26.7 C
Hyderabad
June 22, 2024 04: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంశాలు

కమలం క్యాడర్ నెత్తిన కొత్త నేతలు

Raja Singh-BJP

తెలంగాణలో గానీ, ఆంధ్రా లో గానీ బిజెపి లో చేరుతున్న వారిని చూస్తే బిజెపి అగ్ర నాయకుల సంగతేమో గానీ చాలా మందికి మాత్రం ఇదంతా తెలుగుదేశం పెద్దలే కావాలని చేస్తున్న పని అని అర్ధమౌతున్నది. ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరి అండ్ కంపెనీ అకస్మాత్తుగా వెళ్లి బిజెపిలో చేరినప్పుడే అందరికి అనుమానం వచ్చింది – సిబి నాయుడే వారిని బిజెపిలోకి పంపించారేమోనని. అప్పటిలో తెలుగు తమ్ముళ్లు ఈ ఆరోపణలను ఖండిచారు. సొంత పార్టీ నుంచి అలా ఎవరైనాపంపుతారాండి అంటూ రాగాలు తీశారు. అయితే ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన వారిపై ఎలాంటి గొడవ చేయకుండా తెలుగుదేశం పార్టీ సైలెంటు అయిపోవడం చూస్తే తెలుగు దేశం పెద్దలే వారిని బిజెపిలోకి పంపి ఉంటారనే అనుమానాలు రూఢి అవుతున్నాయి. నిన్న తెలంగాణలో బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వమే ఆయనను బిజెపిలోకి పింపినట్లు గా భావించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపిలో చేరుతుంటే మామూలుగా అయితే ఆంధ్ర, తెలంగాణల్లోని ఎల్లో మీడియా తీవ్రమైన విమర్శలు గుప్పించాలి కానీ అలా జరగడం లేదు. పైగా బిజెపిలో చేరుతున్నది టిడిపి ద్వితీయశ్రేణి నాయకులు అయినా కూడా వారిని జాతీయ స్థాయి నాయకులుగా చూపిస్తూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ రెండు పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కావాలనే తన నాయకులను బిజెపి లోకి పంపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మరో ముఖ్య విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నుంచి చేరుతున్న నాయకులతోనే తెలంగాణలో బిజెపి బలపడుతున్నట్లు, అంతకు ముందు బిజెపి తెలంగాణ లో లేనట్లు రాస్తున్నారు. ఇవన్నీ నిశితంగా గమనిచలేని బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎడాపెడా చేర్చేసుకుంటున్నది. పార్టీలో చేరేవారి కోసం బిజెపి కూడా ఇంత తహతహ లాడటం ఎందుకో అర్ధం కాదు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి టిక్కెట్ల కోసం ఎంతో డిమాండ్ కనిపించింది. పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్న వారిని కాదని కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వడంతో చాలా చోట్ల తిరుగుబాట్లు జరిగాయి. పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని కొత్తవారికి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిక్కెట్లు అమ్ముకున్నారని పార్టీ కార్యాలయం వద్ద ధర్నాలు కూడా చేశారు. ఇంత క్యాడర్ ఉన్నా కూడా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎందుకు ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో గెలిచిందో మరో నాలుగు చోట్ల ఎందుకు ఓడిపోయిందో తెలుసుకోకుండా, విశ్లేషించుకోకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను చేర్చుకుంటు బిజెపి అధినాయకత్వం ఎందుకు సంతోషపడుతున్నదో పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్న వారికి అర్ధం కావడం లేదు. టి ఆర్ ఎస్ పాలనపై విమర్శలు చేయడానికి కూడా దోబూచులాడిన నాయకత్వ వైఖరి వల్లే బిజెపి తెలంగాణలో ఇంత కాలం బలపడలేదు తప్ప క్యాడర్ తప్పు లేదు. క్యాడర్ లేని ఏపిలో బిజెపి ఎలాంటి ప్రయోగాలు చేసినా ఎల్లోమీడియా మాయలో పడి తెలుగుదేశం వారిని చేర్చుకున్నా ఫర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో తప్పులు చేస్తే బిజెపి అధికారం కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితే వుంటుంది తప్ప వేరే ఫలితం ఉండదు. అందుకే ఎల్లో మీడియా మాయలో పడి ఈ ఊడగొట్టిన నాగళ్లను చేర్చుకోవద్దని పార్టీ కి అంకిత భావంతో పని చేసే బిజెపి నాయకులు కోరుతున్నారు. ఆ తర్వాత అమిత్ షా ఇష్టం.

Related posts

అట్రాసిటి బాధితులకు వెంటనే సహాయం

Satyam NEWS

మరో 48గంటలు వర్షాలు.. సహాయక బృందాలు సిద్ధం

Bhavani

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani

Leave a Comment