28.7 C
Hyderabad
April 28, 2024 11: 01 AM
Slider తెలంగాణ

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

RTC-Strike-534x400

నెక్స్ట్ఏంటి? ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన ఈ ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ఏ మాత్రం ఫలితం రాకుండా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ కార్మిక సంఘాల వారూ ‘‘జాగ్రత్తగా’’ చర్చలు జరిపారు. ఫలితం ఎక్కడ వస్తుందోనని ఇరు పక్షాలూ జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. కేవలం హైకోర్టుకు సమాధానం చెప్పేందుకు మాత్రమే ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా హైకోర్టులో తాము చర్చలకు సిద్ధం అని చెప్పినందుకు మాత్రమే కార్మిక సంఘాలు చర్చలకు వచ్చాయి.

అంతే తప్ప ఎవరూ కూడా ఇష్టంగా చర్చలు జరిపినట్లు కనిపించలేదు. రేపు హైకోర్టుకు చర్చల సారాంశాన్ని నివేదిస్తారు. హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. చర్చల నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లేదనే విషయం అర్ధం అయిపోయింది. ప్రభుత్వం చర్చల నుంచి వైదొలగిన తర్వాత చర్చలకు అర్ధం లేదు. ఈ విషయం అందరికి తెలిసినా ఎవరూ మాట్లాడటం లేదు. అసలు ప్రభుత్వం చర్చల నుంచి ఎందుకు పక్కకు పోయింది?

అన్ని శాఖల పైనా, అందరు అధికారులపైనా, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పైనా మొత్తం ప్రభుత్వం పైనా పూర్తి కంట్రోల్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి లేకుండా చీమ కూడా కదిలే అవకాశం లేదు. మరి చర్చల నుంచి ప్రభుత్వం తప్పుకున్న తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించే వారు ఎవరు? కేవలం ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపి సమ్మె పరిష్కరించగలదా? ఎట్టిపరిస్థితుల్లో అది జరిగే పని కాదు.

మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్ధకం చేసిన ఈ తరుణంలో ఇది మరింత జటిలంగా మారిపోయిన సమస్య కాబట్టే చర్చలు కేవలం కోర్టు కోసం మాత్రమే జరిపారనేది వాస్తవం. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరు అని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం సంస్థ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు.

మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ లేఖలో నేతలు పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

కార్మిక సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక‍్టర్లు హాజరయ్యారు. అంతేకాకుండా కోర్టులో తదుపరి వాదించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 23 రోజులుగా కొనసాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Related posts

వట పత్ర సాయిగా దర్శనమిచ్చిన కోదండ రాముడు

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Satyam NEWS

వాళ్లు పోలీసులు కాదు…ఖాకీ దుస్తులు వేసుకున్న దేవుళ్లు…!

Satyam NEWS

Leave a Comment