ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించే సమయంలో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి కి వినతి పత్రం సమర్పించారు.
మహిళా ఉపాధ్యాయులకు దగ్గరలో ఉన్న మండలాలకు కేటాయించాలని, చిన్నపిల్లలు ఉన్న మహిళలకు, గర్భవతులైన మహిళలకు ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయించాలని వారు కోరారు.
వికలాంగులైన వారికి, మెటర్నిటీ లీవ్ లో ఉన్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కూడా వారు కోరారు. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో ఉద్యోగస్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో సౌకర్యాలు కల్పించడం తో పాటుగా, ఎలక్షన్ మెటీరియల్ అప్పగించే సమయంలో స్పష్టమైన ఆదేశాలు ఉండాలని కోరారు.
ఎలక్షన్ విధులు నిర్వహించిన వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని వారు కోరారు. ఎలక్షన్ నిర్వహించిన మరునాడు ఉద్యోగులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.
మెమోరాండం సమర్పించిన వారిలో ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పల భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, ఏపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్ మోహన్, జిల్లా శాఖ కార్యదర్శులు చావలి శ్రీనివాస్, వి నవీన్ కుమార్, కె పద్మజ, దాసరి రామ్మోహనరావు, , ఏపిటిఎఫ్ కార్యకర్తలు పి ఉమేష్ కుమార్, డి మురళి,బంకి విజయలక్ష్మి ఉన్నారు.