40.2 C
Hyderabad
May 1, 2024 16: 48 PM
Slider ముఖ్యంశాలు

ఎనాలసిస్: కరోనాతో సహజీవనానికి సిద్ధమౌతున్న దేశం

#Corona Latest Up Date

కరోనా లాక్ డౌన్ పర్వంలో నాల్గవ అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రం అమలుచేసే  విధానంలో ఎక్కువ అంశాలు ఈసారి రాష్ట్రాలకే వదిలివేసింది. కొన్ని రంగాల్లో ఇంకా నిషేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వేచ్ఛ ఉన్నప్పటికీ, రాష్ట్రప్రభుత్వాలు  కొన్ని అంశాల సడలింపుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

కొత్త సడలింపులను కూడా కలుపుకొని పరిశీలిస్తే, ప్రజల కదలికలు  50శాతంకు పైగా  ప్రారంభమైనట్లే భావించాలి. దానికి సమానంగా  వ్యవస్థల కార్యకలాపాల్లో కదలికలు రాలేదనే చెప్పాలి. ప్రజారవాణా ఇంకా ఊపందుకోవాలి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల మధ్య కూడా రాకపోకలు సాగితేకానీ, ప్రజల కష్టాలు తీరవు.

రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు

కేవలం వలస కూలీలే కాదు, చాలామంది సామాన్య ప్రజలు కూడా రాష్ట్రాల మధ్య రాకపోకలు స్థంభించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల, కార్యకలాపాలు సాగక,  వివిధ రంగాల వ్యక్తులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు  వ్యక్తిగత పనులకోసం వచ్చి ఇరుక్కుపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.

కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని బస్సులు, విమానాలు, రైళ్లు అన్నింటినీ పాక్షికంగానైనా నడపాలి. వ్యక్తిగత కార్లు, క్యాబ్ లకు కూడా అనుమతి ఇవ్వాలి. జాగ్రత్తలు పాటించడం వేరు, అతిగా భయపెట్టడం వేరు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి చూస్తుంటే, కొన్ని విషయాల్లో అతి రాజ్యమేలుతోంది.

వలస కార్మికుల కష్టాలకు, మద్యం దుకాణాలు తెరవడం వల్ల వచ్చిన దుష్ఫలితాలకు కారణమెవ్వరు? అని ప్రశ్నించుకుంటే? మొదటి తప్పిందం కేంద్ర ప్రభుత్వందే అని చెప్పాలి. మొదటి లాక్ డౌన్ విధించడానికి ముందే, వలస కార్మికులు, సాధారణ ప్రయాణీకులు, విద్యార్థులు, యాత్రికులు  వాళ్ళ స్వస్థలాలకు వెళ్లే వెసులుబాటు కల్పించి, దానికి అనుకూలంగా కొంత సమయం ఇచ్చి, పిమ్మట లాక్ డౌన్ విధించాలి.

అది చెయ్యకపోవడం వల్లే నేడు ఈ తిప్పలు వచ్చాయి. ఎక్కడి దొంగలు అక్కడే… గప్ చిప్.. అన్నట్లుగా లాక్ డౌన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నాల్గవ విడత లాక్ డౌన్ వరకూ అదే విధానం అమలుచేసింది. ప్రజల ముందు ప్రతిదీ రహస్యంగా ఉంచుతున్నారు.

ఇంకా ఎంత కాలం లాక్ డౌన్ ఉంటుంది?

అసలు లాక్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది? సడలింపుల  ప్రక్రియ ఎలా ఉంటుంది ? అనే విషయాల్లో  ప్రజలకు స్పష్టమైన  సమాచారం ఇవ్వకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇంకా  ఊహాగానాల మధ్యే ప్రజలు జీవిస్తున్నారు. మెట్రో సదుపాయాలు అందుబాటులో ఉన్న నగరాల్లో మెట్రో వ్యవస్థను  పునః ప్రారంభించాలి.

పట్టణాల్లో, నగరాల్లో టాక్సీలు, ఆటో రిక్షాలు నడపాలి. ఇటీవల ఇచ్చిన సడలింపుల వల్ల కొన్ని కార్యాలయాలు, పరిశ్రమలు, షాపులు కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రజారవాణా లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు కూడా పనిచేయాలి. కరోనాతో కలిసి మనం కొంతకాలం సాగక తప్పదు, అని ఒకపక్క చెబుతున్నారు. కానీ, ఇంకొకపక్క సడలింపుల విషయంలో సమగ్రమైన  వైఖరి అవలంబించటంలేదనే చెప్పాలి. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, రోగ నిరోధకశక్తి పెంచుకోవడం మొదలైన జాగ్రత్తలను ప్రభుత్వాలు  ఇప్పటికే ప్రజలకు తెలియజేశాయి.

స్వయం క్రమశిక్షణ లేకుంటే అంతే సంగతులు

ప్రజలు స్వయంక్రమశిక్షణ పాటించే విధంగా ప్రచారం కూడా జరుగుతోంది. వాక్సిన్ వచ్చేంతవరకూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అనే మానసికమైన నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారు.  ప్రజలు తమ బతుకుదెరువులు సాగించడానికి సంపూర్ణంగా అవకాశమివ్వాలి. చాలామంది ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయారు.

ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ముఖ్యంగా, మధ్య తరగతి పరిస్థితి అధోగతిగా మారిపోయింది. అనేక రంగాలు కుదేలయ్యాయి. రంగాలే కాదు, మానవ సంబంధాలు కూడా మంటగలిసిపోతున్నాయి.  కరోనా పట్ల అప్రమత్తంకంటే, అతి ప్రచారమే దీనికి కారణం.

భౌతికదూరం అనే అంశం  మనుషుల మధ్య  మానసిక దూరం పెరగడానికి  నిచ్చెనలు  వేస్తోంది. ఇది మంచి పరిణామం కాదు. సమాజంలో వయసు మీరిన తల్లి దండ్రులున్నారు, పాపం పుణ్యం తెలియని పసిపిల్లలున్నారు. అనారోగ్యాలతో బాధపడేవారూ ఉన్నారు.

భౌతిక దూరం ఎంత వరకూ ఆచరణ యోగ్యం?

కరోనా వల్ల ప్రచారమవుతున్న భౌతికదూరానికి స్పష్టమైన  నిర్వచనం కావాలి. వివక్ష పెరగకుండా చూడాలి. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ,ఉపాధి, ఉద్యోగ  కార్యకలాపాలు కొనసాగిస్తూనే ప్రజల మధ్య సత్సంబంధాలు పెరగాలి. మళ్ళీ మనుషులు, మనుసులు దగ్గరవ్వాలి.

ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి. అదే సమయంలో, భవిష్యత్తులో చేపట్టే  లాక్ డౌన్ అమలు ,సడలింపులు, కరోనాపై వైద్యపరమైన   విధానాలపై  ప్రజలకు ప్రభుత్వాలు స్పష్టంగా వివరించాలి. అతి నుండి పక్కకు వచ్చి,  ప్రగతివైపు ప్రయాణం చేద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

25 నుంచి శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవం

Satyam NEWS

భార్య ఆత్మహత్య.. భర్త ప్రమాదంలో మృతి

Bhavani

తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్ .టి .ఆర్ : నందమూరి బాలకృష్ణ

Bhavani

Leave a Comment