ఎం.పి. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి సింగరేణి ఉన్నతాధికారులు కూడా స్పందిస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణా రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కోలేటి దామోదర్ విసిరిన ఛాలెంజ్ ని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ స్వీకరిస్తూ కొత్తగూడెం ఏరియాలోని బంగ్లోస్ ప్రాంగణంలో గురువారం 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణహితం కోరి యువ ఎం.పి. శ్రీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో తానూ పాల్గొనడం సంతోషంగా ఉందని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లోని ప్రముఖులు తమ వంతుగా మొక్కలు నాటుతూ పర్యావరణ స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేయడం సంతోషకరమన్నారు.సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ హరితహారంలో భాగంగా గత నాలుగేళ్లుగా ఏడాదికి కోటి మొక్కలు చొప్పున 4 కోట్ల మొక్కలు నాటిందని ఈ ఏడాది ఇప్పటికే 65 లక్షలకు పైగా మొక్కలు నాటిందని పేర్కొన్నారు. మంథని మున్సిపాలిటీలో లక్ష మొక్కలు నాటడంతో పాటు పలు మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని దత్తతకు తీసుకొని హరితహారం నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపల్లి నుండి గోదావరి ఖని వరకూ 28 కిలోమీటర్ల రాజీవ్ రహదారి పొడవునా ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం స్వయంగా 6 వేల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాంతో పాటు జి.ఎం. (ఎం.పి.) కె.వి.రమణమూర్తి, జి.ఎం. (సి.పి.పి) శ్రీ కె.రవికుమార్, కంపెనీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, ఎస్వోటు డైరెక్టర్ ఓ.పి. దేవి కుమార్, ఏ.జి.ఎం. ఫారెస్ట్రీ వి.వివేక్ బాబు, అటవీ అధికారి హరినారయణ తదితరులు పాల్గొన్నారు.