అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు.అంధ్‌కోయ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామంలో ఒకే కుటుంబంలో ఒక నవజాత శిశువుతో సహా ఆరుగురిని హత్య చేశారు. వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ హత్యలకు వారు పాల్పడ్డారని తెలుస్తుంది. వ్యభిచారం చేస్తున్నారన్న ఆరోపణలతోనే తాలిబన్లు ఈ దారుణానికి ఒడిగట్టారని అధికారులు తెలుపుతుండగా బాధిత కుటుంబంలోని సభ్యుడు ఒకరు
గతంలో తాలిబన్ కమాండర్‌గా పనిచేశాడని దానితో అతనితో ఉన్న విభేదాలే హత్యలకు కరుణామయి ఉండొచ్చని అంధ్‌కోయ్ జిల్లా ముఖ్య అధికారి సుల్తాన్ మహమ్మద్ సంజేర్ చెప్పారు. బాధిత కుటుంబం ఇంటిని చుట్టుముట్టిన తాలిబన్లు కుటుంబసభ్యులపై కాల్పులకు తెగబడ్డారని ఈ దాడి నుంచి నవజాత శిశువు తల్లి, ఇద్దరు ఆడ పిల్లలు బయటపడ్డారని ఫర్యాబ్ ప్రావిన్స్ గవర్నర్ అధికారప్రతినిధి జావెబ్ బెదార్ చెప్పారు.
దాడిలో తీవ్రంగా గాయపడినందున చిన్నారుల కాళ్లు తొలగించాల్సి ఉంటుందన్నారు. గ్రామానికి చేరుకున్న సైన్యం బాధిత చిన్నారులను ఆసుపత్రికి తరలించింది. ఆ సమయంలో సైన్యానికి, తాలిబన్లకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు తాలిబన్లు మరణించారు.