26.7 C
Hyderabad
May 3, 2024 07: 54 AM
Slider ప్రత్యేకం

బూస్టర్ డోసుకు స్పందన కరవు!

#coronaVirus

కోవిడ్ ఇంకా వీడలేదు. తన పని తాను చేసుకుంటూనే పోతోంది. వ్యాప్తి కొన్ని రోజులు అదుపులో ఉంటూ,కొన్ని రోజులు అదుపు తప్పుతూ సాగుతూ ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లోనూ స్పందన నామమాత్రంగా ఉండేది.

అప్పుడు వాటిపై విశ్వాసం కుదరక చాలామంది ఆసక్తి చూపించలేదన్నది వాస్తవం. ప్రజల్లో మెల్లగా నమ్మకం కుదురుకుంది. పంపిణీ వ్యవస్థలో కొన్ని లోపాలు దొర్లినా ఆ తర్వాత సర్దుకున్నాయి.ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. భారత్ కు సంబంధించి కరోనా చాలా వరకూ అదుపులోకి వచ్చింది.

రెండు డోసుల ప్రక్రియ బాగానే సాగింది. మిగిలిన వయస్సులవారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం మొదలైంది. సామూహిక రోగ నిరోధక శక్తి ( హెర్డ్ ఇమ్మ్యూనిటీ) ఆశించిన స్థాయిలో పెరిగిందని నిపుణులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సమాజంలో ఒకప్పటి వలె సాధారణ పరిస్థితులు రావడం మొదలయ్యాయి. ఇలా సాగుతున్న క్రమంలో,కరోనా వేరియంట్ల ప్రయాణం కూడా సమాంతరంగా నడుస్తూనే ఉంది.

ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకా తగ్గని కరోనా

మహారాష్ట్ర,కేరళ, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లో ఇంకా కరోనా తాకిడి ఆగలేదు. ఆఫ్రికా,చైనా వంటి దేశాల్లోనూ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది.కరోనాకు రక్షణ కవచంగా ఉపయోగపడేది ‘వ్యాక్సిన్లు’ మాత్రమేనని శాస్త్రవేత్తలు,నిపుణుల వర్గాలు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. బూస్టర్ డోసులు, ప్రీకాషస్ డోసులు కూడా త్వరితగతిని తీసుకోండని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

గణాంకాలను గమనిస్తే, ప్రజలు ఆ దిశగా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ వంటి మహా నగరంలో ఇప్పటి వరకూ బూస్టర్ డోసు తీసుకున్నది కేవలం 7 శాతం మంది మాత్రమేనని అర్ధమవుతోంది. ఈ తీరు కలవరపెడుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు కొనసాగిస్తూనే ఉంటారు. అనేక కార్యక్రమాలకు వేదికగా ఉన్న హైదరాబాద్ లోనే ఇలా ఉంటే? మిగిలిన ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.

దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి. సాధారణ లక్షణాలు కాకుండా తీవ్ర లక్షణాలతో హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రెండు డోసులు వేయించుకున్నవారు బూస్టర్ డోసు వేయించుకుంటేనే వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోగలమని వైద్యులు పదేపదే చెబుతున్న మాటలను  ప్రజలు ఖాతరు చేయకపోవడం ప్రమాదకరమైన ధోరణి. బూస్టర్ డోసు ఉచితంగా వేస్తామని ప్రభుత్వాలు ప్రకటించినా స్పందన శూన్యంగా ఉంది.

రెండో డోసులకే పెరుగుతున్న యాంటీబాడీలు

రెండు డోసులు వేయించుకున్నవారిలో యాంటీబాడీల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, బూస్టర్ డోసు తీసుకోవడం అనివార్యమని ప్రజలు గుర్తించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇంటింటికి వెళ్లి బూస్టర్ డోసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అధికారులను తాజాగా ఆదేశించారు.

మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ తరహా విధానం అమలులోకి రావాలి. వ్యాక్సిన్ రెండు – మూడు డోసుల మధ్య విరామాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించి కూడా రెండు వారాలు దాటి పోయింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ఇమ్మ్యనైజేషన్ (రోగనిరోధక శక్తి)పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ( ఎన్ టాగీ) ఉపకమిటీ చేసిన సిఫార్సుల మేరకు బూస్టర్ డోసు కాల వ్యవధిని తగ్గించారు.

మూడు డోసుల ప్రక్రియ సమగ్రంగా సంపూర్ణమైతేనే ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా మొదటి డోసు,రెండో డోసు తీసుకోనివారు కూడా చాలామంది ఉన్నారన్నది గమనార్హం. అవసరార్ధం విదేశాలకు వెళ్ళాల్సినవారు ముందు జాగ్రత్త చర్యగా మూడో డోసు తీసుకోవడం ముఖ్యమని భావించాలి.

కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులలో మూడో డోసు/ బూస్టర్ డోసు తీసుకొని ఉండాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. సీజనల్ వ్యాధులు,మంకీ పాక్స్ వంటివి ముసురుకొస్తున్న వేళ కరోనా వైరస్ ను,నిబంధనలను తేలికగా తీసుకోవడం ఏ మాత్రం సరియైనది కాదని పౌరులు గుర్తించాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కరోనాపై పోలీస్ కళాబృందం పాటలు ఆవిష్కరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ కోఆర్డినేటర్ గా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

డబుల్ బెడ్ రూమ్ లో అక్రమాలు చేస్తున్న సర్పంచ్

Satyam NEWS

Leave a Comment