40.2 C
Hyderabad
April 29, 2024 17: 18 PM
Slider సంపాదకీయం

Ever ending story: అమరావతిపై ‘సుప్రీం’కు వద్దు… కానీ…..

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో విస్పష్టమైన తీర్పు ఇచ్చినందున జగన్ ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఎంతో ఆసక్తికరమైన ఈ అంశంపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రులు పైకి ఒక రకంగా లోన మరొక రకంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యహరించబోతున్నదో అస్పష్టంగానే ఉన్నది.

తీర్పును ప్రభుత్వం సమీక్షించుకున్న రోజున మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. కోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత సుప్రీం కు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం అని కూడా అన్నారు. అయితే తాజాగా తాడేపల్లి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

సుప్రీంకు వెళ్లాలని, వద్దని కొంత మల్లగుల్లాలు పడినప్పటికీ సుప్రీంలో అప్పీల్ చేయడానికి తగిన విధంగా హైకోర్టు తీర్పు లేదని, అప్పీలుకు వెళితే భంగపాటు తప్పదని న్యాయనిపుణులు హెచ్చరించినట్టు సమాచారం. దాంతో, సుప్రీంకు వెళ్లే ఆలోచనను జగన్ సర్కారు వదులుకుందని తెలిసింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం జగన్ ప్రభుత్వం వెతుకుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మూడు రాజధానులు అని కాకుండా ఒక రాజధాని రెండు ఉప రాజధానులు అని పెట్టి బిల్లు రూపొందిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచనగా ఉంది. ఇలా కుదరని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతుగా హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆరు నెలల్లోగా నిర్మాణాలు కూడా చేయాలని, మూడు నెలల్లోగా మౌలిక వసతులు కల్పించి పొలాలు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించాలని కూడా తీర్పులో స్పష్టంగా పేర్కొంది.

సిఆర్‌డిఏ రద్దు చట్టాన్ని జగన్ సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత అసలు సిఆర్‌డిఎ చట్టం అమల్లో ఉన్నట్టే లెక్క. ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని హైకోర్టు తమ తీర్పులో చెప్పింది. మూడునెలల్లోగా రైతులకు ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ విషయంలో తాము ఏం చేయగలమో, ఎంత చేయగలమో, ఎందుకు చేయలేమో ప్రభుత్వం ముందుగా అఫిడవిట్ హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంది.

హైకోర్టు ముందు స్టేటస్ రిపోర్డు ఇవ్వకుండా సుప్రీంకోర్టుకు వెళ్లడం కుదిరేపని కాదు. అందువల్ల దీనిపై గడువు కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల ఒక వైపు హైకోర్టు తీర్పును అమలు చేసినట్లు అవుతుందని, మరో వైపు విశాఖపట్నం తరలివెళ్లినట్లు కూడా ఉంటుందని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. ఉగాది లోపు కొత్త జిల్లాలతో బాటు ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నానికి తరలి వెళ్లేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

Related posts

దూదిమెట్ల బాలరాజు కు కొల్లాపూర్ యాదవ సంఘం అభినందనలు

Satyam NEWS

కర్షకులకు బాసటగా నిలుద్దాం: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

Satyam NEWS

పనిష్మెంట్: కన్నం వేసిన దొంగకు ఆరు నెలల జైలు

Satyam NEWS

Leave a Comment