గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర గిరిజన , మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించారు.
అమ్రాబాద్ మండలం మన్ననూరు మండల కేంద్రంలో కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన భవన్ ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు పదర మండలం మద్దిమడుగు లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మన్ననూరు లో గిరిజన భవన్ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 30 లక్షల గిరిజనుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన ముందు ఉన్న లక్ష్యమని అన్నారు. గిరిజనుల కోసం ఐ టి డి ఎ ప్రాంతాలలో గిరిజన భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
అలాగే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో రెండు ఎకరాల స్థలంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో గిరిజనుల కోసం సేవాలాల్ భవనాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు. ఐటిడిఏ లలో 4 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన భవనాలు నిర్మించిన ఘనత తమదే అని అన్నారు.
రాష్ట్రంలోని ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐ టి డి ఎ ల ద్వారా గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మన్ననూరు ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని, ఇందులో ట్రైకార్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల కోసం హైదరాబాదులో ఐఏఎస్, గ్రూప్ వన్, ఆర్ ఆర్ బి, బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నామని, గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో 1100 గురుకుల సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మన్ననూరు ప్రాంత అభివృద్ధికి అవసరమైతే అదనపు పథకాలను ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అమ్రాబాద్ ఎత్తు ప్రాంతానికి సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అంగన్వాడి కార్యకర్తలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలను సొంత పిల్లలుగా భావించి పౌష్టికాహారం అందించాలని కోరారు.
అచ్చంపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ మారు మూల వెనుకబడిన, అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న మన్ననూరు, అమ్రాబాద్ ప్రాంతానికి సాగు నీరు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఇందుకుగాను పూర్తి సహకారం అందించాలని అలాగే మన్ననూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనుల, అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు.
శాసన మండల సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఐ సి డి ఎస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి వారికి చీర సారె లను అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి, ఎస్.సి,ఎస్ టి కమిటీ సభ్యులు రామ్ బల్ నాయక్, స్టానిక ప్రజాప్రతినిధులు,ఐటిడిఎ పి ఓ,గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి,సంక్షేమ అధికారి ప్రజ్వల, తదితరులు పాల్గొన్నారు.