40.2 C
Hyderabad
May 2, 2024 18: 24 PM
Slider ముఖ్యంశాలు

30 గంటలుగా గుహలోనే: 7 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

#kamareddy

షికారుకు వెళ్లి గుహలో చిక్కుకున్న యువకుడిని బయటకు తేవడానికి అధికారుల సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన చాడ రాజు కుందేళ్లు, ఏదులను పట్టడానికి సింగరాయిపల్లి శివారులోని మంగళవారం అటవీ ప్రాంతానికి వెళ్లి రాళ్ళ గుహలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

జేసిబితో రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్న దృశ్యం

అయితే గతంలో అనేక మంది ఆ గుహలో షికారుకు వెళ్లారని తెలిసింది. గుహలోకి వెళ్ళడానికి రాళ్లపై నుంచి చిన్న రహదారి ఉంది. ఆ దారి గుండా లోపలికి వెళ్ళి వారికి కావాల్సిన వాటిని వేటాడి బయటకు వస్తారని సమాచారం. గతంలో రాజు కూడా ఈ గుహలోకి వెళ్లి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రతిసారి క్షేమంగానే బయటకు వచ్చిన రాజు మంగళవారం మాత్రం బయటకు రాలేకపోయాడు.

ఇప్పటిదాకా పై నుంచి గుహలోకి పడిపోయి ఉంటాడని ప్రచారం సాగినా అదంతా వత్తిదేనని తేలిపోయింది. గుహలోనుంచి బయటకు వస్తుండగా రాళ్ళ మధ్యలో చేయి ఇరుక్కుపోయి రాజు గుహలో చిక్కుకుపోయాడని తెలుస్తోంది. రాజుతో పాటు మరొక వ్యక్తి కూడా షికారుకు వెళ్లాడని ప్రచారం సాగుతున్నా అందులో నిజమెంత అనేది తెలియరాలేదు. ఒకవేళ రాజుతో పాటు మరొక వ్యక్తి ఉండి ఉంటే రాజు చిక్కుకున్న విషయం ఎందుకు బయటకు చెప్పలేదనే ప్రశ్న తలెత్తుతోంది. దాంతో రాజుతో ఇంకా ఎవరు లేరన్నది ప్రస్తుతానికి తెలిసిన విషయం.

రాజు చేతిలో చేయి వేసి ధైర్యం చెప్తున్న దృశ్యం

అయితే రాజు రాళ్ళ గుహలో చిక్కుకుని 30 గంటలు దాటుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజు గుహలోనే ఉండిపోయాడని తెలిసిన క్షణం నుంచి అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాజును బయటకు తేవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గుహలోకి వెళ్లే దారి నుంచి ఒక వ్యక్తి ద్వారా నీటిని పంపిస్తూ రాజుకు ధైర్యం చెప్తున్నారు. పోలీసులు సైతం గుహ పైనుంచి రాజుతో మాట్లాడి ధైర్యం చెప్తున్నారు. రాజును బయటకు తీయడానికి ఇప్పటికే జేసిబి ద్వారా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో కంప్రెషర్ తెప్పించి దాని ద్వారా రాళ్లను కట్ చేసి రాజును బయటకు తేవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చీకటి పడినా ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య, కామారెడ్డి డిఎస్పీ సోమనాథం, అటవీశాఖ, ఫైర్, వైద్య సిబ్బంది అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అడవిలోకి చేరుకుని పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రెడ్డిపేట నుంచి సింగరాయిపల్లి మధ్యలో రోడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్ల లోపు రాళ్ళ గుహ ఉండటంతో పోలీసులు అటువైపుగా ఎవరిని రానివ్వడం లేదు.

సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు

చీకటి కావడంతో రోడ్డు సరిగా లేనందున ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్న భావనతో పోలీసులు ఎవరిని అడవి లోపలికి అనుమతించడం లేదు. సాయంత్రం 4 గంటల నుంచి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. గుహ పైనుంచి పెద్ద రాళ్లను తొలగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో గుహ పైనుంచి రంద్రం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

మధ్యమధ్యలో రాజుకు దాహం తీర్చడం కోసం నీళ్లు, శీతల పానీయాలు పంపిస్తూ రాజుతో మాట్లాడుతూ ధైర్యం చెప్తున్నారు. రాత్రి 11:00, 12:00 వరకు కూడా సహాయక చర్యలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు కూడా పోలీసుల ప్రయత్నాలు ఫలించకపోతే రేపు ఉదయం మళ్ళీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

నేరాలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

Satyam NEWS

దేశంలో లాక్ డౌన్ కొనసాగడమే మంచిది

Satyam NEWS

గెలిపించిన ప్ర‌జ‌ల‌కు కార్పొరేట‌ర్ ధ‌న్య‌వాదాలు

Sub Editor

Leave a Comment