29.7 C
Hyderabad
May 1, 2024 10: 08 AM
Slider ఖమ్మం

ఆలోచించగలిగే బోధన అవసరం

#aisf

నూతన జాతీయ విద్యా విధానంలో మధ్యయుగం చరిత్రను పాఠ్యాంశాలుగా తీసుకు రానున్నారని దీనితో వర్ణ వ్యవస్థకు జవసత్వాలు అందించి లబ్ది పొందాలని పాలకులు భావిస్తున్నారని ప్రో॥ ఖాసీం తెలిపారు . వర్ణ వ్యవస్థ – మనుధర్మాన్ని తిరిగి విద్యార్థుల మెదళ్లలోకి చొప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు . ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో  జాతీయ నూతన విద్యా విధానం – విద్యా వ్యవస్థపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు . సెమినార్ ప్రారంభానికి ముందు ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు బాగం హేమంతరావు ఆవిష్కరించారు . స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన సెమినార్కు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రో॥ ఖాసీం మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచేది , నడిపించ గలిగేది , మార్పు తెచ్చేది విద్యార్థులే కాబట్టి ప్రతి పాలకుడు తమకు అనుకూలమైన విద్యా విధానాన్ని రూపొందించుకోవాలని భావిస్తారన్నారు . బ్రిటిష్ పాలన కాలంలో లార్డ్ మెకాలే దగ్గర నుంచి నేటి మోడీ వరకు అందరిది అదే ఆలోచన అని ఖాసీం తెలిపారు .1947లో దేశానికి స్వాతంత్య్రం రాక ముందే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అతివాదులు , మితవాదులు సైతం 1906లో భారత దేశంలో విద్యావిధానంపై చర్చించారని ఆయన తెలిపారు . 1947లో విద్యా విధానాన్ని సమీక్షించిన ఫలితం లేదని 1964లో రజని కోటారి కమిషన్ ను ఏర్పాటు చేశారని ఖాసీం తెలిపారు .1966లో రజని కోటారి కమిషన్ నివేదికను అందజేయగా 1968లో తొలి జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చిందన్నారు . పాఠ్యాంశాలలో 70 శాతం వ్యవసాయం గురించి ఆ తర్వాత -పారిశ్రామిక , శాస్త్రీయ అవగాహనపై పాఠ్యాంశాలు రూపొందించాలని కోటారి కమిషన్ సూచించిన అది 10 శాతం కూడా అమలు కాలేదన్నారు .

1985లో రాజీవ్ గాంధీ పాలన కాలంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు వచ్చారని అప్పుడే సెంట్రల్స్ స్కూల్స్ నవోదయ , గురుకుల పాఠశాలలు వచ్చాయని అదే సమయంలో అందరి డబ్బుతో కొందరికి వసతులు కల్పించే ప్రక్రియ మొదలైందన్నారు . విద్యా బోధనలో దొంతరలు తీసుకు వచ్చారని ఖాసీం ఆరోపించారు . ఆధిపత్య ధోరణి పెరిగి విదేశీ కొలువులకు ఎగబాడడం జరిగిందని వైట్ కాలర్ ఎడ్యుకేషన్ పెరిగిందన్నారు . సామాన్య సంక్షేమ హాస్టళ్లలో అప్పట్లో ఒక విద్యార్థికి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తే నవోదయ పాఠశాలలో రూ . 12 లను ప్రభుత్వం ఖర్చు చేసిందని ఈ బేధభావం విద్యలో మధ్యస్తంగా ఆ తర్వాత స్థానంలో ఉన్న విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆయన తెలిపారు . రాజీవ్ కాలంలోనే ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా పుట్టుకు వచ్చి విద్యా బోధన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఖాసీం ఆరోపించారు .2014లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రావాలని భావించిన 2019లో కస్తూరి రంగరాజన్ అధ్యక్షునిగా నూతన కమిటీని ఏర్పాటు చేశారన్నారు .

ఆ కమిటీ 2020లో నివేదిక అందజేయగా 2021 సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యార్థి విధానం చట్టంగా రూపొందిందన్నారు . ఈ కమిటీలో ఆర్ఎస్ఎస్ అనుకూల వాదులు , ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు , విదేశీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండడంతో ఇది సామాన్యునికి వ్యతిరేకంగా రూపొందించబడిం న్నారు . ప్రస్తుతం దేశంలో ఉన్న 800 యూనివర్సిటీలు , 40వేల కళాశాలల స్థాయిని 100 యూనవర్సిటీలు , 15000 కళాశాలలకు కుదించాలని కమిటీ సిఫారసు చేసిందన్నారు . యూజిసిని పూర్తిగా రద్దు చేసిందని ఆయన తెలిపారు . నాక్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీల నుంచే భవిష్యత్తులో ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని అవి ఎక్కువ భాగం ప్రైవేటు యూనివర్సిటీలకే వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విద్య మరింత నిర్వీర్యం కానుందన్నారు . సమాజానికి ఉపయోగపడే విద్యా బోధన జరగకుండా పురాతన ఆశాస్త్రీయ పద్ధతులను తిరిగి విద్యా విధానంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు . దీనిని చైతన్యవంతమైన విద్యార్థులు వ్యతిరేకించాలన్నారు . నాణ్యమైన విద్య కోసం బహుముఖ పోరాటాలు జరగాలని అందుకు ఏఐఎస్ఎఫ్ నేతృత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు . ఈ సెమినార్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఇంచార్జి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి , యర్రా బాబు , శింగు నర్సింహారావు , సిహెచ్ సీతామహాలక్ష్మీ , తాటి వెంకటేశ్వరరావు , పోటు కళావతి , ఎఐఎస్ఎఫ్ నాయకులు రావి శివరామకృష్ణ , పుట్టా లక్ష్మణ్ , ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సిద్ధినేని కర్ణకుమార్ , ఏఐఎస్ఎఫ్ నాయకులు తోట రామాంజనేయులు , మడుపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటీకాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Related posts

Complaint to Amit shah: మితిమీరిన జగన్ రెడ్డి అరాచకాలు

Satyam NEWS

ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

Bhavani

ఈ జీవాయుధాన్ని నిర్వీర్యం చేయడం మన చేతుల్లోనే ఉంది

Satyam NEWS

Leave a Comment