34.2 C
Hyderabad
May 14, 2024 22: 52 PM
Slider ఖమ్మం

మిర్చి రైతు కన్నీళ్లు

#chilli

మిర్చి రైతుల ఆశలు అడియాశలుగా మారాయి. మంచి దిగుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశించిన మిర్చి రైతులకు తెగుళ్ల వ్యాప్తి అపార నష్టం కలిగించింది. పెట్టుబడుల అధికమై, దిగుబడులు గణనీయంగా తగ్గి అప్పుల పాలయ్యే పరిస్థితి దాపురించిందని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. గత ఏడాది మార్కెట్లో మిర్చికి మంచి ధర లభించడంతో ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని  జూలూరుపాడు, గుండెపుడి, సూరారం, వినోబానగర్, పాపకొల్లు, అనంతారం, కాకర్ల, పడమట నరసాపురం, బేతాళపాడు, సాయిరాం తండా పలు గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం మండలంలో రెవిన్యూ పట్టా భూములు 4 వేల ఎకరాలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాగలిగిన 8 వందల ఎకరాల్లో మిర్చి సాగు జరిగింది. అనధికారికంగా సాగు విస్తీర్ణం మరికొంత పెరగనుంది.

మిర్చి నారు నాటిన నాటి నుంచి తెగుళ్ల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. మొదట్లో వేరు, కొమ్మ కుళ్ళు కారణంగా మొక్కలు నిలువునా ఎండిపోయాయి. తప్పని పరిస్థితుల్లో అప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా, పంటను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను కొందరు రైతులు సాగు చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత పంట ఏపుగా ఉన్న దశలో నల్లతామర, ఎర్రనల్లి, కొమ్మ కుళ్ళు తెగుళ్లు ఆశించాయి. వీటి కారణంగా ఆకులు ముడుచుకుపోయి, పసుపు రంగుగా మారి రాలిపోతున్నాయి. ఆకుముడత, కొమ్మతెగులు నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు మార్కెట్లో ఉన్న మందులన్నింటినీ పిచికారీ చేస్తున్నారు. ఖర్చు పెరుగుతుందే కానీ తెగుళ్లు అదుపులోకి రావడంలేదు. చలి తీవ్రతతోపాటు కీటకాల ఉధృతి కూడా పెరిగింది. కొమ్మకుళ్లు పూర్తిగా నిర్మూలించే మందు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎకరా మిరపకు కౌలు, దుక్కి, మిరపనారు, నాటుకూలి, అరకలు, కలుపు కూలి, ఎరువులు, పురుగుమందులు కలిపి ఎకరాకు లక్ష వరకు ఖర్చు చేశారు. ఎంతకీ వీడని తెగుళ్ల కారణంగా పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. మరోవైపు దిగుబడులపై కూడా తెగుళ్ల ప్రభావం గణనీయంగా చూపింది. వాతావరణం అనుకూలంగా ఉంటే సాధారణంగా ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడులు భారీగా తగ్గనున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ఖాళీల భర్తీ మరింత జాప్యం

Murali Krishna

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నిరసన

Satyam NEWS

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ

Satyam NEWS

Leave a Comment