31.7 C
Hyderabad
May 7, 2024 00: 15 AM
Slider మహబూబ్ నగర్

పెద్దపులుల అడ్డాగా నల్లమల గడ్డ

#tigers

ఆశాజనకంగా పులుల పెరుగుదల: కొత్తపుంతలు తొక్కుతున్న ఎటిఆర్

పెద్దపులుల అడ్డాగా నల్లమల అభయారణ్యం పేరుగాంచింది. ఆశించిన స్థాయిలో పులుల సంతతి పెరుగుతుండడంతో మరింత అభివృద్ధి దిశగా ఫారెస్ట్ అధికారులు కసరత్తులు సాగిస్తున్నారు. దేశంలోనే ఆరవ పెద్ద టైగర్ రిజర్వ్ గా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై “అంతర్జాతీయ టైగర్స్ డే సందర్భంగా” సత్యం న్యూస్ పాఠకుల కోసం.

మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే పర్యావరణ సమతుల్యత ముఖ్యం. అంటే అడవులు, జంతుజాలం సమిష్టిగా వృద్ధి చెందాలి. పెరుగుతున్న జనసంద్రం కారణంగా అడవులు ఎదారులుగా మానవాళికి ఆవాసాలుగా మారాయి. మరి అడవులు లేనిది వర్షం లేదు, జీవనానికి అవసరమైన ఆక్సిజన్ లేదు… కరువు, కాటకాలు పెరిగిపోతాయి… అందుకే అడవి ఎదగాలంటే అడవికి పెద్ద అన్న, దేశ జంతువు అయిన పెద్దపులి వృద్ధి చెందాలి. అప్పుడే అడవులు పెరిగి వర్షాలు, జీవజాతులు వృద్ధి చెంది పర్యావరణ సమతుల్యత, మానవాళి మనుగడ చక్రం సజావుగా సాగుతుంది.

అడవి రక్షణలో భాగంగా నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ప్రాజెక్ట్ టైగర్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫారెస్ట్ శాఖ చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాల ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది 26 పెద్దపులులు ఉన్న ఎటిఆర్ లో ప్రస్తుతం 30 నుండి 32 పులుల వరకు పెరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ అభివృద్ధికి ఫారెస్ట్ శాఖ నిర్వహిస్తున్న పలు ప్రత్యేక కార్యక్రమాలపై తెలుసుకుందాం..

ప్రణాళికా బద్దంగా హ్యాబిటెట్ మేనేజ్మెంట్

అడవి అంటే వృక్ష, జీవ సంపదలకు నిలయం. అలాంటి అడవిలో పెద్ద పులి జీవించాలి అంటే దానికి ఆహారమైన శాఖాహార జంతువులు అత్యవసరం. పులికి సరిపడా ఆహారం ఉంటే అది స్వేచ్చగా అడవికి కాపలాగా ఉంటుంది. దానిలో భాగంగానే ఎటిఆర్ లో శాఖాహార జంతువుల అభివృద్ధికి అవసరమైన హాబిటేట్ మేనేజ్మెంట్ పద్దతులు అవలంబిస్తున్నారు.

గ్రాస్ లాండ్ మేనేజ్మెంట్

శాఖాహార జంతువులు పచ్చని గడ్డిని ఇష్టపడతారు. అలాంటి ఆహారం ఉంటే శాఖాహార జంతువుల సంతతి పెరిగి పులికి ఆహారం సమృద్దిగా మారి వాటి పెరుగుదలకు సాధ్యం అవుతుంది. ఎటిఆర్ లో ఉన్న సహజ నీటి వనరులు, సాసర్ ఫిట్స్, తదితర నీరు లభ్యత ప్రదేశాలలో సహజంగా పెరిగే గడ్డితో పాటుగా ఫారెస్ట్ శాఖ సేకరించిన (జంతువులు ఎక్కువగా తినే గడ్డి) ని పెంచేందుకు కృషి చేశారు. ఎటిఅర్ ఇప్పటి వరకు దాదాపు 50 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్

అడవి నాశనానికి వన్యప్రాణుల మనుగడకు ప్రశ్నార్థకం చేసే వాటిలో ప్రధానమైన ముప్పు నిప్పు. ఎటిఆర్ లో ప్రతి ఏడాది వేసవి కాలంలో పెద్దయెత్తున అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. ఈ కారణంగా శాఖాహార జంతువులకు అవసరమయ్యే గడ్డి కాలిపోవడం, కొన్ని జంతువులు మంటలకు ఆహుతి కావడం జరుగుతుంది. దీనిని నివారించేందుకు ఫారెస్ట్ అధికారులు ఫైర్ మేనేజ్మెంట్ పద్దతులు అవలంభిస్తున్నారు. వీటిలో భాగంగా కాల్స్ ద్వారా 24 గంటల పాటు సిబ్బంది స్పందించేలా జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ఏర్పడే మంటలను ఆర్పేందుకు గాను సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, నలుగురు వాచర్ లతో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తారు. ఫైర్ లైన్స్ ఏర్పాటు చేసి అగ్నిప్రమాదాలు జరిగితే ఏర్పడే నష్టాన్ని తగ్గిస్తారు. SNPP-VIIRS, MODIS శాటిలైట్ ల ఆధారంగా అడవిలో ఎక్కడ మంటలు చెలరేగిన వెంటనే ఎస్ఎంఎస్ అలెర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తారు. అడవి సమీప గ్రామాల ప్రజలు, పశుకాపరులకు ప్రత్యేక సదస్సులు, కలాజాతల ద్వారా అగ్నిప్రమాదాలు వాటి నివారణ అంశాలపై అవగాహన నిర్వహిస్తారు.

జల సంరక్షణ

వన్యప్రాణుల దాహార్తిని తీర్చాలంటే నీరు తప్పని సరి. అడవిలో సహజ సిద్ధ సెలఏరులు, చెలిమలు, కుంటలు ఉన్నప్పటికీ వన్యప్రాణుల కదలికల ఆధారంగా వాటి నీటి అవసరాలను తీర్చేందుకు గాను 807 సాసర్ పిట్స్, 120 చెక్ డ్యామ్ లు, 35 సోలార్ బోర్ వెల్స్ విత్ పర్పులేషన్ ట్యాంకులు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

వీడ్ మేనేజ్మెంట్

అడవిలో వన్యప్రాణుల ఆహారానికి అవసరమయ్యే మొక్కలతో పాటు వాటి ఉనికికి ఇబ్బందులు కల్గించే మొక్కలు అనగా కోరెంద, యుపటోరియం, పార్తీనియం వంటి మొక్కలను సమీప గ్రామాల ప్రజల ద్వారా నిరంతరం తొలగిస్తారు. దీంతో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక వన్యప్రాణుల ఉనికిని కాపాడుతున్నారు.

ప్లాంటేషన్ మేనేజ్మెంట్

అడవిలోని వన్యప్రాణులు వాటి ఆహార పద్దతులు తెలుసుకుని వాటికి అవసరమైన మొక్కలను పెంచడానికి అనగా పండ్ల మొక్కలు, తోటలు పెంచేందుకు ఫారెస్ట్ శాఖ కసరత్తులు చేస్తుంది. దీనికి తోడు అడవి సమీప గ్రామాల ప్రజలు అడవిలో చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని సేకరించి అక్కడ సహజ అడవిని పెంచేందుకు గాను చెట్ల పెంపకం చేపడుతున్నారు.

ఎటిఆర్ కు సూపర్ మామ్ గా “ఫర్హా”

ఫర్హ “సూపర్ మామ్”

ఎటిఆర్ లో పులుల సంతతి ఆశించిన మేర పెరుగుతుంది అనేందుకు చక్కని నిదర్శనమే ఫర్హా (F6) టైగర్. ఇప్పటికీ ఫర్హా టైగర్ 2019లో తన నాల్గవ ఏటా రెండు పులి పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఒక పిల్ల 2021లో లింగాల మండల పరిధిలో నాలుగు పులి కూనలకు జన్మనిచ్చింది. 2022 లో ఫర్హ తన రెండవ సంతానంలో మరో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా ఫర్హా తన సంతతిని ప్రస్తుతం 9 పులులుగా వృద్ధి చెంది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు “సూపర్ మామ్” గా పేరుగాంచింది.

ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ఎటిఆర్

నిరంతరం శ్రీశైలం వెళ్ళే భక్తులు, ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే పర్యాటకుల రద్దీ ఎటిఆర్ లో రెగ్యులర్ గా ఉంటుంది. ఈ కారణంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిల్స్ విచ్చల విడిగా పారేస్తున్నారు. ఈ కారణంగా అడవిలోని వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ కారణంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా మార్చెందికు ఫారెస్ట్ శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు చెక్ పోస్ట్ ల వద్ద అవగాహన కల్పిస్తూ, వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ ను సేకరిస్తుంది. మన్ననూర్ వద్ద ప్లాస్టిక్ బేలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. రోడ్లపై పడేసే ప్లాస్టిక్ సేకరించి బ్యాగుల్లో నింపెందుకుగాను గాను 20 మంది స్వచ్చసేవక్ లను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహనంలో బ్యాగులను బెలింగ్ సెంటర్ కు తరలించి ప్యాకింగ్ చేసి హైదరాబాద్ తరలిస్తారు. తద్వారా వచ్చిన సొమ్మును వారి వేతనాలకు వినియోగిస్తున్నారు.

ప్రత్యేక నిఘా వ్యవస్థ

ఎటిఆర్ లో ఫారెస్ట్ శాఖ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా కృష్ణా రివర్ నందు 8 మంది బృందంతో ఒక బోట్ టీమ్ గా మొత్తం మూడు పెట్రోలింగ్ బోట్ లను ఏర్పాటు చేశారు. రహదారి వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటికి తోడు సాంకేతికంగా అనగా ప్రతి రెండు కిలమీటర్ల పరిధిలో కెమెరా ట్రాప్ లోకేషన్  పేరుతో మొత్తం 846 కేమెరెలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. సిగ్నల్ కలిగిన 10 సున్నిత ప్రదేశాలలో లైవ్ కెమెరా ట్రాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పులులు, వన్యప్రాణుల కదలికలు, మానవ సంచారం తదితర వాటిని పర్యవేక్షిస్తున్నారు. అత్యంత దట్టమైన ప్రదేశాలలో డ్రోన్ వినియోగంతో నిఘా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

బయో ల్యాబ్ తో ఆరోగ్య పరిశీలన

మన్ననూర్ వద్ద ఏర్పాటు చేసిన ఫారెస్ట్ బయో ల్యాబ్ ద్వారా నిరంతరం అడవిలో సంచరించే సిబ్బంది సేకరించిన మలం ద్వారా జంతువుల ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితులు, తదితర అంశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. దీంతో వన్యప్రాణుల అభివృద్ధికి ఆరోగ్య పరంగా ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగ పడుతుంది.

టూరిజం డెవలప్మెంట్ తో ఉపాధి

ఏటిఆర్ లో గల పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని డెవలప్ చేయడం, సఫారీ సేవల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఎటిఆర్ లో 125 బేస్ క్యాంప్ వాచార్లు, 20 స్వచ్చ సేవక్ లు, 10 సఫారీ డ్రైవర్లు, 30 యానిమల్ ట్రాకార్స్, 10 సిబిటి సిబ్బంది, 12చెక్ పోస్ట్ వాచర్లూ, 10 ఏకో టూరిజం వాచర్లుగా మొత్తం 217 మంది స్థానిక చెంచులకు 80% మరో ఇతరులు 20% గా ఉపాధి అవకాశాలు కల్పించారు. పెరుగుతున్న అవకాశాలు, పులుల సంతతి కారణంగా భవిష్యత్ లో మరింత ఉపాధి అవకాశాల పెంపు కోసం అధికారులు కృషి చేస్తున్నారు.

ఎటిఆర్ భవిష్యత్ అభివృద్ది కార్యక్రమాలు

ఏటిఆర్ అభివృద్ధిలో భాగంగా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు అటవీశాఖ కసరత్తులు చేస్తోంది. విస్తీర్ణం దృష్ట్యా అధికంగా ఉన్న ఎటిఆర్ లో భవిష్యత్ లో 100 వరకు పులులు స్వేచ్చగా జీవించేందుకు అవకాశాలు ఉన్నాయి. కావున వీటి సంతతి పెంచడంతో పాటు సఫారీ, పర్యాటక ప్రదేశాలను పెంచుతూ స్థానిక యువతకు ఉపాధి శ్రీకారం చుట్టెందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 

అడవిలో మానవ ఉనికిని తగ్గించేందుకు గాను పశువులను గ్రామ శివారులో ప్రత్యేక గ్రాస్ లాండ్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అడవిలోకి వెళ్లకుండా నివారించేందుకు కసరత్తులు చేస్తున్నారు. మన్ననూర్ కేంద్రంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. రీలోకేషన్ ప్రోగ్రాం ద్వారా కోర్ ఏరియాలో ఉన్న చెంచులను ప్లెయిన్ ఏరియాలో తరలించేందుకు ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూ. చొప్పున చెల్లించేందుకు, ఆయా చెంచు పెంటల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

సిగ్నల్స్ లేని అడవి ప్రాంతంలో శాటిలైట్, రేడియో తరంగాల ద్వారా లైవ్ కెమెరా ట్రాప్ నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. అడవి జంతువుల ఆరోగ్య రక్షణ కోసం మన్ననూర్ కేంద్రంగా ఆరోగ్య శిబిరం ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు. పర్యాటకులు అడవిలో ఆగకుండా నివారించేందుకు గాను… ప్రస్తుతం మన్ననూర్, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్యాగ్ సేవల ఆధారంగా ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం నమోదు చేసి ఫైన్ విధించేందుకు పరిశీలిస్తున్నారు. అడవిలో ఓవర్ స్పీడ్ వలన వన్యప్రాణులు మృత్యు వాటా పడుతున్నాయి… దీనిని నివారించేందుకు గాను అడవిలో కొన్ని ప్రదేశాలలో స్పీడ్ ట్రాకింగ్ మేషన్ లను ఏర్పాటు చేసి ఫైన్ లు వేసేందుకు కృషి చేస్తున్నారు.

కర్ణాటక నుండి వలస వచ్చిన మగ అడవి దున్న ప్రస్తుతం అడవిలో సంచరిస్తుంది. అడవి దున్నలు అభివృద్ది జరిగితే పులుల ఆహార కొరత మరింత తీరడమే కాక ప్రస్తుతం జీవిస్తున్న వన్యప్రాణులు లేత గడ్డిని మాత్రమే ఇష్టపడతాయి. కాగా పెరుగుతున్న గడ్డిని కత్తిరించేందుకు ఫారెస్ట్ శాఖ ప్రస్తుతం ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది. దున్నలు పెరిగితే ఈ పెరిగిన గడ్డిని అవి తినడం ద్వారా రిస్క్ తగ్గుతుంది, కాబట్టి ఆడ అడవి దున్నను తోడు తెచ్చేందుకు ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపారు. కొల్లాపూర్ ఆస్థానంలో అడవి దున్నలు సంచరించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నట్లు ఇక్కడ వాటి ఉనికి విస్తరిస్తే పెంపుడు జంతువులు పులి భారిన పడి చనిపోయే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఆశాజనకంగా ఎటిఆర్ – ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, ఐఎఫ్ఎస్

FD, క్షితిజ

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం విస్తీర్ణ పరంగా ఎక్కువగా ఉండడం ఇక్కడి సహజ సిద్ధ వాతావరణం పెద్దపులుల సంతతి పెరిగేందుకు ఆశాజనకంగా ఉంది. ఇప్పటికీ ఎటిఆర్ లో ఎన్నో రకాల జీవజంతువులు, వృక్ష సంపద వృద్ధి చెందాయి. భవిష్యత్ లో పెద్దపులుల సంతతి మరింత పెరిగేందుకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం….

అడవి అభివృద్ధికి స్థానికుల సహకారం అవసరం – డిఎఫ్ఓ రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్

DFO, రోహిత్ గోపిడి

అడవులు భాగుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుంది. అడవి పెరగాలంటే అడవికి రక్షణగా పెద్దపులి ఉండాలే… అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యావరణ సమతుల్యతకు మారు పేరుగా నిలిచింది. స్థానిక ప్రజల సహకారంతో పులుల సంతతి గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్ లో ప్రజలు, స్థానిక సంస్థల సహకారంతో అడవిని, పెద్దపులినీ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం…

స్థానికలకు ఉపాధి మెండు – ఎఫ్డీఓ, విశాల్ బత్తుల, (అమ్రాబాద్ డివిజన్) ఐఎఫ్ఎస్

DFO, రోహిత్ గోపిడి

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం పర్యావరణ పరంగానూ, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. త్వరలో మరింత అభివృద్ధి కార్యక్రమాలకు ఫారెస్ట్ శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ కార్యక్రమాలతో స్థానిక యువతకు, ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు పెంచడమే లక్షంగా ఫారెస్ట్ శాఖ కృషి చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలకు ఫారెస్ట్ శాఖకు స్నేహ సంబంధాలు మెరుగుపడి అడవి, వన్యప్రాణుల అభివృద్ది సాధ్యం అవుతుంది.

మన్ననూర్ రేంజ్ లో మెరుగైన అభివృద్ది – ఈశ్వర్, ఫారెస్ట్ రేంజర్, మన్ననూర్ రేంజ్

FRO, ఈశ్వర్

హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉండడం కారణంగా మన్ననూర్ రేంజ్ మరింత అభివృద్ది చెందుతుంది. భవిష్యత్ లో మన్ననూర్ కేంద్రంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలకు ఫారెస్ట్ శాఖ శ్రీకారం చుడుతుంది. దీంతో మన్ననూర్ మరింత వృద్ధి చెందుతుంది.

జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా – మహేందర్ రెడ్డి, బయాలజిస్ట్, బయో ల్యాబ్ ఇంచార్జ్ ఆఫ్ ఎటిఆర్

బాయాలనిస్ట్ మహేందర్ రెడ్డి

వన్యప్రాణుల మల, మూత్ర విసర్జనలను నిరంతరం సేకరించి వాటి ఆహార శైలి, మరియు ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడం తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాం. నల్లమల అడవుల జీవవైవిధ్య స్థితి గతులు, వన్యప్రాణుల సంచారం తదితర వాటిపై డాక్యుమెంటేషన్ కూడా నిర్వహిస్తున్నాము.

అమ్రాబాద్, సత్యం న్యూస్

Related posts

మౌన స్వామి 120 జయంతి ఉత్సవం..ప్రపంచమంతటా..!

Satyam NEWS

రిక్వెస్ట్: చంద్రబాబు కుట్రలపై రాష్ట్రపతికి లేఖ

Satyam NEWS

నవనీత కృష్ణుడు గా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి

Satyam NEWS

Leave a Comment