32.2 C
Hyderabad
May 9, 2024 13: 56 PM
Slider ప్రత్యేకం

ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారు

Chief Minister Jagan Mohan Reddy

ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వ కాలర్ పట్టుకుని నిలదీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉత్తర కుమారుడిగా సంబోధించిన ఆయన, ఇప్పుడు ఉత్త కుమారుడిగా మిగిలిపోయారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ఏ ఒక్కనాడు ఆందోళన నిర్వహించలేదు. ప్రత్యేక హోదా, పోలవరం , రైల్వే జోన్ సాధన కోసం ఏనాడు ఆందోళన నిర్వహించని వారు, తనని అనర్హుడిగా ప్రకటించాలని మాత్రం పార్లమెంట్లో ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమావాస్య, పౌర్ణానికి ముఖ్యమంత్రికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ గుర్తుకు వస్తాయని తెలిపారు . ఇలా గుర్తుకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలలోనే అవినాష్ రెడ్డి కలలాగా వస్తాడా?. పోలవరం కాంక్షతో నిద్రలో నుంచి జగన్మోహన్ రెడ్డి లేచినప్పుడు ఇది గుర్తుకు వస్తుందా? అన్నది తెలియదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అర్ధరాత్రి చేసిన మంతనాలు రాష్ట్రం గురించి అంటే ఎవరు నమ్మరు… నమ్మలేదు కూడా. అది అవినాష్ రెడ్డి గురించి అనుకుందాం. అదే రోజు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా కాసింత వెసులుబాటు లభించినట్టు వారు భావించారు. 15 రోజుల వ్యవధిలో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు సిబిఐ పేర్కొంది. అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు, అడిషనల్ అరెస్టులు కూడా ఉంటాయి. ఆ అడిషనల్ అరెస్టులు ఏమిటో ఇప్పటికే సిబిఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఇప్పుడు ఆ పేర్ల గురించి చర్చ అప్రస్తుతమని రఘురామకృష్ణం రాజు వివరించారు.


పోలవరం నిధుల గురించి నిర్మలా సీతారామన్ ను కలవడం ఏమిటి?పోలవరం ప్రాజెక్టు నిధులకు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలవడం హాస్యాస్పదంగా ఉందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిర్మలా సీతారామన్అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి, శాలువా కప్పుతాను అంటే చివరి నిమిషంలో అంగీకరించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని, అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం మంజూరైన 55 వేల కోట్ల రూపాయలు అర క్షణం ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగు బకాయిలు చెల్లించడం లేదని, వాటిని ఇప్పించాలని కోరినట్లుగా చెప్పారు. గతంలో ఆకలి రాజ్యం అనే కమలహాసన్ నటించిన చిత్రం వివి గిరి పూర్తి పేరు చెప్పగలవా అని ఒక నిరుద్యోగిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే చెప్పగలను కానీ, నేను చేసే గుమస్తా ఉద్యోగానికి వి.వి గిరి కి సంబంధం ఏమిటి అని ప్రశ్నించినట్లుగానే, అసలు పోలవరానికి, నిర్మలా సీతారామన్ కు సంబంధం ఏమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా మంత్రివర్గం ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మంత్రివర్గంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంతమాత్రాన కేంద్రంలో కూడా అలాగే జరుగుతుంది అనుకుంటే పొరపాటే. 2019 లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 22 వేల కోట్లకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది . 2018లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, పోలవరం నిర్మాణ బాధ్యత తమదేనని ప్రకటించారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు. పోలవరం కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయవద్దు. పోలవరం నిర్మాణానికి ఖర్చు అంత కంటే తక్కువే అవుతుంది. పోలవరం నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం దోచుకు తింటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి చెత్త లేఖను రాసింది జగన్మోహన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, పోలవరం అనే మహా యజ్ఞంలో రాక్షసుల మాదిరిగా మాంసపు ముద్దలను వేసింది మీరు కాదా అంటూ నిలదీశారు. అప్పటి రాక్షసులు ఇప్పుడు దేవుళ్ళుగా మారిపోయారంటే ఎవరు నమ్ముతారు. క్యాబినెట్లో ఒక్కసారి ఆమోదించిన తర్వాత , తిరిగి క్యాబినెట్ లో మారిస్తే తప్ప నిధులను విడుదల చేస్తారని ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. అంటే ప్రజలకు ఇంగిత జ్ఞానం లేదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సాక్షి దినపత్రికలో అబద్ధాలను రాసుకుంటే వెర్రి ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు . నిర్మలా సీతారామన్ కూడా ఎంతలా బ్రతిమాలుడుతున్నాడని ప్రజలు అనుకుంటారని భావిస్తున్నప్పటికీ, అసలు వచ్చిన పని అయిపోయింది. అర్ధరాత్రి మంతనాలు ముగిశాయి. ఆర్థిక శాఖ మంత్రి కూడా కలవకపోతే బాగుండదని భావించినట్టున్నారు.

ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే చేయి ఖాలీ లేదు చూసుకో పొమ్మన్నారు. నిర్మలా సీతారామన్ ను కలిసి పోలవరం కోసం డబ్బులు అడిగాం… తెలంగాణ ముఖ్యమంత్రి తో డబ్బులు ఇప్పించమని కోరామని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయడం దారుణమని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రజల గురించి చిత్తశుద్ధితో ఆలోచించకుండా ఎక్కువ కాలం అబద్దాలతో గడపలేరు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్దాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా 16వ తేదీన హైకోర్టులో తీర్పు వెలువడడం, మళ్లీ ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగానే సుప్రీంకోర్టులో విచారణ అధికారి రాంసింగ్ ను తొలగించాలని ఉత్తర్వులు వెలువడడం వంటి సంఘటనలను పరిశీలిస్తే , ప్రజలు అనుమానించినట్లుగానే జరుగుతుందేమొనని రఘురామకృష్ణం రాజు తెలిపారు . పోలవరం డయాఫ్రం వాల్ నిర్మించడానికి గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, దాన్ని పాక్షికంగా రిపేరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల కోట్ల రూపాయలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు.


దొంగ ఓట్ల మాదిరిగానే దొంగ ట్విట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసినట్లుగానే, దొంగ ట్విట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణుల మధ్య మనస్పర్ధలను సృష్టించే ప్రయత్నాన్ని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు . రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు వికసించడం ఖాయమని తేలడంతో వెన్నులో భయంతో సోషల్ మీడియాలో దొంగ అకౌంట్లను సృష్టించి, ట్విట్ల ను పెడుతున్నారు. జనసేనతో పొత్తు అవసరం లేదని ఒక టిడిపి నాయకుడు పేర్కొన్నట్లుగా ట్విట్ చేశారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేరిట 76 స్థానాలలో గెలుస్తామని దొంగ ట్విట్ చేసి ఉంటారు. దొంగ ట్విట్లు చూసి టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు అపోహ పడవద్దు. నాయకులు బాగానే ఉన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు, నన్ను నమ్మండి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలయింది. ఓ ఎన్నారై చేసిన ట్వీట్ చూసి అతని పోలీసులు అరెస్ట్ చేయగా, న్యాయమూర్తి శిరీష రిమాండ్ కు నిరాకరించింది. అయినా అతనిపై తప్పుడు కేసు బనాయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దళిత శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలను సోషల్ మీడియా వేదికగా అసభ్య పద జాలంతో దూషించిన వారిపైచర్యలు ఎందుకు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా?, లేకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు, ప్రజలపై ఈ ప్రభుత్వ అరాచకాలు, దాష్టికాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్ష ఓటు చీలకుండా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముష్కరులు ఎన్ని మాయలు చేసిన టిడిపి జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు.

Related posts

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

Murali Krishna

నా విజయం మహిళ సాధికారిత నూతన శకానికి నాంది

Bhavani

ఆలోచించగలిగే బోధన అవసరం

Murali Krishna

Leave a Comment