39.2 C
Hyderabad
May 3, 2024 13: 37 PM
Slider జాతీయం

చందమామ అందిన రోజు

#Chandamama

చందమామ అందిన రోజు, భారతావని చిందులు వేసిన భలే మంచిరోజు! అంతరిక్షంలో భారత ప్రతిభ జెండా పాతిన రోజు. చంద్రుడిని అధ్యయనం చేయడానికి మొదలైన ఈ ప్రయాణం సూర్యుని దాకా వెళ్ళగలమనే విశ్వాసాన్ని పెంచింది. నవగ్రహాలపైనా నవీన మానవుడు విహరించగలడనే ఆత్మవిశ్వాసానికి చంద్రయాన్ -3 ఆయువు పోసింది.

ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచంలోని ఏ దేశం, మేము గొప్ప అని విర్రవీగే దేశాలు సైతం భారత్ కు మోకరిల్లే తరుణం తన్నుకొచ్చిన కాలం ఈ సాయంకాలం. సాయంవేళ కచ్చితంగా 6.03 నిముషాలకు ల్యాండర్ విక్రమ్ విక్రమ స్వరూపంతో చంద్రుని దక్షిణ ధృవంలో కాలుమోపింది. ఈ ధృవాన్ని ఏ దేశపు నౌక చూడలేకపోయింది. చూసింది,
చూసేట్టు చేసింది మనమే. ఈ ఘనత ముమ్మాటికీ మనదే మనదే. చంద్రయాన్ -2 వైఫల్యం నుంచి ఎన్నో గొప్ప గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగాం. అందరి కంటే ముందుగా నిలిచాం.

గురుత్వాకర్షణశక్తిని, ఉపరితల వేగాన్ని తట్టుకొని మన విక్రమ్ నిలబడింది. వచ్చే 14రోజులు చాలా ఆసక్తికరమైనవి. ఎన్నో విషయాలు తెలుసుకోడానికి ప్రతి క్షణమూ ఒక యుగమే.సుమారు 4లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసింది. చంద్రయాన్ -2 కంటే విక్రమ్ కు మరింత స్వేచ్ఛనిచ్చాం. అదనపు సాఫ్ట్ వేర్ సామర్ధ్యాన్ని, సోలార్ ప్యానెళ్లను జతకలిపాం. ఇంధనం, కెమెరాస్ అన్నీ అదనపు శక్తిని చేకూర్చినవే. చంద్రుడిపై యాత్రలు కొత్త కావు. కానీ ఈ యాత్ర వేరు.

దీని తీరు,స్థాయి అన్నీ వేరు. దక్షిణ ధృవం ఎలా వుంటుందో ఏమేమి వుంటాయో తెలిసికోవడం అసాధారణమైన అంశం.ఎన్నో బిలాలు, లోయలు, గడ్డ కట్టుకున్న మంచు గడ్డలు ఏవేవో ఉంటాయి. నీటి అడుగుజాడలను అంచనా వేయవచ్చు, జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు తెలుసుకొనవచ్చు, ఉపరితల నిర్మాణం అర్ధం చేసుకోవచ్చు, భూకంపాల తీవ్రతపై ప్రయోగాలు చెయ్యవచ్చు, అక్కడి పొరలను, మట్టి స్వభావన్నీ అంచనా వేయవచ్చు. భావి ప్రయోగాలకు ఊతం వెతకబట్టవచ్చు. చంద్రుడిపై గణితశాస్త్రాన్ని అర్ధం చేసుకోవచ్చు. రసాయన మూలాలు, ఖనిజసంపద తెలుసుకొనవచ్చు.

నివాసయోగ్యతను పసిగట్టవచ్చు. చంద్రయాన్ -3 విజయం ద్వారా, ఆ ఆపరేషన్ ద్వారా ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు. మరింత తెలుసుకోడానికి భూమికలు నిర్మించుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన జ్ఞానప్రస్థానానికి అద్భుతమైన అడుగులు పడ్డాయి. సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు అందరినీ తెలుసుకుందాం.

సూర్యుని వైపు సాగే ఆదిత్య -ఎల్ -1 కూడా సిద్ధమవుతోంది. అమెరికా, చైనా, రష్యాను దాటుకొని భారత అంతరిక్ష ప్రయాణం సాగుతుందని మన ఇస్రో చాటి చెప్పింది. మన శాస్త్రవేత్తలు నిన్నటి రుషులు. నిన్నటి రుషులే నేటి శాస్త్రవేత్తలు. అందరూ మనుషులే. మనీష వారి ఆయుధం, ప్రయోగాలు వీరి అస్త్రశస్త్రాలు.

ఇక ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకు వస్తే మన అంతరిక్ష శాస్త్రమే ప్రపంచ శాస్త్రవేత్తలను శాసిస్తుంది. ఇదంతా గర్వం కోసం కాదు, యుద్ధం గురించి కాదు, మానవాళి అభ్యున్నతికి,విశ్వప్రగతికి. ఈ సంరంభంలో అందరికీ అభినందన చందనములు అందిద్దాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా పవన్ కల్యాణ్

Bhavani

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

Satyam NEWS

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS

Leave a Comment