27.7 C
Hyderabad
May 4, 2024 08: 08 AM
Slider ముఖ్యంశాలు

తెలుగు వదిలేస్తే తల్లిని వదిలేసినట్లే

venkaiah 2 25

అమ్మ పాలతో నేర్పిన భాష…. నాన్న వేలితో చూపిన బాట….తరతరాలకు వెలుగులు పంచేది… మన మాతృభాష అన్నారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్కూరు లో జరిగిన తెలుగు పద్య వైభవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మన భావాలను సరైన మార్గంలో తెలియజేయడానికి మాతృభాషకు మించిన వారధి లేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు భాషలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది అని ఆయన అన్నారు. జన్మభూమి, కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వం. ఘనమైన తెలుగుదనాన్ని రాబోయే తరాలకు గొప్ప ఘనచరిత్రగా మనం అందించాలంటే మన భాషను కాపాడుకోవాలి. మన సాహిత్యాన్ని చదవాలి.

అందులోని గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 2వేల సంవత్సరాలుగా నన్నయ్య నుంచి ఎందరో కవులు తెలుగు పద్యాన్ని అందంగా రమ్యమైన ఉపమానాలతో, అలంకారాలతో తీర్చిదిద్ది మనకు అందించారని ఆయన అన్నారు. తెలుగు భాష గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు పద్యం గురించి తెలుసుకుని తీరాలని, తెలుగు సంస్కృతికీ, తెలుగు జీవితానికీ, తెలుగు పద్యానికీ విడతీయలేని బంధం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు తనానికి ప్రతీక తెలుగు పద్యం అని ఆయన అన్నారు. నిత్యజీవితంలో, మన శ్రమలో, మన కష్టంలో, మన బాల్యపు లాలిత్యంలో, మన ప్రేమలో, మన అనుబంధాల్లో ఉన్న లయ తెలుగు పద్యంలో ఉన్నది. ఒకప్పుడు వేమన, సుమతీ శతకాల పద్యాలతోనే మన తెలుగు వారి విద్యాబోధన ప్రారంభమయ్యేది.

‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ..’  అని మన చిన్నారి ముద్దుముద్దుగా పలికినా….. ‘అమ్మా, మన్ను తినంగ నే శిశువునో..’  అని శ్రీకృష్ణుడు తల్లి యశోదతో అన్నా…. ‘ఇందుగలడు అందులేడని.’. అని ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడితో చెప్పినా…. అది పద్యంలో ఇమిడిపోయింది.  ‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు..’  అని గుర్రం జాషువా అన్న మాట ఆటవెలదిగా మారింది అంటూ ఆయన కవితాధోరణితో చెప్పారు.

బమ్మెర పోతన నుంచి గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి వరకూ తెలుగు పద్యంలో మనం మాట్లాడే సరళమైన భాషను విలీనం చేశారని ఆయన అన్నారు. రాయప్రోలు సుబ్బారావు, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, దాశరథి, పుట్టపర్తి తెలుగు పద్యాన్ని జీవింపజేశారని వెంకయ్యనాయుడు తెలిపారు.

ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో 13వ స్థానంలో, దేశంలో జాతీయ భాష హిందీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న తెలుగు భాష అత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందినప్పటికీ ఆ భాష ప్రత్యేకతను మనమే గుర్తించలేని దుస్థితిలో ఉన్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష కళ్లలాంటిది, పరభాష కళ్ల జోడు లాంటిదని, కళ్ల జోళ్లు ఎన్నైనా మార్చవచ్చు కాని కళ్లను మార్చలేం కదా అని వెంకయ్యనాయుడు అన్నారు.

Related posts

నరసరావుపేటలో ఇంటర్నేషనల్ స్థాయి డయాగ్నస్టిక్ సేవలు

Bhavani

Ever ending story: అమరావతిపై ‘సుప్రీం’కు వద్దు… కానీ…..

Satyam NEWS

నేస్తం, కల్వకుంట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment