నాలుగు స్థంభాలు సక్రమంగా ఉంటేనే దేశం బాగుంటుంది.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు

Bhavani

శాల్యూట్: సర్వసత్తాక గణతంత్రం మన భారతం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం

Satyam NEWS

Leave a Comment