భవానీ మాలధారులు నేడు శ్రీ కనక దుర్గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జ్యోతులను సమర్పించారు. సాయంత్రం 6.00 గం.లకు సత్యనారాయణపురం లోని శ్రీ శివరామనామ క్షేత్రం నుండి బయలుదేరిన భవానీ మాలధారులు కనక దుర్గ ఆలయానికి చేరుకుని జ్యోతులు సమర్పించారు.
కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులు జై దుర్గా, జై జై దుర్గా అంటూ జయజయ ధ్వానాలు చేసుకుంటూ అమ్మవారి నామ సంకీర్తనల నడుమ ఊరేగింపుగా బయలుదేరి గాంధీనగర్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, పొలీసు కంట్రోల్ రూము, వినాయక స్వామీ దేవస్థానం, రధం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ కొన్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్థలంలో జ్యోతులు సమర్పించారు.
పూల రధంలో శ్రీ గంగాపార్వతి(దుర్గ) మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, వన్ టౌన్ CI కాశి విశ్వనాధ్, సెంట్రల్ MRO వాసుదేవన్ వేలాది మంది భక్తులు, భవానీలు పాల్గోన్నారు.
శ్రీ అమ్మవారికి సమర్పించేందుకు కలశజ్యోతులు తీసుకొచ్చిన భక్తులు కనకదుర్గానగర్ లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెరిగోలా వద్ద సమర్పించి మహామండపం మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకోన్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం రాత్రి 12 గం.లకి దేవాలయము తలుపులు మూసివేశారు.