31.2 C
Hyderabad
May 3, 2024 01: 08 AM
Slider ప్రత్యేకం

నీలి మేఘాలలో నేటికీ ప్రతిధ్వనిస్తున్న మధురగానం

#Gantasala

నీలి మేఘాలలో

గాలి కెరటాలలో

నీవు పాడే పాట

వినిపించు. నేడీవేళ..

ఒక గొంతు గమనం..

కూనిరాగంతో మొదలై…

సరిగమల తోవ పట్టి..

కచేరీల స్థాయి అందుకుని..

సినిమా తీరాన్ని చేరి..

ఆ సినిమా పాటకు తానే ఆలంబనగా మారి..

వేల కొలది పాటలతో లక్షలాది హృదయాలను కొల్లగొట్టి..

గంధర్వ గాత్రం అనిపించుకుని..

ఆపై అమరత్వాన్ని..

ఇంకా ఆపై దైవత్వాన్ని సాధించుకుంటే అది నిస్సందేహంగా

ఘంటసాల గళం..

భౌతికంగా ఆయన

గతం అయిపోయినా

ఆయన గీతమే మన జీవితం…

ఆ గీతమే ఇంగితం..

అదే భగవద్గీతం..

కృష్ణా జిల్లాలో పుట్టి సాపాసాలు ఔపోసన పట్టేందుకు విజయనగరం చేరిన ఘంటసాల వెంకటేశ్వర రావు అనే బుడతడు అంతటి విద్యలనగరం కీర్తి కిరీటంలో మేలిముత్యంగా భాసిల్లుతాడని ఆ క్షణాన ఎవరూ ఊహించి ఉండరు…అలా ఏ ఆలోచనలు లేకుండా కళాపోషణకు, దాతృత్వానికి పేరెన్నిక గన్న ఈ పుణ్యభూమిలో ఘంటసాల స్వయంగా చెప్పుకున్నట్టు ఏ తల్లి మొదటి కబళం పెట్టిందో గాని అది అమృతభాండమై ఆ గళం మధురగీతాల కలశమై తదనంతర కాలంలో తెలుగు పాటను సుసంపన్నం చేసి కోట్లాది అభిమానులను తరాల పర్యంతం అలరిస్తూనే ఉంది.. గంధర్వగానం అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు..నిజానికి అది మన ఊహకు అందనిది కూడా…అయితే మనం విన్న,చదివిన గంధర్వ గానం అనే ఒక అనుభూతిని అందించింది ఘంటసాల గాత్రమే..గాంభీర్యం, మాధుర్యం,లాలిత్యం,విషాదం.చివరకు హాస్యం..ఏదంటే అది..ఎంతంటే అంత పలికించగల సంగీత సర్వం ఆయన స్వరం.. తాగుబోతు గొంతులోని మత్తు.. ప్రేమికుడి స్వరంలోని హుషారు,కవి భావప్రకటనలోని స్వచ్ఛత,భక్తుడి గళంలోని ఆర్ద్రత..విప్లవకారుడి పాటలోని ఆవేశం.. భగ్నప్రేమికుడి నిరాశ..అన్నీ కలగలిసి ఆ గొంతు ఘంటసాల వంతు అయింది..ఏ భావ ప్రకటన అయినా ఎక్కడ ఎంత మోతాదులో అవసరమో అంతే స్థాయిలో పలికించడం మాస్టారికి వెన్నతో పెట్టిన విద్య.. ఇక పద్యాలు పాడడం లో ఘంటసాల ఆయనకు ఆయనే సాటి..

రాముడైనా..కృష్ణుడైనా.. భీముడైనా..భీష్ముడైనా..

అవతారం ఏదైనా కంఠస్వరం ఘంటసాల వెంకటేశ్వర రావుదే. రాయబార ఘట్టంలో  శ్రీకృష్ణుడు జెండాపై కపిరాజు అన్నా.. జూద సన్నివేశంలో ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి ఆంటూ వృకోదరుడు చెలరేగిపోయినా.. ఏ మహనీయసాధ్వి జగదేక పవిత్రత…అని మొదలు పెట్టి ఎట నేర్చితివీ కఠినత్వమగ్రజా..అగ్రజా అనుచు లక్ష్మణుడు అన్న రాముని ముందు వాపోయినా…ప్రాణసమానులై వరలు భార్యలు నల్వురే నాకు.. వేరె ఏ మానిని నిల్చెనో ఇచట.. మాత కదా పరకాంత..మాత కదా పరకాంత…మాయవే అయిన  ఇదే జగజ్జనని ఆన బయల్పడి రాగదమ్మా..అంటూ దేవసభలో జగదేకవీరుడు దిక్పాలకులను మెప్పించినా అది ఘంటసాల స్వరమహిమే..

ఇక ఘంటసాల మాస్టారి పదివేల పాటల్లో అన్నీ ఆణిముత్యాలే అయినా ఎన్నవలసి వస్తే.. శివశంకరీ శివానందలహరి(జగదేకవీరునికథ), రసికరాజ తగువారము గామా(జయభేరి),,జయకృష్ణ ముకుందా మురారి..జయ గోవింద బృందా విహారీ(పాండురంగ మహత్యం)

జగమే మాయ..బ్రతుకే మాయ..వేదాలలో సారమిం తేనయా..నీవింతేనయా (దేవదాసు),ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము.. ఎంతవరకీ బంధము(జీవనతరంగాలు),

కనుపాప కరువైన కనులెందుకు..

తనవారె పరులైన బ్రతుకెందుకు(చిరంజీవులు),

శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు(మంచిమనసులు),

ఎవరి కోసం..ఎవరి కోసం..ఈ ప్రేమమందిరం..ఈ శూన్య నందనం..(ప్రేమనగర్),ఉన్నావా.. అసలున్నావా..(భక్తతుకారాం)..పదివేల పాటల్లో ఓ పది ఆణిముత్యాలను ఎంపిక చేయడం దుర్లభమే అయినా మహాసాగరమథనం నుంచి కొన్ని స్వాతిముత్యాలను ఎన్నిక చేసే సంక్లిష్ట సాహస ప్రక్రియ ఇది..

ఇవన్నీ ఒక ఎత్తయితే కొన్ని ప్రత్యేక  భక్తి గీతాలు,శ్లోకాలు ఘంటసాల స్వరాన్ని తెలుగు గడ్డపైనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో..కచేరీల్లో..పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో..ఆపై ఇళ్ళల్లో నిత్యం వినిపించేలా ఆవిష్కరించాయి..నమో వేంకటేశా..నమో తిరుమలేశా.,

ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా..

ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా.,

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు..చక్కన్ని పాపను ఇక్కడుంచారు…,

అలాగే.. కాళిదాసులో మాణిక్య వీణాo ముపలాలయంతి..

మదాలసాం..మంజుల వాద్విలాసం..

పాండవవనవాసంలో

శ్రీరామచంద్రం..స్రిత పారిజాతం..సలక్ష్మణం.. భూమిసుతాసమేతం..ఇలా ఎన్నెన్నో శ్లోకాలు ఆలయాల్లో..మన హృదయాలయాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తునే ఉంటాయి..

1994 లో..విజయవాడ మహానగరంలో ఘంటసాల 48 గంటల నిరంతర గానస్రవంతి కార్యక్రమం జరిగినప్పుడు ప్రారంభ గీతంగా జానకమ్మ మాస్టారికి నివాళి అర్పిస్తూ ..

నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నేడీ వేళ.. హృద్యంగా ఆలపించారు.. సందర్భోచిత గీతం..

ఆ అమరగాయకుడు తన అపూర్వ గాత్రంతో కోట్లాది హృదయ తంత్రులను మీటి..

ఎన్నెన్నో గుండెలను

ప్రేమతో తడిమి..

ఇంకెన్నో మనసులను ఆర్ధ్రరతో తడిపి..

గుండె గుడులను

భక్తితో నింపి..

నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భువి నుండి దివికి

మానవుడే మహనీయుడు అంటూ పాటల నిచ్చెనల మీదుగా..రాగాల మేఘాల గుండా గగనాంతరంగ రోదసిలో గంధర్వలోక గతుల దాటి..చంద్రలోకమైన, దేవేంద్రలోకమైనా అబ్బురపడేలా దేవతలకే దేవగాన మాధుర్యాన్ని

చవిచూపేందుకు తరలి వెళ్ళి నారద, తుంబురాదుల సరసన ఆసీనుడై తన కీర్తిని దిగంతాలకు తోడ్కొని వెళ్లిపోయారు..

ఆయన వెళ్ళినా ఆయన పాట ఎప్పటికీ మనతోనే .మనలోనే.. ఆ మహాగాయకుడే పాడినట్టు కాలాలు మారినా గాడ్పులే వీచినా..చెదరనీ కదలనీ శిల్పాల వలెనే ఆయన పాట నిత్యమై..సత్యమై.. అనునిత్యమై..దివ్యత్వమై..

మన సాంగత్యమై.. భువిని మన కోసమే ఉద్భవించిన ఓ గొప్ప మహత్యమై..నిలిచి ఉండు గాక..

అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తూ..

సురేష్ కుమార్ ఎలిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్, విజయనగరం

Related posts

నేస్తం, కల్వకుంట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

Satyam NEWS

రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ధర్నా

Satyam NEWS

రానున్న ఎన్నికల్లో పోటీకి ఎంసిపిఐయు సిద్ధం

Satyam NEWS

Leave a Comment