హిందూ సనాతన ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా టిటిడి ఇటీవల ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)కు విరాళాలందించి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములం కావడం ఎంతో సంతోషంగా ఉందని దాతలు సంతోషం వ్యక్తం చేశారు. దేశం నలుమూలల నుండి 52 మంది దాతలు శనివారం ఈ ట్రస్టుకు విరాళం అందించడం ద్వారా ఆదివారం దీపావళి పర్వదినం నాడు విఐపి బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దాతలు ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈ ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూరుకు చెందిన వ్యాపారవేత్త శ్రీ గురుదేవ్, ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో మత మార్పిడులను అరికట్టేందుకు టిటిడి ఆలయాల నిర్మాణం చేపట్టడం ఎంతో బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. చెన్నైకి చెందిన సోమసుందరం మాట్లాడుతూ నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు, పేద అర్చకులకు ఆర్థికసాయం వంటి కార్యక్రమాలను కూడా ఆ ట్రస్టు ద్వారా నిర్వహించడం ముదావహమన్నారు. హైదరాబాద్‌కు చెందిన రావు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన టిటిడిని అభినందించారు. మత మార్పిడులను అరికట్టి సనాతన ధర్మాన్ని మరింత ప్రచారం చేయడంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విఐపి బ్రేక్ దర్శనం పొందేందుకు ఈ ట్రస్టు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ట్రస్టుకు అందించే విరాళాలు నేరుగా శ్రీవారి ఖజానాలోకి చేరుతాయన్నారు.
previous post