శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. అక్టోబరు 21 నుండి 30వ తేదీ వరకు పది రోజుల్లో 533 మంది దాతలు అరకోటి రూపాయలకుపైగా విరాళాలు అందించారు. రోజురోజుకూ దాతల సంఖ్య పెరుగుతుండడం హర్షణీయం. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, మతమార్పిడులను అరికట్టడం, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం టిటిడి ఈ ట్రస్టును ప్రారంభించింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా అందిస్తారు. రూ.500/- చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుండి ఎంత మొత్తమైనా విరాళంగా అందించవచ్చు. రూ.10 వేల నుండి టిటిడి కల్పించే ప్రయోజనాలు వర్తిస్తాయి. రూ.10 వేలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ చొప్పున 99 వేల వరకు 9 టికెట్లను దాతలు పొందే అవకాశముంది. ఒక లక్ష పైన విరాళాందించే దాతలకు టిటిడి ఇదివరకే పలు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న తరహాలోనే ప్రయోజనాలను వర్తింపచేస్తుంది. శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్ అప్లికేషన్ నవంబరులో అందుబాటులోకి రానుంది. ఆ తరువాత దాతలు బ్రేక్ దర్శన టికెట్‌తో పాటు గదులు పొందే అవకాశం కూడా కల్పిస్తారు.
previous post