38.2 C
Hyderabad
May 5, 2024 19: 51 PM
Slider ప్రత్యేకం

మధ్యతరగతి మందహాసం!

#Minister Nirmala Sitharaman

మధ్యతరగతి కష్టాలు నాకు తెలుసంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తాజాగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ఈ మాటలు తరచూ ఆమె నుంచి వినపడుతూనే ఉంటాయి. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా మధ్యతరగతి పక్షపాతి అంటూ చెప్పుకుంటూ వచ్చారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుడిపై ఎటువంటి పన్నులు వేయలేదని, పన్నులు పెంచలేదని నిర్మలమ్మ అంటున్నారు. రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ సగటు మనిషికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆమె కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆచరణలో జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? ప్రతి బడ్జెట్ ముందూ వేతన జీవులు, మధ్యతరగతి మనుషులు ఆశల పల్లకి ఎక్కుతూ ఉంటారు. చివరకు నిరాశే మిగులుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ తీరు మారదన్నది సత్యం.

ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని ఈసారి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకటించాక కానీ అసలు విషయాలు బయటకు రావు.అప్పటి దాకా ఆగాల్సిందే. 5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు వేయకపోవడాన్నే ఆమె గొప్పగా చెప్పుకుంటున్నారు. 27 నగరాల్లో మెట్రో రైల్ నెట్ వర్క్ ను ఏర్పాటుచేస్తున్నామని,
100 స్మార్ట్ సిటీస్ నిర్మిస్తున్నామని, మధ్య తరగతి వారి కోసం ఎన్నో చేయబోతున్నామని ఆర్ధికమంత్రి హామీలు కురిపిస్తున్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె విశ్వాసాన్ని కలుగజేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ప్రభావం,ఉక్రెయిన్ -రష్యా యుద్ధంతో పాటు ప్రపంచ దేశాల్లో వచ్చిన అనేక మార్పుల ప్రభావం మన ఆర్ధిక రంగంపైనా పడిందన్నది వాస్తవం. ఇప్పటికే ఆర్ధిక మాంద్యపు చేదురుచిని అనేక దేశాలు అనుభవిస్తున్నాయి. రేపోమాపో మనకూ తప్పదని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రపంచం ఎంత కష్టాల్లో ఉందో
ఇటీవలే సాక్షాత్తు మన ప్రధాని నరేంద్రమోదీ మనకు గుర్తు చేశారు.

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మితిమీరిన ఆర్ధిక సమస్యలతో మన పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్తాన్ కన్నీటి కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చిన్న దేశమైన నేపాల్ పరిస్థితి కూడా నిరాశలతోనే అలుముకొని ఉంది. అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. చైనా కూడా వణికిపోతోంది. ప్రపంచమంతా ఇట్లా ఆర్ధికంగా నలిగిపోతూ ఉంటే? మనమెట్లా గొప్పగా ఉండగలుగుతాం? కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు కుదుటపడినా, కొంతకాలమైనా కడగళ్ళను ఎదుర్కోవాల్సి వుంటుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ ఎదుర్కోనంత నిరుద్యోగ సమస్యను దేశం అనుభవిస్తోందని ఆర్ధిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. చాలామందికి ఉపాధి సమస్యగా మారింది. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. వెహికల్స్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. ఇక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన బడాబాబులు కాలరెగరేసుకొని దర్జాగా తిరుగుతున్నారు. అప్పులు చెల్లించలేని సామాన్యుడు బిక్కుబిక్కుమంటూ తలవంచుకొని బతుకుతున్నాడు. పేదరికం సూచి పెరుగుతూనే ఉంది.

40శాతం దేశ సంపద ఒక శాతం ధనవంతుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్ధిక అసమానతలు ఆకాశమంత పెరిగాయి.
సామాజిక శాంతికి,దేశ ప్రగతికి ఇది ఆరోగ్యకరమైన సంకేతం కాదు. బిలియనీర్లపై, మిలియనీర్లపై పన్ను సక్రమంగా వేసి, సక్రమంగా వసూళ్లు చేస్తే బోలెడు డబ్బు సమకూరుతుంది.ఇలా పోగైన ధనంతో అక్షరాస్యతను మెరుగుపరచవచ్చు. పౌష్టికాహార లోపంతో బాధపడే ఎందరినో అదుకొనవచ్చు. ఇలా ఎన్నెన్నో సుకార్యాలు చేయవచ్చు. విద్య,ఉపాధి కోసం మన యువత విదేశాలకు వెళ్ళక తప్పడం లేదు. వీటి సంగతి మరచిపోతున్నారు. సగటు ఉద్యోగి మాత్రం చచ్చినట్లు పన్ను చెల్లించి తీరాల్సిందే.

వచ్చే జీతంలో పన్నుల కోత తప్పక వేతనజీవులు విలవిలలాడిపోతూనే ఉన్నారు. ప్రపంచంలో ఆకలితో ఉన్న జనాభాలో 60 శాతం వాటా మహిళలది, బాలికలదే. ఇక దేశంలో రైతుల కష్టాలకు అవధులు లేవు. వ్యవసాయం దండగమారి.. అనే ఆలోచనలోనే రైతన్నలు ఉన్నారు. ప్రభుత్వాలు మారినా ఇంతవరకూ రైతులకు సంపూర్ణమైన న్యాయం చేసిన ప్రభుత్వం ఒక్కటీ రాలేదు. మధ్యతరగతిలో మందహాసన్ని, పేదల ఇళ్లల్లో ఆశాదీపాన్ని వెలిగించన నాడే నిజమైన ప్రగతి. సగటు మనిషి ధైర్యంగా జీవించిన నాడే ఆర్ధిక సమస్యలకు విముక్తి. అందాకా ఒట్టిమాటలకు విలువ చేకూరదు.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన పోలీస్ బాస్ లు

Satyam NEWS

రైతులు మై ట్రాక్టర్ ఇండియా సేవలను వినియోగించుకోవాలి

Satyam NEWS

ఆక్వా బజార్ మార్కెటింగ్  సొసైటీ..!

Sub Editor

Leave a Comment