36.2 C
Hyderabad
May 8, 2024 18: 45 PM
Slider ప్రత్యేకం

ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన ముడుంబై దామోదరాచార్యులు

#mudumbai

సనాతన శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగటం అది కొద్ది మందికే సాధ్యమౌతుంది. అలాంటి అరుదైన వారి కోవలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి  చెందిన ముడుంబై దామోదరచార్యులు  ఒకరు. తండ్రి,తాతల నుండి సాంప్రదాయంగా వచ్చిన దేవాలయ స్థానాచార్యుడుగా తన జీవనం ప్రారంభించి, నటుడుగా, తబలా విద్వాంసుడిగా, మధుర గాయకుడిగా, ప్రవచన కర్తగా బహు విధాలుగా శ్రోతలను మంత్రముగ్ధులుగా చేస్తున్నారు.  ఉపనయన సంస్కారానికి కన్నా ముందు నుండి,పదవ తరగతి చదువుతూనే దేవాలయ వృత్తిని ఎంచుకున్నారు దామోదరాచార్యులు.

దేవాలయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తండ్రి వెంట ఉండి భజనలు, కీర్తనలు,తబలా వాయించడంలో  మెళకువలు నేర్చుకున్నారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత హైదరాబాదులో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించబడిన జ్ఞాన యజ్ఞంలో పాల్గొని నేటి ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి చేత ప్రశంసలు పొందారు. అప్పటి టీటీడీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కనుమూరి బాపిరాజు చే అభినందనలు అందుకున్నారు. క్రమక్రమంగా పట్టణంలో జరిగే దేవాలయ కార్యక్రమాలలో తనదైన శైలిలో కీర్తనలను ఆలపిస్తూ, అప్పుడప్పుడు,ప్రవచనాలను భక్తులకు వీనుల విందుగా అందించారు.

కొన్నాళ్లు విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగాన్ని చేసి,దానిలో సంతృప్తి చెందక 2010 ఆగస్టు 1వ,తేదీన హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో అర్చకులుగా స్థిరపడ్డారు. అక్కడి నుంచి దేవాలయ కార్యక్రమాలను, దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడుతూ,గ్రామంలోని భక్తులకు, ప్రజలందరికీ భక్తి సందేశాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించారు ముడుంబై దామోదరాచార్యులు. పురాతన దేవాలయాన్ని మరల పునర్నిర్మాణం చేయడానికి ఎంతో కృషి చేశారు.

ఒకవైపు దేవాలయంలో విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా హరికథ కళాకారులకు,భజన కళాకారులకు తబలాతో తన సహకార వాయిద్యాన్ని అందించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో 2022 ఆగస్టులో జరిగిన మహామంత్రి తిమ్మరుసు నాటకంలో దైవజ్ఞశర్మగా నటించి జాతీయస్థాయిలో ప్రశంసా పత్రాన్ని, బహుమతులను అందుకున్నారు. ఈ నెలలో  మిర్యాలగూడలో జరిగిన జాతీయ నాటిక, నాటక పోటీలలో హుజూర్ నగర్ సప్తస్వర శ్రీనివాస నాట్య కళామండలి వారు ప్రదర్శించిన మహామంత్రి తిమ్మరుసు నాటకంలో దైవజ్ఞశర్మగా నటించి ప్రేక్షకుల  మన్ననలను పొందారు. గత ఏడాది జూన్ లో  హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ వారి తెలంగాణ వాగ్గేయ వైభవం భజన పోటీల్లో పాల్గొని బహుమతులను,ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

నేడు శ్రీ వైష్ణవ సంక్షేమ సంఘం, సూర్యాపేట జిల్లా వారిచే ఉగాది పురస్కారాలు 2023 సందర్భంగా ఉత్తమ అర్చక రత్న అవార్డును అందుకోవడం గమనార్హం. పిన్న వయసు నుండి దైవ సేవకే అంకితమై పలు ఆధ్యాత్మిక సంస్థ లచే ప్రశంస, బహుమతులు అందుకుంటూ, సమాజ హితమే తన హితంగా భావించి గొప్ప సంగీత గాన కళాకారులను తయారు చేస్తున్న ముడుంబై దామోదరాచార్యులు మరిన్ని సత్కారాలు, మన్ననలు పొందాలని ఆశిద్దాం.

బాచిమంచి చంద్రశేఖర్ శర్మ, సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కెనడా నుంచి తొలి సారిగా అంతర్జాలంలో తెలుగు భాషా సాహితీ సదస్సు

Satyam NEWS

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ని విమర్శించే స్థాయి భత్యాల కు లేదు

Satyam NEWS

తిరుమలలో వైకుంఠ ద్వారాలు మూసివేత డిసెంబర్ 25న

Satyam NEWS

Leave a Comment