38.2 C
Hyderabad
May 5, 2024 22: 51 PM
Slider చిత్తూరు

బిక్కు బిక్కుమని బతుకుతున్న టీడీపీ శ్రేణులు

#TDP

ఉమ్మడి చిత్తూరు జిల్లలోని టిడిపి నేతలు కార్యకర్తలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎవరి మీద కేసు పెడతారో ఎవరిని ఎప్పుడు ఇక్కడ ఎలా అరెస్టు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నెల నాలుగవ తేదీ అంగళ్ళు, పుంగనూరు సంఘటనల ఆధారంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహా 317 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. పోలీసులు మొత్తం 12 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారు.

ఇప్పటి వరకు 81 మందిని అరెస్టు చేసి మదనపల్లి, చిత్తూరు, కడప జైళ్లకు తరలించారు. అంగళ్ళు కేసులో చంద్రబాబు, పుంగనూరు సంఘటనలో చల్లా రామచంద్రా రెడ్డి ఏ 1 లుగా ఉన్నారు. పీలేరు ఇంచార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు అద్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, రాజంపేట పార్లమెంటు ఇంచార్జి గంటా నరహరి, పలమనేరు ఇంచార్జి అమరనాధ రెడ్డి, మదనపల్లి ఇంచార్జి దొమ్మలపాటి రమేష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితర నేతలపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు.

దీంతో చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయినా పోలీసులు వెదికి వేటాడి పట్టుకుంటున్నారు. గురువారం పుంగనూరు నియోజక వర్గానికి చెందిన ఒక కీలక నాయకుడిని హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ లో అరెస్టు చేసి నట్టు తెలిసింది. ఆయనను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఎవరు పుంగనూరు వెళ్ళడానికి సాహసించడం లేదు.

పొరపాటుగా పోతే పోలీసులు పట్టుకొని కేసులో ఇరికిస్తారని భయపడు తున్నారు. దీనితో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే చంద్రబాబు కేసులో ఉన్న, అరెస్టయిన వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెపుతున్నారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవన్నారు.

కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని.. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తెస్తామని తెలిపారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణమైన ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యుల అరెస్టులతో తల్లడిల్లుతున్న వారికి ఒక తండ్రిలా తాను అండగా ఉంటానన్నారు. పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అందరి వివరాలు ఎర్ర పుస్తకంలో రాసుకుంటున్నానని, అధికారం రాగానే రాగానే తగిన చర్యలు తీసు కుంటానని అంటున్నారు.

పెద్దిరెడ్డిని ఎదిరించే ధీరుడు ఎవరు ?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి కార్యకర్తలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమకు దిక్కు ఎవరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఎక్కడో కూర్చుని అధికారంలోకి వస్తే లెక్కలు తేలుస్తామని చెప్పడం వల్ల ప్రయోజనం లేదని అంటున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే అధికారంలోకి ఎలా వస్తామని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులు లేని నాయకులు అయినా పుంగనూరు వచ్చి కార్యకర్తలను కలసి దైర్యం చెప్పాలని కోరుకుంటున్నారు.

టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు జిల్లాలో జిల్లాలో పర్యటిస్తే కార్యకర్తలలో ఆత్మ స్థైర్యం వస్తుందంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కేసులు లేని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజక వర్గాల ఇంచార్జిలు సుగుణమ్మ, సుధీర్ రెడ్డి, హేమలత, గాలి భాను ప్రకాష్ , డాక్టర్ థామస్, డాక్టర్ మురళీ మోహన్ ఏమయ్యరని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అధికార ప్రతినిధులు ఏమయ్యారు ?

చిత్తూరు జిల్లలో టిడిపికి ఆరు అధికార ప్రతినిధులు ఉన్నారు. మాల్యాద్రి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, విజయ కుమార్, మద్దిపట్ల సూర్యప్రకాష్ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా ఇంత వరకు పుంగనూరు వచ్చిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు ఎక్కడో కూర్చుని కంటి తుడుపు స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పుంగనూరు పరిశీలకునిగా పనిచేసిన ఫైర్ బ్రాండ్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌

Satyam NEWS

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ.

Bhavani

బాలాజీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment